Share News

పిడుగుల బీభత్సం

ABN , Publish Date - Jun 03 , 2024 | 02:21 AM

జిల్లాలో పలుచోట్ల పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఉదయం పిడుగుపాటుకు పుత్తూరు మండలంలో ఐదు ఆవులు మృతి చెందాయి.

పిడుగుల బీభత్సం

-పుత్తూరులో 5 ఆవులు మృతి

-ఈదురుగాలులతో విద్యుత్‌శాఖకు నష్టం

తిరుపతి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఉదయం పిడుగుపాటుకు పుత్తూరు మండలంలో ఐదు ఆవులు మృతి చెందాయి. శనివారం రాత్రి కేవీబీపురంలో వాటర్‌ ట్యాంక్‌పై పిడుగుపడడంతో ధ్వంసమైంది. పలు మండలాల్లో ఈదురుగాలులు కారణంగా విద్యుత్‌శాఖకు నష్టం వాటిల్లింది. పిచ్చాటూరు మండలంలో ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. వెంకటగిరిలో ఆదివారం మధ్యాహ్నం తేలికపాటి చిరుజల్లులతో వాతావరణం చల్లబడింది.

నష్టపరిహారం ఇప్పించండి

పుత్తూరు: మండలంలోని పరమేశ్వరం మంగళం పంచాయతీలోని జయరాణీపురం గ్రామ పొలిమేరలో ఓ చెట్టుకింద ఆవులు గడ్డిమేస్తుండగా పెద్ద శబ్దంతో ఆదివారం ఉదయం పిడుగు పడింది. దీంతో ఐదు ఆవులు షాక్‌కు గురై కుప్పకూలిపోయి మృతి చెందాయి.తనకు నష్టపరిహారం ఇప్పించాలని వాటి యజమాని శ్యామల.. ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు

పాకాల: ఆదివారం సాయంత్రం వీచిన బలమైన ఈదురు గాలులను బండపాకాల సమీపంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నేలకొరిగింది. గాదంకి, నేండ్రగుంట, కె.వడ్డేపల్లె పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో నాలుగు 25 కేవీ, మూడు 16 కేవీ, మూడు సింగిల్‌ ఫేస్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. రూ.10లక్షల మేర నష్టం వాటిల్లింది. మరమ్మతులు చేసి త్వరగా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తామని తిరుపతి రూరల్‌ ఈఈ వాసురెడ్డి, డీఈఈ నరేంద్ర తెలిపారు. మామిడి తోటల్లో అంతంత మాత్రమే కాసిన కాయలు రాలిపోవడంతో రైతులు నష్టపోయారు.

చిట్టత్తూరు, కాలేపల్లెలో భారీ వర్షం

రామచంద్రాపురం: చిట్టత్తూరు, కాలేపల్లె వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో భారీవర్షం కురిసింది. చిన్నపాటి కుంటలు నిండగా, కాలువలు ప్రవహించాయి. అక్కడక్కడా కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. రాయలచెరువుకట్ట కింద ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు తప్ప వర్షం కురవలేదు.

Updated Date - Jun 03 , 2024 | 02:21 AM