Share News

నేడే గరుడ సేవ

ABN , Publish Date - Oct 08 , 2024 | 01:20 AM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ మొదలై రాత్రి 11.30 గంటల వరకు జరగనుంది.

నేడే గరుడ సేవ
రాంభగీచ వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్‌

తిరుమల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ మొదలై రాత్రి 11.30 గంటల వరకు జరగనుంది. పెరటాశి మాసం చివరి వారం కావడంతో గరుడ సేవకు భక్తులు భారీగా వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు విశిష్ట స్థానం ఉంది. ఆలయంలోని మూలవర్లకు అలంకరించే సహస్రనామమాల, లక్ష్మీహారం, మకరకంటి, పచ్చ, సూర్యకఠారి, ప్రభుత్వం సమర్పించిన నూతన పట్టువస్త్రాలు తదితరాలతో గరుత్మంతుడిని అధిరోహించే మలయప్పకు అలంకరించడం విశేషం. చెన్నైకి చెందిన అంబ్రల్లా చారిటీస్‌ సమర్పించే గొడుగులను ఉపయోగిస్తారు. అందుకే ఈ వాహనంలో మూలమూర్తి అవహించి భక్తులను అనుగ్రహిస్తారని ఐతిహ్యం. మహావిష్ణువుకు ప్రధాన వాహనమైన వైనతేయుడికి ఉత్సవాలలో అత్యంత ప్రాధాన్యముంది. మొదటి రోజున గరుడపటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేసి ఉత్సవాలు ప్రారంభం కావడమే దీనికి నిదర్శనం. అలాగే ముల్లోకాల దేవతలు కూడా గరుడసేవలో స్వామిని దర్శించడానికి వస్తారని పురాణోక్తి. ఇక, మంగళవారం ఉదయం మోహనీ రూపం ధరించి మలయప్పస్వామి దంతపల్లకీలో తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తోడుగా శ్రీకృష్ణస్వామి మరో పల్లకీలో వేంచేస్తారు.

పూర్తయిన ఏర్పాట్లు

గరుడసేవకు సోమవారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తిచేశారు. గ్యాలరీల్లోకి ప్రవేశం, నిష్క్రమణ సమయాల్లో తోపులాటలు, తొక్కిసలాట లేకుండా పటిష్టమైన బ్యారికేడ్లు, క్యూలైన్లు సిద్ధం చేశారు. తిరుమలతో దాదాపు 25 ప్రదేశాల్లో 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్‌ స్థలాలు నిండిపోతే వాహనాలను తిరుపతిలోనే ఆపేస్తారు. తిరుపతిలో అదనపు పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేశారు. తిరుమల ఘాట్‌రోడ్లలో సోమవారం రాత్రి 9 నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్రవాహనాల అనుమతిని రద్దు చేశారు. మాడవీధుల్లో మొబైల్‌ క్లినిక్‌లు, 12 అంబులెన్స్‌లు, వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు. గ్యాలరీల్లోకి రాలేని భక్తులు గరుడ సేవను తిలకించడానికి 28 భారీ హెచ్‌డీ డిజిటల్‌ స్ర్కీన్లు ఉంచారు. దాదాపు ఏడు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,750 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది కూర్చునే అవకాశముంది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఔటర్‌ రింగురోడ్డులో వేచిఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవిందనిలయం నార్త్‌ వెస్ట్‌ కార్నర్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా అనుమతించి దర్శనం కల్పించనున్నారు.

Updated Date - Oct 08 , 2024 | 01:20 AM