Share News

లక్ష లక్ష్యం నెరవేరినట్లేనా!

ABN , Publish Date - May 16 , 2024 | 01:07 AM

టీడీపీలో జోరుగా లెక్కలు వైసీపీలో కనిపించని ఉత్సాహం

లక్ష లక్ష్యం నెరవేరినట్లేనా!
కుప్పం మున్సిపాలిటీ శీగలపల్లెలోని 156వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలోనూ కొనసాగిన పోలింగ్‌ (ఫైల్‌ ఫొటో)

కుప్పం: జిల్లాలో అత్యధిక పోలింగ్‌ జరిగింది కుప్పం నియోజకవర్గంలోనే. 89.88 శాతం ఓటింగ్‌ నమోదైందిక్కడ. 2019 ఎన్నికల్లో ఇది 85.43 శాతం. అంటే 4.45 శాతం పోలింగ్‌ పెరిగింది. ఈ పెరిగిన ఓటింగ్‌ శాతం.. చంద్రబాబుకు ‘లక్ష’ మెజారిటీ లక్ష్యాన్ని అందించనుందా అనేది చర్చగా మారింది. ఈ దిశగా టీడీపీలో జోరుగా లెక్కలు వేస్తున్నారు.

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు మొదటినుంచి లక్ష మెజారిటీ లక్ష్యం అనే ప్రచారాంశాన్ని తీసుకుంది. సూపర్‌ సిక్స్‌ పథకాలతోపాటు అయిదేళ్లలో వైసీపీ చేసిన అరాచకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్య సాధనకు ప్రతి కార్యకర్తా కంకణబద్ధులయ్యారు. దాడులకు, దౌర్జన్యాలకు వెరువకుండా ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు మాత్రమే కుప్పం భవిష్యత్తు నిర్ణేత అని, ఇక వేరెవరికి చోటిచ్చినా అథోగతి తప్పదని విస్తృతంగా ప్రచారం చేశారు. అధికార పార్టీ అరాచకాలపై ఉన్న కసి, చంద్రబాబుమీద ఉన్న అభిమానమే పోలింగ్‌ బూత్‌లకు తండోపతండాలుగా ఓటర్లను రప్పించిందని టీడీపీ శ్రేణులు నమ్ముతున్నాయి. 2019 ఎన్నికల్లో 85.43శాతం పోలింగ్‌కు సుమారు 30 వేల ఓట్లకు చంద్రబాబు మెజారిటీ దిగజారింది. ఇప్పుడు భిన్నమైన పరిస్థితులున్నాయని, వైసీపీమీద కసితో బాబుకు అత్యధిక మెజారిటీ కట్టబెట్టడానికే ఓటర్లు వెల్లువెత్తారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. పోలింగ్‌ రోజు ఉదయంనుంచే టీడీపీ శ్రేణుల్లో ఉరకలు వేస్తున్న ఉత్సాహం.. రోజురోజుకు పెరుగుతోంది.

వైసీపీలో కనిపించని జోరు

పోలింగ్‌ ప్రారంభమైన ఒకటీ ఒకటిన్నర గంటదాకా వైసీపీ శ్రేణులు కనిపించినా.. ఆ తర్వాత చాలామంది వెళ్లిపోయారు. నిజానికి పంచాయతీలు, మున్సిపాలిటీ అన్నీ అధికార పార్టీ ఏలుబడిలోనే ఉన్నాయి. అయినాసరే, నియోజకవర్గ స్థాయి నేతనుంచీ, గ్రామస్థాయి నేతలదాకా పోలింగ్‌ బూత్‌ల వద్ద పెద్దగా కనిపించడంలేదు. మంగళవారంనాడు పోలింగ్‌ పర్యవేక్షణ సందర్బంగా ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎమ్మెల్సీ భరత్‌ కూడా ఈ పరిస్థితిపై వాపోయారట. ‘లక్షలకు లక్షలు తీసుకుని, ఇప్పుడు ఒక్కరు కూడా కనిపించడంలేద’ని నిష్టూరపోయారని అంటున్నారు. జగన్‌ ‘బటన్‌ నొక్కుడు’ పథకాలు తమను కాపడుతాయన్న నమ్మకం, పోలింగ్‌ తర్వాత ఆ పార్టీలో పూర్తిగా వమ్మయినట్లు కనిపిస్తోంది. భారీగా పెరిగిన ఓటింగ్‌ శాతం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ మిగిల్చింది. పైకి మాత్రం తమ పథకాల లబ్ధిదారులు ఓటువేసేందుకు పోటెత్తడంవల్లే పోలింగ్‌ శాతం పెరిగిందని చెప్పుకోవడం తప్ప.. ఆ పార్టీ శ్రేణుల్లో అందుకు తగిన జోష్‌ మాత్రం కనిపించడంలేదు. పైగా ఓటుకు రూ.4 వేలు ఇచ్చారన్న ప్రచారం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. ఎంపిక చేసిన 50 శాతం మంది ఓటర్లకే ఈ డబ్బులిచ్చి.. మిగిలిన సగం మందిలో అసంతృప్తి రగలడానికి ఇది కూడా కారణమైందని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న వైసీపీ నేతలు, లోలోపల మాత్రం గుబులుగానే ఉన్నారు. పేరుకు 13 మంది కుప్పం బరిలో ఉన్నా టీడీపీ, వైసీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.

Updated Date - May 16 , 2024 | 01:07 AM