Share News

నిరుద్యోగ యువతను మోసం చేశారు

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:42 AM

అధికారంలోకి రాగానే ఉద్యోగాలిస్తానని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారంటూ ముఖ్యమంత్రి జగన్‌పై బుధవారం కుప్పం పోలీసుస్టేషన్‌లో తెలుగు యువత నాయకులు ఫిర్యాదు చేశారు.

నిరుద్యోగ యువతను మోసం చేశారు
కుప్పం టీడీపీ కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేస్తున్న తెలుగు యువత నాయకులు

సీఎం జగన్‌పై కుప్పం, వెదురుకుప్పం పోలీసు స్టేషన్లలో తెలుగు యువత ఫిర్యాదు

కుప్పం, జనవరి 10: అధికారంలోకి రాగానే ఉద్యోగాలిస్తానని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారంటూ ముఖ్యమంత్రి జగన్‌పై బుధవారం కుప్పం పోలీసుస్టేషన్‌లో తెలుగు యువత నాయకులు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం కార్యాలయం నుంచి ప్రదర్శనగా పోలీసు స్టేషన్‌ బయలుదేరిన నాయకులు, అక్కడ ఎస్‌ఐ సుబ్బారెడ్డిని కలిసి ఫిర్యాదు అందజేశారు. అధికారంలోకి రాగానే 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని చెప్పి నిలువునా నమ్మించి ముంచేశారని విమర్శించారు. సీఎంఐ ప్రకారం రాష్ట్రంలో 2019 నాటికి 4 శాతం ఉన్న నిరుద్యోగిత 2023 డిసెంబరు నాటికి 6.6 శాతానికి పెరిగిందన్నారు. ఉపాధి, ఉద్యోగాల్లేక రాష్ట్రంలో గత మూడేళ్లలో 21,575 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ జగన్‌రెడ్డి ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణాలో ప్రథమస్థానంలో ఉన్నట్లు ఏసీబీ నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో నివేదిక చెబుతోందన్నారు. మరోఓవైపు గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు బానిసలై ఏపీలో 571 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడినట్లు క్రైబ్‌ బ్యూరో నివేదికలో ఉందన్నారు. వీటన్నింటిపై విచారించి సీఎంపై చర్యలు తీసుకుని రాష్ట్ర యువతకు న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో పోలీసులను కోరారు. అంతకుముందు టీడీపీ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు వెంకటేశ్‌, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం మణి, ప్రధాన కార్యదర్శి శంకర్‌, చలం, అశోక్‌, సుబ్బు, సుబ్రమణ్యం, రాజేంద్ర, వినోద్‌, గణేశ్‌, విజయ్‌, మనోహర్‌, బాలాజీ, గణపతి తదితరులు పాల్గొన్నారు.

వెదురుకుప్పం పోలీసులకూ ఫిర్యాదు

వెదురుకుప్పం: ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం జగన్‌ మోసం చేశారంటూ టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కో-ఆర్డినేటరు, తెలుగు యువత జీడీనెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడు గురుసాల కిషన్‌చంద్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఆ ఫిర్యాదులో పేర్కొని.. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఆయనతో పాటు టీడీపీ వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బట్టే చాణిక్యప్రతాప్‌, బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు శివరాం యాదవ్‌, నాయకులు రాజశేఖర్‌వర్మ, వెంకటరమణారెడ్డి, మునిరాజారెడ్డి, నాగరాజు, రామచంద్ర ఉన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:42 AM