Share News

చెరువులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:56 AM

ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

చెరువులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి
చిన్నారుల మృతికి కారణమైన పచ్చిపాల ఓబన్న చెరువు

పాకాల, ఫిబ్రవరి 5: ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాకాల మండలం దామలచెరువు పంచాయతీ ఊటువంక గ్రామానికి చెందిన రామకృష్ణ, విజయలక్ష్మి దంపతుల కుమారులు పునీత్‌ (11), కన్నయ్య (9).. శేఖర్‌, జ్యోతి దంపతుల కుమారుడు తేజేశ్వర్‌ (9) గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. సోమవారం సాయంత్రం పాఠశాల ముగిశాక ఇంటికి వచ్చారు. స్కూల్‌ బ్యాగులు ఇళ్ల వద్ద పెట్టేసి, గ్రామ సమీపంలోని పచ్చిపాల ఓబన్న చెరువు వద్దకెళ్లి ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తూ తేజేశ్వర్‌ చెరువులో పడిపోయాడు. పునీత్‌, కన్నయ్యలు గమనించి తేజేశ్వర్‌ని రక్షించడానికి ప్రయత్నించి, వీరూ నీటిలో మునిగిపోయారు. గ్రామస్తులకు తెలిసి వారొచ్చి వెలికి తీసేలోపే ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కూలీ పనులకు వెళ్లి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు గుండెలు పగిలేలా రోదించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. పాకాల సీఐ రాజగోపాల్‌ ప్రమాదస్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:57 AM