Share News

ఆ ఇద్దరే నా భర్తను చంపేశారు

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:26 AM

మినీ లారీ వాహన యజమాని, ఆటో డ్రైవర్‌ కలిసి తన భర్తను చంపేశారని మంజుల ఆరోపించారు.

ఆ ఇద్దరే నా భర్తను చంపేశారు
వన్‌టౌన్‌ స్టేషన్‌ వద్ద ధర్నాలో రోదిస్తున్న మృతుడి కుటుంబీకులు, బంధువులు

వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ వద్ద భార్య, బంధువుల ధర్నా

అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు

అనుమానితులను విచారిస్తున్న పోలీసులు

చిత్తూరు, మార్చి 23: మినీ లారీ వాహన యజమాని, ఆటో డ్రైవర్‌ కలిసి తన భర్తను చంపేశారని మంజుల ఆరోపించారు. అతడు డ్రైవింగ్‌కు వెళ్లగా.. శవాన్ని ఆటోలో ఇంటికి తీసుకొచ్చారని, అనుమానం వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మృతికి కారణమైన ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ చిత్తూరు వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట శనివారం కుటుంబీకులు, బంధువులతో కలిసి ఆమె ధర్నా చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జీడీనెల్లూరు మండలం పాచిగుంట దళితవాడకు చెందిన సుధాకర్‌(42) నాగరాజు వద్ద మినీ లారీ డ్రైవరుగా కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బాడుగకు వెళ్లిన సుధాకర్‌ శనివారం కొంగారెడ్డిపల్లె వద్ద రోడ్డు పక్కనే వాహనాన్ని ఆపి మద్యం తాగారు. ఆ మత్తులో అలాగే పడుకుని ఉండిపోవడంతో వాహన యజమాని నాగరాజు వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. మద్యం మత్తులో లారీలోనే పడుకుని ఉన్న సుధాకర్‌ను చూసి.. మృతుడికి వరుసకు బావమరిది అయిన ఆటో డ్రైవర్‌ రఘుకు ఫోన్‌ చేసి పిలిపించారు. సుధాకర్‌ను ఆటోలో తీసుకెళ్లి ఇంటి వద్ద వదిలేయాలని చెప్పారు. దాంతో తన ఆటోలో అతడిని పాచిగుంటకు తీసుకెళ్లారు. ఇంటి వద్ద మృతుడి భార్య లేపినా సుధాకర్‌ లేవకపోవడంతో సమీపంలోని తూగుండ్రం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దాంతో మృతుడి బంధువులు చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద స్థితిలో మృతిగా వన్‌టౌన్‌ ఎస్‌ఐ షేక్షావలి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని సీఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబీకులు, బంధువులు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ వద్ద ధర్నాకు దిగారు. ‘నా భర్త సుధాకర్‌ను వాహన యజమాని నాగరాజు చంపేశాడు. నా భర్తకు, ఓనర్‌కు మధ్య కొంతకాలంగా తగాదా ఉంది. ఈ తగాదా కారణంగానే చంపేసి ఉంటాడు. చంపేసిన తరువాత బంధువైన రఘు ఆటోలో ఇంటికి పంపించాడు. ఈ వ్యవహారంలో రఘుకు కూడా సంబంధం ఉంది’ అంటూ మృతుడి భార్య మంజుల ఆరోపించారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Mar 24 , 2024 | 12:26 AM