పల్లెపల్లెనా పండుగ సంరంభం!
ABN , Publish Date - Aug 24 , 2024 | 01:20 AM
పనులు మానుకున్నారు. రచ్చబండ కాడికో, దేవాలయం వద్దకో చేరుకున్నారు. అమ్మ అక్క, అన్న చెల్లి, అవ్వ తాత.. వయసు తేడా లేదు. కులం, మతంతో పని అసలే లేదు.
ఫ సీఎం నియోజకవర్గంలో గ్రామ సభలకు పోటెత్తిన జనం
కుప్పం: పనులు మానుకున్నారు. రచ్చబండ కాడికో, దేవాలయం వద్దకో చేరుకున్నారు. అమ్మ అక్క, అన్న చెల్లి, అవ్వ తాత.. వయసు తేడా లేదు. కులం, మతంతో పని అసలే లేదు. అక్కడ జరుగుతున్నది తమ భవిష్యత్తును బాగు చేసుకునే కార్యక్రమం. వెళ్లాలి, రేపటి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఇదే ఆలోచన. ఫలితం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలు జనంతో పోటెత్తాయి. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో శుక్రవారం గ్రామ సభలు పండుగ వాతావరణంలో జరిగాయి. క్షేత్రస్థాయి.. ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఈ మూడు వర్గాల భాగస్వామ్యంతో సభలు నిర్వహించారు. ఈ సభలకు ముఖ్యంగా మహిళలు పెద్దయెత్తున హాజరయ్యారు. కుప్పం మండలం వసనాడు, వెండుగంపల్లె, గుడుపల్లె మండలంలోని పీబీవాడ గ్రామసభల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తోపాటు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎ్‌స.మునిరత్నం పాల్గొన్నారు. గ్రామాలను స్థానిక ప్రజలే పాలించుకోవాలన్న సూత్రంతో సభలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఏ సభలో చూసినా, ప్రజలతోపాటు అధికార పార్టీ శ్రేణులు ఉత్సాహంతో పాల్గొన్నారు. సర్పంచులకు ఏమాత్రం ప్రాధాన్యం తగ్గలేదు. నియోజకవర్గంలో అత్యధిక శాతం సర్పంచులు వైసీపీ వారైనా.. వారిని అధికారులు ఆహ్వానించి సముచిత రీతిన సభావేదికపై కూర్చోబెట్టారు. వారి ఆధ్వర్యంలోనే సభలు జరిగేలా జాగ్రత్త వహించారు. ఇన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో దక్కని భాగ్యం ఇప్పుడు దక్కేసరికి ఆ సర్పంచుల్లో సంభ్రమం కనిపించింది. గ్రామస్థాయికి పాలన రావడమంటే ఇది కదా అని ఒకరిద్దరు వైసీపీ సర్పంచులు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, వచ్చిన జనం తమ సమస్యలు చెప్పారు. గ్రామానికి ఏం కావాలో అడిగారు. వీటన్నింటిపై గ్రామ సభల్లో చర్చించి, పనుల జాబితాను తయారు చేసిన అధికారులు, సభల ఆమోదం పొందారు. ఆయా పనులను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి, త్వరలోనే ప్రారంభించనున్నట్లు అధికారులు, నాయకులు హామీ ఇచ్చారు.
ఇది కదా గౌరవమంటే..!
ఇన్నాళ్లూ ఒక్కటంటే ఒక్క గ్రామ సభ జరగకపోవడం, తమను అధికారులు పట్టించుకోకపోవడం, పనులకోసం కార్యాలయాలకు వస్తే చీదరించుకోవడం వంటి అనుభవాలు వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణులకు చాలా ఎదురయ్యాయి. అటువంటి చోట, టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే గ్రామ సభల ద్వారా తమ మాటకు విలువనివ్వడం.. సభలు పెట్టి మరీ అవసరాలను అడిగి, జాబితా తయారు చేసి, ఆమోదం పొందడం.. ప్రజలకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందుకనే పిలిచినా, పిలవకున్నా గ్రామ సభలకు భారీగా హాజరయ్యారు. మొత్తమ్మీద అయిదేళ్లుగా కనిపించని ప్రజాస్వామ్య పండుగ వాతావరణం గ్రామసభల మూలంగా శుక్రవారం సాక్షాత్కారించింది.