Share News

తోతాపురి టన్నుకు రూ.30వేలి వ్వండి

ABN , Publish Date - Jun 17 , 2024 | 01:38 AM

మామిడి రైతుల వెతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు.

తోతాపురి టన్నుకు రూ.30వేలి వ్వండి

సీఎం చొరవతో పల్ప్‌ ఫ్యాక్టరీలకు కలెక్టర్ల ఆదేశాలు

ధరల పతనంపై చంద్రబాబు దృష్టికి చంద్రగిరి ఎమ్మెల్యే

తీసుకెళ్లడంతో కదలిక జూ తీరనున్న మామిడి రైతుల వెతలు

తిరుపతి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): మామిడి రైతుల వెతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి ధరల పతనంపై రైతులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీకి ఫిర్యాదు చేశారు. విషయాన్ని ఆయన వెంటనే సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. సీఎం చొరవతో కలెక్టర్లలో కదలిక వచ్చింది. తోతాపురి టన్నుకు రూ.30వేల చొప్పున రైతులకు పల్ప్‌ ఫ్యాక్టరీలు చెల్లించాలంటూ చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు షన్మోహన్‌, ప్రవీణ్‌కుమార్‌ ఆదివారం ఆదేశాలిచ్చారు. అంతకన్నా తక్కువ చెల్లిస్తే కఠిన చర్యలు ఉంటాయనీ హెచ్చరించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2.87 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. చిత్తూరు జిల్లా పరిధిలో 1.50 లక్షల ఎకరాలు, తిరుపతి జిల్లా పరిధిలో 1.37 లక్షల ఎకరాలు చొప్పున వుంది. ఉమ్మడి జిల్లాలో సాగయ్యే మామిడి పంటలో 90 శాతం తోతాపురి రకం కాగా.. మిగిలిన పది శాతం టేబుల్‌ వెరైటీలుగా పేర్కొనే బేనీషా, మల్‌గూబా తదితర రకాలున్నాయి. టేబుల్‌ వెరైటీలకు ఏటా మంచి ధరే పలుకుతుండగా 90 శాతం సాగయ్యే తోతాపురి మాత్రం దిగుబడి యావత్తూ జిల్లాలోని 30 పల్ప్‌ ఫ్యాక్టరీలపై ఆధారపడి ధరలు పలుకుతుంటాయి. సాధారణ స్థితిలో ఎకరాకు 8-10 టన్నుల దిగుబడి రావాలి. అయితే ఈసారి ప్రతికూల పరిస్థితులతో దిగుబడి తగ్గింది. అకాల వర్షాలకు, ఈదురు గాలులకు మామిడి నేలరాలింది. అందువల్ల ప్రస్తుత సీజన్‌లో ఎకరాకు ఒకటి నుంచి రెండు టన్నుల్లోపే దిగుబడి వచ్చింది. దామలచెరువు, చిత్తూరు, బంగారుపాళెం, తిరుపతిలో మండీలతో కూడిన మార్కెట్లు వుండగా.. వ్యాపారులు అధికారికంగా దిగుబడి కొనుగోలు చేసే ర్యాంపులు 30 దాకా వున్నాయి. వీటిలో టన్నుకు రూ.19వేల నుంచి 21వేల వరకూ ధర పలుకుతుండగా.. ఒక్క జైన్‌ పల్ప్‌ ఫ్యాక్టరీ మాత్రం రూ.23వేల చొప్పున చెల్లిస్తోంది. అసలే దిగుబడి తగ్గిపోయి ఆదాయం కోల్పోతున్న రైతులు వచ్చిన కొద్దిపాటి దిగుబడికి కూడా తగిన ధర పలకక పోవడంతో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. టన్నుకు రూ.30వేల చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పల్ప్‌ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, వ్యాపారులు స్పందించకపోవడంతో మామిడి రైతులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీని ఆశ్రయించారు. ధరల పతనంపై మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన మామిడి రైతుల గోడు నేరుగా సీఎం చంద్రబాబు దృష్టి కి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చొరవతో రెండు జిల్లాల కలెక్టర్లూ రంగంలోకి దిగారు. తోతాపురి రకం మామిడి టన్నుకు రూ.30వేల చొప్పున ధర చెల్లించాలని పల్ప్‌ ఫ్యాక్టరీల యాజమాన్యాలను ఆదేశించారు.

Updated Date - Jun 17 , 2024 | 01:38 AM