Share News

పక్కదారి పట్టిన రూ. 20 కోట్లు

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:03 AM

తిరుపతి రుయాస్పత్రిలో జరుగుతున్న ఆడిట్‌ తనిఖీల్లో పెద్దఎత్తున అక్రమాలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. కోట్లాది రూపాయల మాయం వెనుక వైసీపీ నేతల ప్రమేయముందన్న ప్రచారం జరుగుతోంది.

పక్కదారి పట్టిన రూ. 20 కోట్లు
రికార్డులు తనిఖీ చేస్తున్న ఆడిట్‌ అధికారులు

- రుయా ఆడిట్‌లో వెలుగుచూస్తున్న అక్రమాలు?

- కోట్లాది రూపాయల మాయం వెనుక వైసీపీ హస్తం

- కీలకమైన రికార్డులూ మాయం?

తిరుపతి(వైద్యం), ఏప్రిల్‌ 23 : తిరుపతి రుయాస్పత్రిలో జరుగుతున్న ఆడిట్‌ తనిఖీల్లో పెద్దఎత్తున అక్రమాలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. కోట్లాది రూపాయల మాయం వెనుక వైసీపీ నేతల ప్రమేయముందన్న ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో రాజకీయ ప్రమేయంతో నామినేట్‌ అయిన ఓ వ్యక్తి ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఐదేళ్లుగా రుయాస్పత్రిలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, కొనుగోళ్లు, బిల్లుల మంజూరు, ఇతర నిధులు కేటాయింపు, వాటి ఖర్చులకు సంబంధించి ఇరవై రోజులుగా అడిట్‌ అధికారులు విచారణ చేపట్టారు. ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ఆడిట్‌ కావడంతో 2018-19 సంవత్సరం నుంచి 2023-24 సంవత్సరం వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలను ఆడిట్‌ అధికారులు ముమ్మరంగా పరిశీలిస్తున్నారు. సంబంధిత సిబ్బందిని కూడా విచారించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్టు సమాచారం.ఈ అడిట్‌లో ఎన్నో అక్రమాలతో పాటు కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమైనట్టు గుర్తించినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో ఆడిట్‌ పూర్తికావస్తుండడంతో ఆడిట్‌ అధికారులు ప్రభుత్వానికి ఏ విధమైన నివేదికలు అందించనున్నారో అని అక్రమాలకు పాల్పడిన వారు ఆందోళన చెందుతున్నారు. ఒక్క ఆరోగ్యశ్రీలోనే రూ. కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ఆడిట్‌ అధికారులు గుర్తించారు. వీటితోపాటు అభివృద్ధి కమిటీ ఒత్తిడి మేరకు అధికారులు పలు ఏజన్సీ నిర్వాహకులతో కుమ్మక్కై రూ. కోట్ల నిధులు పక్కదోవ పట్టించారని విచారణలో గుర్తించినట్లు తెలిసింది. రుయాస్పత్రి నిర్వహణకు ఏడాదికి దాదాపు రూ. 24 కోట్ల నిధులు అవసరమవుతాయి. వీటిలో రూ. 5కోట్లకు పైగా పక్కదోవ పట్టినట్లు సమాచారం. వీటితోపాటు గడిచిన ఐదేళ్ల కాలంలో ఆరోగ్యశ్రీ, హెచ్‌డీఎస్‌కు సంబంధించి మరో రూ. 5 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు తెలిసింది. వీటికి సంబంధించి ఇప్పటికే పలు కీలకమైన రికార్డులను ఆడిట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఫ అవినీతిలో వైసీపీ నేతల హస్తం?

ఆరోగ్యశ్రీలో వైద్య సేవలకు ఏడాదికి సుమారు రూ. 5 కోట్ల వరకు ఆరోగ్యశ్రీ ఖాతాలో జమవుతుంది. ఇందులో ఆరోగ్యశ్రీ వైద్య సేవల కింద అభివృద్ధి కమిటీ చెప్పినవారికే వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్ల పేరుతో దాదాపు ఏడాదికి రూ. 2 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. పది కోట్ల వరకు పక్కదోవ పట్టినట్లు అధికారులు గుర్తించారు.2020-21వ సంవత్సరంలో ఓ అధికారి ఆరోగ్యశ్రీ నిధులు పక్కదోవ పట్టించి సస్పెండయ్యాడు. అప్పటి అధికారులు నిధులు పక్కదోవ పట్టించిన ఉద్యోగిని సస్పెండు చేశారు తప్ప నిధులు రికవరీ చేయలేదు. దీంతో ఆ ఏడాదికి సంబంధించిన రికార్డులను ప్రస్తుతం ఆడిట్‌ అధికారులు అడగ్గా రుయా అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. చివరకు ఆ రికార్డులు లేవని చెప్పి జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఆసరా పేరుతో రోగులు కాని వారి పేరుతో దాదాపు రూ.3కోట్ల వరకు నిధులు దుర్వినియోగమైన విషయం కూడా ఆడిట్‌ అధికారులు గుర్తించారు. ఈ విషయం ఏడాది కిందట వెలుగులోకి రావడంతో అవుట్‌సోర్సింగ్‌ కింద పనిచేసే డీఈవోలను ఇందుకు సూత్రధారులుగా చూపి సంబంధింత అధికారులను తప్పించారు. తరువాత ఈ విషయాన్ని గోప్యంగా కప్పెట్టేశారు. దీని వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉన్నట్టు ప్రచారంలో ఉంది. ఈ విషయంపై కూడా ఆడిట్‌ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.

ఆడిట్‌లో వెలుగుచూసిన అవినీతి బాగోతం

ఫ పారిశుధ్య, సెక్యూరిటీ ఏజన్సీ నిర్వాహకులు తక్కువ మంది సిబ్బందిని నియమించి రికార్డుల్లో ఎక్కువ మందిని చూపుతున్నట్లు కూడా గుర్తించారు. వీరిలో ప్రధానంగా పారిశుధ్య ఏజన్సీ నిర్వాహకులు 205 మంది కార్మికులకు గాను 130 మందినే నియమించుకోవడంతో పాటు వారికి కూడా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని గుర్తించారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటివి చెల్లించకపోగా పారిశుఽధ్యానికి సంబంధించి ఎలాంటి సామాగ్రి కొనుగోలు చేయకనే నెలకు రూ. 70 లక్షలకు పైగా బిల్లులు అందుకుంటున్నట్లు గుర్తించారు.

ఫ సప్తవర్ణాల పేరుతో ఏజన్సీ నిర్వాహకులు ఆస్పత్రిలోని రోగుల పడకలపై రోజూ దుప్పట్లను మార్చాలి. కానీ వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే పడకలపై దుప్పట్లు మారుస్తున్నట్లు గుర్తించారు.

ఫ సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి వాడే వాహనానికి నెలకు రూ. 9 వేల లోపు మాత్రమే డీజల్‌కు ఖర్చు చేయాలి.అయితే గతంలో పనిచేసిన సూపరింటెండెంట్‌ నెలకు రూ. 15 వేలకు పైగా డీజల్‌కు ఖర్చు చేసిన విషయాన్ని అడిట్‌ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అప్పటి అధికారి నుంచి వివరణ తీసుకుని నిధుల రికవరీకి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఫ ప్రభుత్వం నుంచి ఏడాదికి రూ.3 కోట్ల విలువైన మందులు సరఫరా అవుతున్నా అదనంగా మందుల, వైద్య పరికరాల పేరుతో రూ. కోటికి పైగా నిధులు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి రికార్డులు కూడా మాయమైనట్లు సమాచారం.

ఫ హెచ్‌డీఎస్‌ కింద ఆస్పత్రి అభివృద్ధికి ఏడాదికి దాదాపు రూ. కోటి వరకు నిధులు మంజూరవుతాయి. వీటితోపాటు దుకాణాల నుంచీ అద్దెల రూపంలో మరో రూ. 30 లక్షల వరకు వస్తాయి. వీటిలో రూ. కోటికి పైగా నిధులను ఎలాంటి బిల్లులు లేకుండానే స్వాహా చేసినట్లు సమాచారం.

ఫ ఆస్పత్రుల్లో కేవలం రెండు అంబులెన్సులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఒకటి వీఐపీల కోసం ఉపయోగిస్తుండగా మరొకటి రోగుల కోసం ఉపయోగిస్తున్నారు. కానీ డీజల్‌ ఖర్చుల కింద ఏడాదికి రూ. 5 లక్షల నిధులను పక్కదోవ పట్టించిన విషయంపై కూడా ఆడిట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే వాహనాల రిపేర్లు, అధికారుల ఫోన్ల ఖర్చు, స్టేషనరీ పేరుతో రూ. పది లక్షలు స్వాహా చేసినట్లు కూడా ఆడిట్‌ అధికారులు గుర్తించారు.

ఫ ఆస్పత్రిలో తలుపులు, కిటికీలు, మంచాలు, వీల్‌చైర్లు, ఫ్యాన్లు, ఏసీలు వంటివి రిపేరు చేసేందుకు ఏడాదికి రూ. 15 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు దస్ర్తాల్లో చూపుతున్నా వాస్తవంగా వీటి నిర్వహణకు రూ. 5 లక్షలు కూడా ఖర్చు కాదని ఆడిట్‌ అధికారులు గుర్తించారు.గడిచిన ఐదేళ్ల కాలంలో దాదాపు రూ. 20 కోట్లకు పైగా నిధులు పక్కదోవ పట్టినట్లు అధికారులు విచారణలో తేలినట్లు సమాచారం.

ఫ వీటితోపాటు కార్యాలయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విభాగంలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు కొన్నేళ్లుగా ఒకే సీట్లో పరిమితమై రూ. లక్షల నిధులను పక్కదోవ పట్టించడంలో ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించినట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే వీరిని రక్షించేందుకు ఉన్నతాధికారులు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

ప్రసన్నం చేసుకునేందుకు యత్నాలు

గడిచిన ఐదేళ్లలో రూ. కోట్లలో నిధులు పక్కదోవ పట్టిన విషయాన్ని ఆడిట్‌ అధికారులు గుర్తించడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రుయా అధికారులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారకులైన వైసీపీ నేతలు చేతులెత్తేయడంతో అధికారులే ఆడిట్‌ అధికారులకు భారీ మొత్తంలో తాయిలాలను సమర్పించే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది. అలాగే గతంలో పనిచేసిన అధికారుల నుంచి వసూళ్లు చేసి ఆడిట్‌ అధికారుల జేబులు నింపే పనిలో కొందరు రుయా అధికారులున్నట్లు తెలిసింది. హెడీఎస్‌లో పదిమంది కమిటీ సభ్యులు ఉంటే ఏకఛత్రాధిపత్యంతో నిర్ణయాలు తీసుకోవడంవలనే అధికారులు ఈ తిప్పలు పడాల్సివస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

Updated Date - Apr 24 , 2024 | 02:03 AM