Share News

ఊరంతా జాతర

ABN , Publish Date - May 22 , 2024 | 01:00 AM

ఊరంతా జాతర చేసుకుంది. అమ్మలగన్న అమ్మకు పొంగళ్లు పెట్టుకుని ప్రణమిల్లింది. అంబళ్లు పోసి తాపం తీర్చింది. కోర్కెలు తీర్చే కొంగు బంగారాన్ని కళ్లకద్దుకుని భక్తి పారవశ్యంతో చిందేసింది.వారం పాటు రోజుకో అలంకరణతో దర్శనమిచ్చిన తాతయ్యగుంట గంగమ్మకు మంగళవారం ఉదయాత్పూర్వం మహాభిషేకం చేసి శాంతింపజేశారు. స్వల్ప తోపులాట మినహా మహాభిషేక కార్యక్రమం ప్రశాంతంగా సాగింది.

 ఊరంతా జాతర

తిరుపతి, మే 21 (ఆంధ్రజ్యోతి): ఊరంతా జాతర చేసుకుంది. అమ్మలగన్న అమ్మకు పొంగళ్లు పెట్టుకుని ప్రణమిల్లింది. అంబళ్లు పోసి తాపం తీర్చింది. కోర్కెలు తీర్చే కొంగు బంగారాన్ని కళ్లకద్దుకుని భక్తి పారవశ్యంతో చిందేసింది.వారం పాటు రోజుకో అలంకరణతో దర్శనమిచ్చిన తాతయ్యగుంట గంగమ్మకు మంగళవారం ఉదయాత్పూర్వం మహాభిషేకం చేసి శాంతింపజేశారు. స్వల్ప తోపులాట మినహా మహాభిషేక కార్యక్రమం ప్రశాంతంగా సాగింది. సర్వాలంకారశోభితురాలైన గంగమ్మకు అర్చకులు వజ్రకిరీటధారణ చేశారు.అభిషేకానంతర దర్శనం మొదలుకొని నిర్విరామంగా గంగమ్మ భక్తులకు దర్శనమిచ్చారు.అర్ధరాత్రి నుంచే కొందరు భక్తులు పొర్లుదండాలు, అడుగడుగు దండాలు పెట్టుకుంటూ, వేషాలు వేసుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.టీపీ ఏరియాలోని తాళ్లపాక పెదగంగమ్మ, చింతల చేనులోని ముత్యాలమ్మ,దాసరిమఠంలోని మాతమ్మ, పల్లెవీధిలోని వేశాలమ్మ, చింతకాయవీధిలోని కరిమాను గంగమ్మలతోపాటు నగరంలో వున్న చిన్న గంగమ్మ ఆలయాల్లో కూడా జాతర సంబరాలు అంబరాన్నంటాయి.మంగళవారం భక్తులు పలు పౌరాణిక, జానపద వేషాలు ధరించి అమ్మవార్లను దర్శించుకున్నారు. గత ఏడాదికన్నా ఈసారి సప్పరాలు ధరించిన భక్తులు పెద్దఎత్తున కనిపించారు. నగరంలో ఎక్కడ చూసినా అంబళ్ల పంపిణీ, అన్నదాన వితరణ కార్యక్రమాలు విరివిగా జరిగాయి.మంగళవారం అర్ధరాత్రి తర్వాత విశ్వరూప స్తూపానికి అమ్మవారి విశ్వరూపం తయారు చేయడం మొదలుటపెట్టారు. బుధవారం తెల్లవారుజామున చెంపనరుకుడుతో గంగజాతర పరిసమాప్తి కానుంది.

Updated Date - May 22 , 2024 | 01:00 AM