Share News

స్పీచు మారింది.. స్పీడు పెరిగింది

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:45 AM

రెండు రోజుల కుప్పం పర్యటనలో చంద్రబాబు స్పీచ్‌ మారింది. రొటీన్‌గా కాకుండా ప్రతి అంశాన్ని స్పష్టంగా, అర్థమయ్యేలా, ఆలోచింపజేసేలా ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళల జోలికి రావాలంటే భయపడేలా చేస్తానని ధైర్యాన్నిచ్చారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పడంతోనే సరిపెట్టకుండా.. ఎలా చేస్తామనేదీ వివరించారు

స్పీచు మారింది.. స్పీడు పెరిగింది
యువత సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు

చిత్తూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రెండు రోజుల కుప్పం పర్యటనలో చంద్రబాబు స్పీచ్‌ మారింది. రొటీన్‌గా కాకుండా ప్రతి అంశాన్ని స్పష్టంగా, అర్థమయ్యేలా, ఆలోచింపజేసేలా ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళల జోలికి రావాలంటే భయపడేలా చేస్తానని ధైర్యాన్నిచ్చారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పడంతోనే సరిపెట్టకుండా.. ఎలా చేస్తామనేదీ వివరించారు. వైసీపీ నాయకుల తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల గురించి ప్రస్తావించి.. తమ భవిష్యత్తుపై ప్రజలు ఆలోచింపజేసేలా చేశారు. తిరుపతి డాక్టర్‌ సునీత, వైజాగ్‌లో ఎన్‌ఆర్‌ఐ భూములు కోల్పయిన తీరును ప్రస్తావించి వైసీపీ అరాచకాలను ఎండగట్టారు. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే ఎంత దారుణ పరిస్థితులు ఉంటాయనేది వివరించారు. ఇక, గతంలోలాగా ఆలస్యం కాకుండా ప్రతి ప్రోగ్రాం కూడా షెడ్యూల్‌ ప్రకారమే జరిగింది. దీంతో చంద్రబాబు స్పీడు పెంచారని శ్రేణులు చెప్పుకొంటున్నారు. ఇక, తొలిరోజు మహిళలు రెండు గంటల ముందే సమావేశానికి వచ్చి చంద్రబాబు కోసం ఎదురుచూశారు. ఆయన వచ్చిన తర్వాత ఒకటిన్నర గంట సమావేశం జరిగినా ఎవరూ కదల్లేదు. ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. బహిరంగ సభకూ భారీగా జనం హాజరయ్యారు. చంద్రబాబు ప్రసంగం సాగినంత సేపు ఉత్సాహంగా కేకలు వేస్తూ కనిపించారు. ఇక, చంద్రబాబు పర్యటనలో చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావును, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌ను కుప్పం ప్రజలకు పరిచయం చేశారు. ప్రతి సమావేశంలోనూ వారితో మాట్లాడించారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులును అక్రమంగా జైలులో పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ ఆవేదన చెందారు. ముస్లింలతో కలిసి సోమవారం సాయంత్రం ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న చంద్రబాబు.. రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని దూరం చేయమని దువా చేశారు. రెండో రోజు యువతతో ముఖాముఖి నిర్వహించారు.

Updated Date - Mar 27 , 2024 | 12:45 AM