ముగిసిన ప్రచారం
ABN , Publish Date - May 12 , 2024 | 02:31 AM
జిల్లాలో శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగియడంతో పోలింగ్ సరళి, జయాపజయాలపై అటు ప్రధాన పార్టీల్లోనూ, ఇటు ప్రజానీకంలోనూ చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో జిల్లాలో ఫ్యాన్ హోరు స్పష్టంగా వినిపించింది.

గత ఎన్నికల్లో ఫ్యాన్ హోరు
ఈసారి వైసీపీ పరిస్థితి తారుమారు
పట్టు కోల్పోతున్నా బింకం వీడని వైసీపీ
ప్రలోభాలు, తాయిలాలతో విజయంపై ధీమా
జనంలో మార్పుపై కూటమి పార్టీల విశ్వాసం
తిరుపతి, మే 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగియడంతో పోలింగ్ సరళి, జయాపజయాలపై అటు ప్రధాన పార్టీల్లోనూ, ఇటు ప్రజానీకంలోనూ చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో జిల్లాలో ఫ్యాన్ హోరు స్పష్టంగా వినిపించింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు.అందరూ భారీ మెజారిటీతో గెలుపొందగా తిరుపతిలో మాత్రం అత్యల్ప మెజారిటీతో గట్టున పడ్డారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి తారుమారైనట్టు కనిపిస్తోంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోనూ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ ఐదేళ్ళలో ఎలాంటి అభివృద్ధి పనులూ జరగలేదు. చెప్పుకోదగిన సంస్థలు రాలేదు. పరిశ్రమలూ ఏర్పాటు కాలేదు. సాగునీటి ప్రాజెక్టులు అతీగతీ లేకుండా పోయాయి. ప్రధాన రహదారులు సైతం బాగుపడలేదు. పేదలకు పక్కా ఇళ్ళు కూడా పూర్తి కాలేదు.ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి.అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయి. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి వర్గాల దైనందిన జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు ఇలా ప్రభుత్వ వేతనాలు అందుకునే వేలాది కుటుంబాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా మారాయి. ఈ పరిణామాలకు తోడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడంతో అన్ని నియోజకవర్గాల్లో మిత్రపక్షాల బలం టీడీపీకి అనుకూల పరిస్థితులు కల్పిస్తోంది. సాధారణ కార్యకర్తల నుంచీ నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ పెద్దసంఖ్యలో అధికార పార్టీని వీడి టీడీపీలో చేరడం రోజువారీ కార్యక్రమంగా మారింది. దీంతో నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ప్రజల్లోనూ, శ్రేణుల్లోనూ పట్టు కోల్పోతున్న వైనం స్పష్టంగా కళ్ళకు కడుతోంది. అయితే అభ్యర్థులు బింకం వదలడం లేదు. ఓటర్లకు నగదు పంపకాలు, ఇతర ప్రలోభాలను నమ్ముకుని విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్ల, అఽధికార పార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతతో పాటు ఐదేళ్ళ పాటు ప్రజాక్షేత్రంలో నిలిచి పోరాడిన తమకు ఓటరు మద్దతుగా నిలుస్తాడన్న విశ్వాసం కూటమి పార్టీల్లో వ్యక్తమవుతోంది.