Share News

బడి ‘గంట’ పెరిగింది!

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:06 AM

ఉన్నత పాఠశాలల పని వేళలు గంట పెరిగింది. ప్రస్తుతం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తరగతులు నిర్వహిస్తుండగా, ఇకపై సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాలలు నడుస్తాయి.

బడి ‘గంట’ పెరిగింది!

ఫ హైస్కూళ్లలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలవరకు తరగతులు

ఫ 34 పాఠశాలల్లో నేటినుంచి ప్రయోగాత్మక పరిశీలన

తిరుపతి(విద్య), నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉన్నత పాఠశాలల పని వేళలు గంట పెరిగింది. ప్రస్తుతం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తరగతులు నిర్వహిస్తుండగా, ఇకపై సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాలలు నడుస్తాయి. ఓ గంట సమయం పొడిగిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రతి జిల్లాలో కొన్ని పాఠశాలలను ఎంపికచేసి పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద కొత్త సమయం ప్రకారం నిర్వహిస్తున్నారు. ఆ మేరకు జిల్లాలో మండలానికొకటి చొప్పున 34 పాఠశాలలను డీఈవో కేవీఎన్‌ కుమార్‌ ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో సోమవారం నుంచి 30వ తేది వరకు పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద కొత్త సమయాల ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. ఈ పాఠశాలల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఈ వారం రోజులపాటు ఇక్కడ ఉదయం మొదటి పిరియడ్‌ను 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేశారు. మిగిలిన పిరియడ్లను 40 నుంచి 45 నిమిషాలకు పెంచారు. ఉదయం, మధ్యాహ్నం బ్రేక్‌ల సమయం 5 నిమిషాల చొప్పున, భోజన విరామం 15 నిమిషాలు పెంచారు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిని పునఃపరిశీలించాలని కోరుతున్నాయి. అయితే, విద్యా ప్రమాణాలను పెంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డీఈవో తెలిపారు.

సమంజసం కాదు.

అందుకే పాఠశాలల పని గంటల పెంపు యోచన సమంజసం కాదు. 70 శాతం పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి లేదా సైకిళ్లపై వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది. బాలికలకు ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఇన్నిన్ని గంటల చదువు వల్ల విద్యార్థి అభ్యసనా సామర్థ్యం తగ్గుతుంది.

- కె.ధనుంజయ నాయుడు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు.

పునరాలోచించాలి

ఇప్పటికే రకరకాల యాప్‌లు, శిక్షణలు, వివిధ బోధనేతర పనులతో ఇబ్బంది పడుతున్నాం. మళ్లీ సమయం పెంపు తలకు మించిన భారంగా మారుతుంది. గ్రామీణ విద్యార్థుల స్థితిగతులు, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి.

- ఎస్‌.బాలాజీ, ఆపస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

సహేతుకమే

విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సహేతుకమే. పిల్లలు ఇంటికి వెళ్లిన తరువాత సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారని, మరో గంట వారు పాఠశాలలో ఉంటే చదువుకుంటారని పెద్దలు చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు కూడా స్వాగతిస్తున్నారు. 30వ తేదీ వరకు అమలుచేసి ఆపై తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.

- కె. వెంకట నాగేంద్ర కుమార్‌, డీఈవో

Updated Date - Nov 25 , 2024 | 02:06 AM