ఇచ్చిందే మెనూ.. పెట్టిందే తిను!
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:50 AM
ఇక్కడ పెట్టిన అన్నం తింటే వాంతులు అవుతున్నాయి. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల సాంబారు, రసం, మజ్జిగ అందిస్తున్నారు. ఇవి అస్సలు బాగోలేదు.

ఫ పలచటి పప్పు, నీళ్ల మజ్జిగే దిక్కు
ఫ హోటళ్ల నుంచి తెచ్చుకుంటున్న రోగులు
ఫ చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ఇదీ పరిస్థితి
ఇక్కడ పెట్టిన అన్నం తింటే వాంతులు అవుతున్నాయి. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల సాంబారు, రసం, మజ్జిగ అందిస్తున్నారు. ఇవి అస్సలు బాగోలేదు.
- ఈనెల 19న చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో తనిఖీ చేస్తున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు ఓ రోగి చేసిన ఫిర్యాదు ఇది.
ఆ సమయంలో అక్కడ వడ్డిస్తున్న భోజనాన్ని ఎమ్మెల్యే చూశారు. నాణ్యతగా లేకపోవడంతో నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా, 15 రోజులవుతున్నా అదే పరిస్థితి. భోజన నాణ్యతలో మార్పు రాలేదని రోగులు వాపోతున్నారు.
చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో రోగులకు అందించే ఆహారంలో నాణ్యతతో పాటు మెనూ పాటించడం లేదు. మెనూలో ఒకటి ఉంటే మరొకటి అందిస్తున్నారు. తాము ఇచ్చిందే మెనూ.. పెట్టింది తిను అన్నట్లుగా కాంట్రాక్టరుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా ప్రధాన ప్రభుత్వాస్పత్రిలో జనరల్ మెడిసన్, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, డెర్మటాలజీతో పాటు మాతా శిశు ఆరోగ్య సేవల కోసం సుదూర ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. రోజుకు 800 నుంచి 1000 మంది ఓపీ పేషంట్లు వస్తుండగా 150 నుంచి 200 వరకు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరుతుంటారు. వారిలో ఎక్కువ మంది నిరుపేద గర్భిణులు, బాలింతలతో పాటు వృద్ధులు ఉంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బు పెట్టుకోలేక ప్రభుత్వాస్పత్రిలో చేరే రోగులు.. ఇక్కడ పెట్టే భోజనాన్ని తలుచుకుని వణికిపోతున్నారు. వీళ్లు ఇచ్చే భోజనం కంటే అస్పత్రి బయట దాతల సహాయంతో చేస్తున్న అన్నదానంలో బాగుంటోందని రోగులు, వారి సహాయకులు చెబుతున్నారు. అందుకనే పలువురు అన్నదానం నుంచి తెచ్చుకుంటున్నారు. రాత్రిళ్లు హోటళ్ల నుంచి పార్సిల్ తెప్పించుకుంటున్నారు. దీనివల్ల రోగి, సహాయకులకు రోజుకు రూ.150 నుంచి 200 వరకు భోజనానికే ఖర్చవుతోంది. ఇది నిరుపేదలకు భారంగా మారుతోంది.
మెనూ ఇలా..
ఉదయం: మూడు ఇడ్లీలు, చెట్నీ లేదా సాంబారు. కిచిడీ, ఉప్మా, బ్రెడ్ కూడా ఇవ్వచ్చు. అలాగే 150 ఎంఎల్ పాలు ఇవ్వాలి.
మధ్యాహ్నం: 600 గ్రాముల అన్నంతో పాటు 150 గ్రాముల వెజ్ కర్రీ, 200 ఎంఎల్ సాంబారు, కోడిగుడ్డు, 100 ఎంఎల్ పెరుగు లేదా 200 ఎంఎల్ మజ్జిగ, సీజనల్ పండు ఒకటి, చిక్కీ ఇవ్వాలి.
సాయంత్రం: 150 ఎంఎల్ పాలు ఇవ్వాలి
రాత్రి: 600 గ్రాముల అన్నం, 150 గ్రాముల వెజ్ కర్రీ, 200 ఎంఎల్ సాంబారు, కోడిగుడ్డు, పెరుగు లేదా మజ్జిగ, సీజనల్ పండు ఒకటి ఇవ్వాలి.
మఽధుమేహ రోగులు కోరిన విధంగా గోధుమ రొట్టెలు అందించాలి. దీంతో పాటు క్షయ, మానసిక రోగులకు అదనంగా పౌష్టికాహారం అందజేయాలి.
భోజనం ఇచ్చేదిలా..
ప్రతి రోగికి వైద్య సిబ్బంది సూచన మేరకు శస్త్రచికిత్స జరిగిన వారికి మూడు రోజుల వరకు పాలు, బ్రెడ్డు, ఇడ్లీ, ఉప్మా అందించాలి. సాధారణ రోగులకూ మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలి ఇవేవీ అమలు కావడం లేదిక్కడ. ఆకుకూర లేదు, సీజనల్ పండుకు బదులు అరటిపండే ఇస్తున్నారు. నీళ్ల సాంబరు, రసం పేరిట చింతపండు జూస్, రేషన్ బియ్యంతో ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారు. ఇక పాల విషయానికి వస్తే నీళ్లలో పాలు కలిపారా అన్నట్లు ఉందని రోగులు అంటున్నారు. పెరుగు బదులు నీళ్ల మజ్జిగతోనే సరిపెడుతున్నారట. చిక్కీ మాటే లేదు.
ఉడకని అన్నం బాలింత ఎలా తింటుంది?
ఆస్పత్రిలో పెట్టే అన్నం అస్సలు ఉడికేది లేదు. ఆ అన్నాన్ని బాలింత ఎలా తింటుంది? సాంబారు, రసం, కర్రీ అస్సలు బాగోదు. అందుకనే బయట హోటల్లో టిఫిన్ తెచ్చుకొని తింటున్నాం. మాకు హోటల్ ఖర్చే రోజుకు రూ.200 అవుతోంది. తప్పదు కదా ఏం చేసేది?
- వారం కిందట పలమనేరుకు చెందిన బాలింత తల్లి ఆవేదన
ఒక్క రోజుకే కడుపునొప్పి
మా అత్తకు అతిసార అని ఆస్పత్రికి తీసుకొచ్చా. వచ్చిన రోజు మధ్యాహ్నం ఆస్పత్రిలో భోజనంతో పాటు తాలింపు పెట్టారు. తిన్న వెంటనే కడుపునొప్పి వచ్చి అల్లాడిపోయా. మా అత్తను చూసుకుందామని వస్తే ఇక్కడ పెట్టే భోజనం తిని నేనే పడుకోవాల్సి వచ్చింది. దీంతో ఐదు రోజులుగా ఆస్పత్రి బయట మధ్యాహ్నం చేసే అన్నదానం నుంచి తెచ్చుకుని తింటున్నాం. ఇక రాత్రికి హోటల్ నుంచి భోజనం తెచ్చుకుంటున్నాం.
- ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందిన పెద్దపంజాణికి చెందిన రోగి కోడలు జయమ్మ బాధ
- చిత్తూరు రూరల్