Share News

గాడి తప్పిన విద్యాశాఖ

ABN , Publish Date - Jul 25 , 2024 | 01:28 AM

అన్ని శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన విద్యాశాఖ జిల్లాలో గాడి తప్పింది. డీఈవోగా దేవరాజు బాధ్యతలు చేపట్టాక ఈ శాఖలో బాధ్యతారాహిత్యం, అవకతవకలు రాజ్యమేలుతున్నాయన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

గాడి తప్పిన విద్యాశాఖ
చిత్తూరు డీఈవో కార్యాలయం

ఫ జగన్‌ మేనమామ అండతో డీఈవో రుబాబు

ఫ ఎమ్మెల్యేలను లెక్కచేయని తెంపరితనం

అన్ని శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన విద్యాశాఖ జిల్లాలో గాడి తప్పింది. డీఈవోగా దేవరాజు బాధ్యతలు చేపట్టాక ఈ శాఖలో బాధ్యతారాహిత్యం, అవకతవకలు రాజ్యమేలుతున్నాయన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి పర్యటనల్లో తమ దృష్టికొచ్చిన విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని ప్రస్తుత ఎమ్మెల్యేలు కోరినా ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నారు. విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొనడం లేదు. జగన్‌ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, జగన్‌ భక్త ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డి అండతో ఈ పోస్టులోకి వచ్చిన డీఈవో.. ఇప్పటికీ పాత వాసనల్ని వదలడం లేదు.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

చిత్తూరు డీఈవో దేవరాజు కడప జిల్లా వాసి. విద్యాశాఖలో క్లర్కు స్థాయి నుంచి ఏడీ స్థాయి వరకు కడప జిల్లాలో పనిచేశారు. డీఈవోగా పదోన్నతి పొంది జగన్‌ మేనమామ రవీంద్రనాథరెడ్డి అండతో ఎన్నికల ముందు చిత్తూరుకు పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. తన కుమారుడు కడప జిల్లా వైసీపీ ఎస్సీ సెల్‌ నాయకుడిగా ఉండడం.. విద్యాశాఖలో అధికారిగా పనిచేస్తున్న తన సోదరుడు విజయేంద్రరావు (చిత్తూరు పూర్వ డీఈవో) వెంకట్రామిరెడ్డి సంఘంలో నాయకుడిగా పనిచేసి ఉండడం.. వంటి నేపథ్యాలనూ వాడుకుని చిత్తూరు డీఈవోగా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో విద్యాశాఖ ఉద్యోగులను గందరగోళానికి గురి చేసేలా వ్యవహరించారన్న ఆరోపణలూ ఆయనపై ఉన్నాయి. ఎన్నికలకు ముందు వెంకట్రామిరెడ్డి అనుకూల ఉపాధ్యాయ సంఘాల నాయకులు చిత్తూరులోని కల్యాణ మండపాల్లో పెద్దఎత్తున రాజకీయ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచార సమావేశాలు, నగదు పంపిణీ నిర్వహించినా డీఈవో చూసీచూడనట్లు ఉండిపోయారు.

అప్పుడలా.. ఇప్పుడిలా

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాదు నాయకులూ అడిగితే క్షణాల్లో పనులు చేసి పెట్టిన డీఈవో దేవరాజు.. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలకు ఏ మాత్రం స్పందించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీలో ప్రజాప్రతినిధులంతా అధికారులతో కలిసి పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు కిట్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. డీఈవో దేవరాజు మాత్రం ఎక్కడా ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొనడానికి ఇష్టపడడం లేదని విద్యాశాఖలో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19న చిత్తూరులోని మూడు పాఠశాలల్లో విద్యాసామగ్రిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ అందించారు. ఏ ఒక్క చోటికీ డీఈవో రాలేదు. ఈ నెల 8వ తేదీన తవణంపల్లెలో జరిగిన కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ పాల్గొన్నా.. డీఈవో లేరు. ఇటీవల తన నియోజకవర్గంలోని ఒక మహిళా ఉద్యోగి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే సిఫార్సు చేయగా.. డీఈవో ఖాతరు చేయలేదు. పైగా ఉద్యోగులు, సంఘ ప్రతినిధులు ఎమ్మెల్యేను ఎలా కలుస్తారని చిందులేసినట్లు తెలుస్తోంది. అదే ఎన్నికల సమయంలో అప్పటి చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డితో కలిసి పలు అనధికార కార్యక్రమాల్లో ఈయన పాల్గొనడం గమనార్హం.

రివర్షన్‌ ఆర్డర్లకూ ఎదురుచూపులే

పదోన్నతి పొందిన టీచర్లు ఆర్థికంగా తమకు నష్టమైనప్పటికీ.. ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల కారణంగా ఎంతోమంది రివర్షన్‌ కోసం దరఖాస్తు చేశారు. వీరిలో పది మందికిపైగా టీచర్లు ఏడాదిగా డీఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల సిఫార్సులు, డబ్బు ప్రభావం కారణంగా కొద్దిమందికి మాత్రమే రివర్షన్‌ ఆర్డర్లు ఆగమేఘాలపైన ఇచ్చారన్న విమర్శలున్నాయి. వారంతా తమ పాత పోస్టుల్లో చేరిపోయారు. అవేవీ చేయలేని వాళ్లేమో డీఈవో చుట్టూ తిరుగుతున్నారు. కొద్ది రోజుల కిందట తన భార్య రివర్షన్‌ ఆర్డర్‌ విషయంలో తీవ్ర జాప్యాన్ని ప్రశ్నించిన రిటైర్డ్‌ టీచర్‌ను డీఈవో దబాయించి ఛాంబర్‌ నుంచి బయటికెళ్లమని గద్దించారు. ఆ రిటైర్డ్‌ టీచర్‌ సహనం నశించి డీఈవోపైన తిరగబడ్డారు.

రెగ్యులరైజేషన్‌ జాబితాల తయారీలో నిర్లక్ష్యం

పదోన్నతులు, బదిలీలకు సీనియారిటీనే ప్రాతిపాదిక. ఈ ప్రక్రియలో టీచర్ల సర్వీసు రెగ్యులరైజేషన్‌ జాబితాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని పారద్శకంగా తయారు చేసి అందరికీ అందుబాటులో ఉంచాలని డీఈవోకు ఎన్నిసార్లు విన్నవించినా కనీస స్పందన లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. 1996 నుంచీ ఇప్పటివరకు నియమితులైన టీచర్లకు రెగ్యులరైజేషన్‌ తుది జాబితాలు విడుదల కాలేదు. దీంతో సర్వీసు రిజిస్టర్లలో కూడా సరైన నమోదులు లేక గందరగోళం నెలకొంది. బోధనేతర సిబ్బంది సీనియారిటీ జాబితాల తయారీ కూడా పారదర్శకంగా చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిప్యుటేషన్ల పేరుతో అవకతవకలకు పాల్పడినట్లు విమర్శలున్నాయి.

Updated Date - Jul 25 , 2024 | 01:28 AM