Share News

ఇంటర్‌లో ప్రభుత్వం ఫెయిల్‌

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:31 AM

ఇంటర్‌ పరీక్షల్లో ప్రభుత్వం ఫెయిలైంది. పాఠ్యపుస్తకాలు సరఫరా చేయక.. బోధనపై పర్యవేక్షణ లేక పోవడం వంటి వైఫల్యాలు ఫలితాలపై ప్రభావం చూపాయి. ఇంటర్మీడియట్‌ విద్యా మండలి శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది.

ఇంటర్‌లో ప్రభుత్వం ఫెయిల్‌

చిత్తూరు (సెంట్రల్‌), ఏప్రిల్‌ 12: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు రెండేళ్లుగా ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలను సరఫరా చేయలేదు. అదిగో.. ఇదిగో పాఠ్యపుస్తకాలు వస్తాయని ఎదురు చూశారు. చివరికి ప్రభుత్వం చేతులెత్తేసింది. విద్యా సంవత్సరం మధ్యలో బహిరంగ మార్కెట్‌లో పాఠ్యపుస్తకాలు లభ్యమైనా, అది కేవలం ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు కొంత ప్రయోజకరంగా మారింది. పేద విద్యార్థులు కొనుగోలు చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో గతేడాది ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు చొరవ చూపి పూర్వ విద్యార్థుల నుంచి పాత పాఠ్యపుస్తకాలు తెప్పించుకుని కొందరికి సర్దుబాటు చేశారు. ఈ ఏడాది ఆ ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. దీంతో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు లేకుండా పోయాయి. పాఠ్యపుస్తకాల్లేకుండా చదువులు సాగించాల్సి వచ్చింది. మరోవైపు బోధన విషయంలోనూ పట్టు తప్పింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యాప్రమాణాలు తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పిందే కానీ.. అమలు కాలేదు. పలు కళాశాలల్లోని రెగ్యులర్‌, కాంట్రాక్టు అధ్యాపకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు విద్యార్థుల చదువుపై పడింది. ఎక్కుమంది అధ్యాపకులు హాజరుపై దృష్టి సారించి.. బోధన పట్ల ఆసక్తి చూపలేదనే విమర్శలున్నాయి. ఒకవేళ ఎవరైనా అడిగితే.. సరైన పాఠ్యపుస్తకాలు లేకుండా ఎలా బోధించాలని చెప్పి తప్పించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

ఇక, గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు దూరప్రాంతాల్లోని జూనియర్‌ కళాశాలలకు రావాల్సి ఉంటుంది. గ్రామాల్లో ఉదయాన్నే తల్లిదండ్రులు పొలాలకు, పనులకు వెళ్లిపోవడం వల్ల మధ్యాహ్న భోజనం తీసుకురావడానికి ఇబ్బందిగా మారింది. అందుకని తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వీరికి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. జగన్‌ సీఎం అయ్యాక ఈ పథకం ఆపేశారు. దీంతో గ్రామీణ విద్యార్థులు కళాశాలలకు హాజరవడం తగ్గింది. ఇది వారి చదువు, ఫలితాలపైనా ప్రభావం చూపిందని అధ్యాపకవర్గాలు అంటున్నాయి.

పర్యవేక్షణ లోపం

అన్నింటికి మించి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ జిల్లా పర్యటన నేపథ్యంలో జూనియర్‌ కళాశాలలు పర్యవేక్షించారు. మిగిలిని ఇతర అధికారులెవ్వరూ ఏడాది పొడుగునా కళాశాలల్లో బోధన తీరుపై దృష్టి పెట్టలేదు. కనీసం ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ కూడా ఇదే ధోరణిలో ఉన్నారన్న ఆరోపణలున్నాయి.

ఫలితాల్లో అట్టడుగున జిల్లా

ఫస్టియర్‌ 49.65, సెకండ్‌ ఇయర్‌ 62.64 శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌లో రాష్ట్రంలోనే జిల్లా అట్టడుగు స్థాయి ఫలితాలు సాధించింది. జిల్లాల విభజన తర్వాత.. కొత్త జిల్లాల వారీగా ఈ ఏడాది ఫలితాలు ప్రకటించారు. జిల్లాకు సంబంధించి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 13,224 మందికిగాను 6566 మంది ఉత్తీర్ణత (49.65 శాతం) సాధించగా, 6658 మంది ఫెయిలయ్యారు. ద్వితీయ ఇంటర్‌లో 10882 మందికి గాను 6817 మంది ఉత్తీర్ణత (62.64 శాతం) సాధించగా, 4065 మంది ఫెయిలయ్యారు.

బాలికలదే హవా

ఎప్పటిలానే ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లోనూ బాలికలు హవా చూపారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 6701 మంది బాలికలు పరీక్ష రాయగా, 3847 మంది (57 శాతం) అయ్యారు. 2854 మంది ఫెయిలయ్యారు. అలాగే, 6523 మంది బాలురకుగాను 2719 మంది (42 శాతం) ఉత్తీర్ణులు కాగా, 3804 మంది ఫెయిలయ్యారు.

ద్వితీయ సంవత్సరంలో 5585 మంది బాలికలు పరీక్షలు రాయగా, 3820 మంది (68 శాతం) పాస్‌ అయ్యారు. 1765 మంది ఫెయిలయ్యారు. ఇక, 5297 మంది బాలురుకుగాను 2997 మంది (57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 2300 మంది ఫెయిలయ్యారు.

రెసిడెన్షియల్‌ ఫస్ట్‌.. హైస్కూల్‌ ప్లస్‌ లాస్ట్‌

ఏపీ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో 2418 మందికి గాను 2382 మంది పరీక్షలు రాయగా, 2237 మంది (93.91 శాతం) ఉత్తీర్ణులై జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు.

కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల్లో 1484 మందికి గాను 1428 మంది పరీక్షలు రాయగా, 1248 మంది (87.39 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ప్రైవేటు యాజమాన్య కళాశాలల్లో 1,09,001 మందికి గాను 1,04,815 మంది పరీక్షలు రాయగా, 84148 మంది (80.28 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

మోడల్‌ స్కూల్క్‌లో 4061 మందికి గాను 4005 మంది పరీక్షలు రాయగా, 3199 మంది (79.87 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 30,932 మందికి గాను 29,074 మంది పరీక్షలు రాయగా, 19788 మంది (68.06 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

తాజాగా ఉన్నత పాఠశాలల్లో ఉన్నతీకరణ చేసిన హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో మొత్తం 3487 మందికి గాను 3286 మంది పరీక్షలు రాయగా, 1839 మంది (55.96 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇలా తక్కువ ఉత్తీర్ణతతో ఈ కళాశాలలు చివరి స్థానంలో నిలిచాయి.

Updated Date - Apr 13 , 2024 | 01:31 AM