ఏటీఎంలో దొంగలు పడ్డారు
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:45 AM
గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి రూ.25.98 లక్షల అపహరణ పక్కా ప్రణాళికతో చోరీ

గుడిపాల, జూలై 7: కారులో నలుగురు వచ్చారు. 15-20 నిమిషాల్లో ఏటీఎం మిషన్ గ్యాస్ కట్టర్‌తో కట్‌చేసి.. రూ.25.98 లక్షలు ఎత్తుకెళ్లారు. ఇలా ముందస్తు ప్రణాళిక ప్రకారం గుడిపాలలో మెయిన్‌రోడ్డు పక్కనే ఉన్న ఏటీఎంలో దొంగతనానికి పాల్పడ్డారు.
చిత్తూరు-వేలూరు జాతీయ రహదారి పక్కన.. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. ఆదివారం వేకువజామున 3.50-4.20 గంటల మధ్యలో చిత్తూరు వైపు నుంచి నలుగురు వ్యక్తులు కారులో ఏటీఎం వద్దకు చేరుకున్నారు. అప్పటికే రెక్కీ నిర్వహించిన వీరు.. ముఖాలకు మాస్కులు ధరించారు. గ్యాస్ కట్టరుతో లోపలకు వెళ్లి ఏటీఎం మిషన్‌ను కట్ ఒకరు చేస్తుండగా... మరొకరు ఆ డోర్‌ను లాగాడు. మరో వ్యక్తి ఏటీఎంలో ఉన్న డబ్బులను తీసుకెళ్లి కారులో పెట్టాడు. ఇలా 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో ఏటీఎంలో ఉన్న రూ. 25.98 లక్షలను తీసుకెళ్లారు. గ్యాస్ కట్టర్‌తో కట్ చేయడంతో ఆ పొగంతా ఏటీఎం నుంచి రావడంతో అప్పుడే పనులకు వెళ్లడానికి వచ్చిన వారు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డితో కలిసి ఎస్పీ మణికంఠ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ నిపుణులు ఏటీఎం మిషన్ల వద్ద వేలిముద్రలను సేకరించారు. ఏటీ ఎంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఉంచేటప్పుడు సెక్యూరిటీ గార్డును ఎందుకు నియమించలేదని బ్యాంకు అధికారులను ఎస్పీ ప్రశ్నించారు. ఏటీఎంలో సీసీ కెమెరాలు, సెన్సార్లు పనిచేసుంటే దొంగలు ప్రవేశించినప్పుడు సిగ్నల్స్ వచ్చి సైరన్ మోగేదని తెలిపారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కనపడుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు, విశ్వనాథరెడ్డి, ఉలసయ్య, ఎస్‌ఐలు నరేంద్రకుమార్, అనిల్‌కుమార్, లోకేష్, లక్ష్మీకాంత్, క్లూస్ టీం దినేష్, ఇంటెలిజెన్స్ అధికారి జయరాం, పోలీసులు పాల్గొన్నారు.
త్వరలోనే ఏటీఎం దొంగలను పట్టుకుంటాం
సాంకేతికతను వినియోగించి త్వరలోనే ఏటీఎం దొంగలను పట్టుకుంటామని ఎస్పీ మణికంఠ అన్నారు. ఆదివారం ఆయన సఘటనా స్థలం వద్ద మీడియాతో మాట్లాడారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలో పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, సీసీ ఫుటేజీలనూ పరిశీలిస్తున్నామన్నారు. సెక్యూరిటీ వ్యవస్థలో లోపాలుంటే సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలారం, సెన్సార్లు సమర్థంగా పనిచేసేలా ఉన్న పరికరాలను మార్చడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. దర్యాప్తులో నిర్దిష్ట ఆధారాలు సేకరించి దోషులను శిక్షిస్తామన్నారు. అనుమానాస్పద రీతిలో ఎవరైనా కనిపిస్తే సంబంధిత పోలీసులకు లేదా డయల్ 100, 112 లేదా 94409 00005 నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఏడాది కిందటా చోరీయత్నం
ఇదే ఏటీఎంను ఏడాది కిందట గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు తొలుత సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎం మిషన్‌ను పగులగొట్టే ప్రయత్నం చేయగా.. పెద్ద ఎత్తున శబ్ధం రావడంతో చుట్టుపక్కల ఎవరైనా వచ్చేస్తారన్న అనుమానంతో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఏటీఎంలో అలారం, సెన్సార్లు పనిచేసేలా చర్యలు తీసుకుని ఉంటే చోరీని అరికట్టి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు.