Share News

అప్పుడు సునీల్‌.. ఇప్పుడు ఎంఎస్‌ బాబు

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:25 AM

జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల్లో తొలి తిరుగుబాటు జెండా ఎగిరింది. అణచిపెట్టుకున్న అవమానం దుఃఖాగ్రహంగా మారి కట్టలు తెంచుకుంది.

అప్పుడు సునీల్‌.. ఇప్పుడు ఎంఎస్‌ బాబు
2019 ఎన్నికల సందర్భంగా జగన్‌ ఇంటి వద్ద వేచి ఉన్న నాటి ఎమ్మెల్యే సునీల్‌

వైసీపీలో దళిత ఎమ్మెల్యేలే టార్గెట్‌

చిత్తూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల్లో తొలి తిరుగుబాటు జెండా ఎగిరింది. అణచిపెట్టుకున్న అవమానం దుఃఖాగ్రహంగా మారి కట్టలు తెంచుకుంది. ఐదేళ్లు ఎమ్మెల్యేగా చేసిన సేవలన్నీ తాడేపల్లి ప్యాలెస్‌ తీసుకున్న నిర్ణయం ముందు బదాబదలయ్యాయి. ఐప్యాక్‌ టీం వేసిన తూకంలో నీళ్లకన్నా పలచన అయిపోయానంటూ పూతలపట్టు దళిత ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు మంగళవారం ప్రకటించిన ఆవేదన ప్రజల్లో చర్చగా మారింది. నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. నా బీసీలు.. నా మైనారిటీలు.. అంటూ సభల్లో హోరెత్తే మాటల వెనుక ఉన్నది ఇదా అని దళిత, బీసీ, మైనారిటీ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి.

పూతలపట్టు నుంచి ఎంఎస్‌ బాబుకు టికెట్‌ లేదని జగన్‌రెడ్డి తేల్చేయడంతో ఆయన మంగళవారం మీడియా ముందు కడుపుచించుకున్నారు. తన బాధ పంచుకున్నారు. వైసీపీ అధిష్ఠానానికి అనేక ప్రశ్నలు సంధించారు. అయితే 2019 ఎన్నికల సమయంలోనూ పూతలపట్టు విషయంలో జగన్‌ ఇదే తీరులో నిర్ణయం తీసుకున్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పదవిలో ఉన్నా దళితులకు వైసీపీలో పవర్‌ ఉండదని అంటున్నారు. మండల స్థాయిలో కూడా ఒక సామాజికవర్గం నాయకులకు అణిగిమణిగి ఉండాల్సి వస్తోందని అంటున్నారు. ఇన్ని భరించినా మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి టికెట్‌ లేదంటూ తూచ్‌ అనేయడం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు వైసీపీలోని దళితవర్గాల నుంచి వినిపిస్తోంది.

జగన్‌ ఇంటి గేటు వద్ద రోజంతా పడిగాపులు కాసినా..

2014 ఎన్నికల్లో పూతలపట్టు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్‌ సునీల్‌కుమార్‌ను 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్ఠానం ఘోరంగా అవమానించింది. పిలిపించి టికెట్‌ లేదని గౌరవంగా కూడా చెప్పలేదు. అప్పట్లో టికెట్‌ మళ్లీ తనకే ఇవ్వమంటూ అడిగేందుకు లోట్‌సపాండ్‌లోని జగన్‌ ఇంటికి వెళ్లిన సునీల్‌కుమార్‌ను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. జగన్‌ ఇంటి గేటు వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సునీల్‌కుమార్‌ రోజంతా నిలబడిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి.

ఎంత తలొగ్గినా...

సునీల్‌కుమార్‌కు టికెట్‌ ఇవ్వకపోవడం వెనుక జిల్లాను తన గుప్పెట్లో పెట్టుకున్న పెద్దనాయకుడి పాత్ర ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పట్లో సునీల్‌కుమార్‌ను కాదని ఎంఎస్‌ బాబుకు టికెట్‌ ఇప్పించిన ఆ పెద్దాయనే ఇప్పుడు బాబుకూ ఎసరు పెట్టారని అంటున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు ఈ ఐదేళ్ల పాటు స్వతంత్రంగా పని చేయలేకపోయారనేది బహిరంగ సత్యం. ప్రతి విషయంలోనూ పార్టీ పెద్దలు, మంత్రులు జోక్యం చేసుకునేవారు. ఆయన కూడా ధిక్కారంగా ఎన్నడూ వ్యవహరించేవారు కాదు. యాదమరి, తవణంపల్లె, బంగారుపాళ్యం, ఐరాల, పూతలపట్టు మండలాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే పెత్తనం చెలాయించారు. వార్డు మెంబర్‌ నుంచి జడ్పీటీసీ వరకు ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా తాము సూచించిన వారికి పదవులు దక్కేలా చూసుకున్నారు. ఎమ్మెల్యే వద్దన్నచోట ఇండిపెండెంట్లను రంగంలోకి దింపి గెలిపించుకున్నారు. కాణిపాకం ట్రస్టు బోర్డు చైర్మన్‌, బంగారుపాళ్యం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంటి పదవుల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఉన్నారు. బంగారుపాళ్యం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మాజీ జడ్పీటీసీ మనోహర్‌ భార్య సెల్వికి ఎమ్మెల్యే సిఫార్సు చేసినా, పట్టించుకోని అధిష్ఠానం పరమేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. ఐరాల మండలంలో ఓ ఎంపీటీసీ స్థానానికి ఎమ్మెల్యే బీఫాం ఇచ్చిన వ్యక్తిని కాదని అక్కడ కూడా ఇండిపెండెంట్‌ అభ్యర్థిని నిలబెట్టి రూ.లక్షలు ఖర్చు పెట్టి గెలిపించుకున్నారు. యాదమరిలో ఓ తహసీల్దార్‌ను ఎమ్మెల్యే బదిలీ చేయిస్తే, మండలంలో ప్రాబల్యం ఉన్న ఓ నేత అదే తహసీల్దార్‌ను సాయంత్రానికి తెచ్చుకున్నారు. ఇలాంటి ఉదాహరణలు నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రతి మండలానికో రెడ్డి నాయకుడు పెత్తనం చెలాయిస్తూ, ఆయా మండలాల్లో ఎమ్మెల్యే మాట చెల్లకుండా డమ్మీగా చిత్రీకరించారు. అయినా ఎన్నికలు వచ్చాక నింద ఎంఎస్‌ బాబు మీద మోపేసి టికెట్‌ ఎగ్గొట్టడం విశేషం.

అసలేం జరిగింది?

2019లో ఎమ్మెల్యేగా గెలిచాక ఇప్పటిదాకా ఒక్కసారి కూడా సీఎం జగన్‌ను నేరుగా కలిసి మాట్లాడే అవకాశం ఎంఎస్‌ బాబుకు లభించలేదు. కాణిపాకంలో బ్రహోత్సవాలకు ఆహ్వానించేందుకు మాత్రం ఓసారి కొందరితో కలిసి వెళ్లి ఆయన సీఎంని కలిశారు. నియోజకవర్గ పరిస్థితుల్ని చెప్పుకునేందుకు అనేకసార్లు సీఎం అపాయింట్‌మెంట్‌ కోనినా ఫలితం లేదని ఎంఎస్‌ బాబు చెప్పారు. విచిత్రం ఏమిటంటే.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడం లేదని చెప్పడానికి మాత్రం సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. సుమారు వారం కిందట ఎంఎస్‌ బాబుతో సీఎం జగన్‌ నేరుగా భేటీ అయ్యారు. ‘ఈసారి నీకు టికెట్‌ ఇవ్వడం కుదరడం లేదు. సర్వేల్లో నీ గురించి వ్యతిరేకంగా వచ్చింది. మనం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తాం’అని చెప్పినట్టు తెలుస్తోంది. అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో సీఎం మనసు మార్చుకోవచ్చని ఆయన నమ్మినట్టు చెబుతున్నారు. అయితే సోమవారం పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలు కూడా టికెట్‌ ఈసారి లేదనే విషయాన్ని బాబుకు తేల్చి చెప్పేశారని, దీంతో మధనపడ్డ ఆయన మంగళవారం మీడియా ముందు మనసలో ఉన్నదంతా బయటపెట్టేశారని తెలుస్తోంది.

ఎంఎస్‌ బాబు ఆవేదన..

‘‘ఈ ఐదేళ్ల పాటు పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్లు నడుచుకున్నా. ఇప్పుడు వ్యతిరేకత ఉందంటే బాధ్యత ఎవరిది. వ్యాపారాలను, కుటుంబాన్ని వదిలేసి కష్టపడితే ఇదా ఫలితం? నేనేం పాపం చేశాను. దళితుడిగా పుట్టడమే వేస్టా?’’

‘‘మాటిమాటికి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటారే గానీ, మాకేం న్యాయం చేస్తున్నారు? రెడ్లు చెప్పిందే నేను చేశాను. సీఎం గారూ.. దళితులను మోసం చేయొద్దు.’’

‘‘చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వ్యతిరేకత ఉన్నా ఓసీలకు మళ్లీ టికెట్లు ఇస్తున్నారు. డబ్బులిస్తే ఇష్టమొచ్చినట్లు ఐప్యాక్‌ సర్వే ఫలితాలను మారుస్తుంది. మరి వ్యతిరేకత వచ్చిందంటూ దళితులనే మార్చడమేంటో నాకు అర్థం కావడం లేదు’’

Updated Date - Jan 03 , 2024 | 12:25 AM