వెయ్యేళ్ల గుడి.. ఈ గతి పట్టించారు!
ABN , Publish Date - Aug 06 , 2024 | 12:24 AM
చరిత్ర పట్ల మన నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంలా కనిపిస్తుంది నాగలాపురం మండలం టీపీపాళెంలోని ఈ శ్రీరాజగోపాల స్వామి ఆలయం.
సత్యవేడు/నాగలాపురం, ఆగస్టు 5 : చరిత్ర పట్ల మన నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంలా కనిపిస్తుంది నాగలాపురం మండలం టీపీపాళెంలోని ఈ శ్రీరాజగోపాల స్వామి ఆలయం. గోపురాలపై శిల్పాలు, శిల్పాలు చెక్కిన రాతి స్తంభాలు, సున్నపు మిశ్రమంతో తెల్లబండలపై నిర్మించిన ఈ ఆలయం వెయ్యేళ్ల కిందటిదని చెబుతారు. కీ.శ.1100లో పల్లవరాజులు నిర్మించినట్లు ఆధారాలున్నాయంటారు. ధూపదీప నైవేద్యాలతో ఒకనాడు అలరారిన రాజగోపాలస్వామి ఆలయం మాన్యాలు మాయం కావడంతో ఆదరణ కరువై శిథిల స్థితికి చేరుకుంది. పాతబడిన ఆలయం మనకెందుకు కొత్త ఆలయం నిర్మించుకుందామని 2019లో గ్రామానికి చెందిన వైసీపీ నేత, ప్రస్తుత సర్పంచ్ పళణి ప్రతిపాదన చేశారు. దాతల సహకారంతో తానే కొత్త గుడి నిర్మిస్తానని చెప్పారు.శిథిలావస్థకు చేరిన వాహన గోపురం, ధ్వజస్తంభం, ప్రహారీలకు మరమ్మతులు చేయిస్తానని అనుమతుల కోసం దేవదాయశాఖకు 2019లో విన్నవించుకున్నారు. ఇంకేం.. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే కావడంతో ఆగమేఘాల మీద అనుమతులు వచ్చేశాయి. అంతే ఆయన ఆలస్యం చేయకుండా పురాతన ఆలయంలో తవ్వకాలు మొదలు పెట్టేశారు. గోపురాలు కూల్చేశారు. ధ్వజస్తంభం తవ్వి తీసేశారు. కొత్త ఆలయం నిర్మించకపోగా ఉన్న పాత గుడినీ దాదాపుగా కూల్చేసి ఇలా మిగిల్చేశారు.
గుప్త నిధుల కోసమేనా?
టీపీపాళెంలోని శ్రీరాజగోపాల స్వామి ఆలయంలో గుప్తనిధులను వెలికి తీయడానికే ఇలా కూల్చేశారనే ప్రచారం ఈ ప్రాంతంలో జోరుగా సాగుతోంది. ఆలయ ప్రవేశ ద్వారం నుంచి, గర్భగుడి వరకు ఇష్టారీతిన జరిపిన తవ్వకాలను ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు. మరమ్మతులకంటూ అనుమతులు పొందిన వారు ఆలయం చుట్టూ 20 అడుగుల ఎత్తు వరకు పరదాలతో కప్పేసి, రాత్రి వేళల్లో ఆలయంలో భారీ యంత్రాలతో తవ్వకాలు ఎందుకు జరపాల్సి వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ధ్వజస్తంభం, బలిపీఠం, గర్భగుడి దగ్గర ముఫ్పై, నలభై అడుగుల లోతు వరకు తవ్వకాలు ఎందుకు జరపాల్సిన వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్ల కిందట భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపినపుడు, ఆ ధాటికి ఆలయ పరిసరాల్లోని నివాస గృహాలు వైబ్రేషన్‌కు గురయ్యాయని చెబుతున్నారు. ఆలయం కూల్చివేత వెనుక అప్పటి అధికార వైసీపీ బడా నేతలు కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కడప జిల్లాకు చెందిన ఒక వైసీపీ నేత ఆలయంపై కన్నేసి, స్థానిక నేతలతో కలిసి అభివృద్ధి పేరుతో ఆలయంలో తవ్వకాలు జరిపి నిధులు దోచుకున్నారనే వదంతులు కూడా ఈ ప్రాంతంలో వినిపిస్తున్నాయి. అసలు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆలయాన్ని ఆర్కియాలజీ అనుమతి లేకుండా ఎలా కూల్చేశారన్నదే విచిత్రం.మరమ్మతుల పేరుతో అనుమతులిచ్చిన దేవాదాయ శాఖ, ఆలయంలో జరుగుతున్న తవ్వకాలను ఎందుకు పర్యవేక్షించలేదో అర్ధం కాదు. కాగా ఈ విషయమై ఆలయ ఈవో లతను వివరణ కోరగా మరమ్మతులకోసం అనుమతులు పొందిన దాత పళణికి నోటీసులిచ్చామని తెలిపారు. ఆరు నెలల్లో ఆలయ పనులు పూర్తి చేయాలని ఆయనకు ఆదేశాలిచ్చామన్నారు. గడువులోగా పనులు పూర్తి కాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.