బస్ నడుపుతుండగా డ్రైవరుకు గుండెపోటు
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:48 AM
రాత్రి 9 గంటలు.. కల్లూరుకు ఆర్టీసీ బస్సు వస్తోంది. అదే సమయంలో బస్ డ్రైవరుకు గుండె నొప్పి వచ్చింది. కొద్ది క్షణాలకే తీవ్రమైంది. అప్పటికే చేతిలో స్టీరింగ్ అదుపు తప్పింది.

ఫ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
ఫ కండక్టర్ అప్రమత్తత ప్రయాణికుడికి తప్పిన ముప్పు
కల్లూరు, జూలై 4: రాత్రి 9 గంటలు.. కల్లూరుకు ఆర్టీసీ బస్సు వస్తోంది. అదే సమయంలో బస్ డ్రైవరుకు గుండె నొప్పి వచ్చింది. కొద్ది క్షణాలకే తీవ్రమైంది. అప్పటికే చేతిలో స్టీరింగ్ అదుపు తప్పింది. బస్సు రోడ్డు పక్క గుంతలోకి ఒరిగి పోయింది. కండక్టర్ వెంటనే అప్రమత్తమై బస్‌ను నియంత్రించారు. ఆస్పత్రికి తరలించినా డ్రైవరు ప్రాణాలు దక్కలేదు. వివరాలివి.. తిరుపతి నుంచి కొత్తపేట మీదుగా కల్లూరుకు బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు బయలుదేరింది. కల్లూరు నైట్ హాల్ట్ కావడంతో బస్సులో ఒక ప్రయాణికుడు మాత్రమే ఉన్నారు. పులిచెర్ల మండలం కొక్కువారిపల్లి సమీపానికి వచ్చేసరికి డ్రైవర్ రాఘవయ్య(56)కు గుండెపోటు వచ్చింది. బస్సును నియంత్రించడం సాధ్యం కాలేదు. బస్సు రోడ్డు పక్కనున్న గుంతలోకి ఒరిగిపోయింది. కండక్టర్ మణి పరిస్థితి గుర్తించారు. హుటాహుటిన ప్రయాణికుడితో కలసి డ్రైవర్‌ను కిందకు దింపారు. అటుగా వెళుతున్న కారును ఆపి పులిచెర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి రాఘవయ్య మృతి చెందినట్లు ధ్రువీకరించారు. రాఘవయ్య మృతదేహాన్ని స్వగ్రామం సోమల మండలం పొదలగుంటపల్లికి తరలించారు. ప్రజా రవాణా సంస్థ జోనల్ కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రజా రవాణా అధికారి జితేంద్రనాధరెడ్డి, పుంగనూరు డిపో మేనేజర్ సుధాకరయ్య, సిబ్బంది సందర్శించి రాఘవయ్యకు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంస్థ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.