Share News

వి.కోటలో నాలుగు గంటల పాటు ఉద్రిక్తత

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:15 AM

వి.కోటలో సోమవారం రాత్రి జరిగిన వీరాంజనేయస్వామి పుష్ప పల్లకి సేవ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం చూపారు. ఎస్‌ఐ వీరంగం.. తీవ్ర విమర్శలకు దారితీసింది. వివరాలిలా ఉన్నాయి.

 వి.కోటలో నాలుగు గంటల పాటు ఉద్రిక్తత
ఎన్టీఆర్‌ కూడలిలో ధర్నా చేస్తున్న టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జ్‌ చేస్తున్న పోలీసులు

వి.కోట, మార్చి 5: వి.కోటలో సోమవారం రాత్రి జరిగిన వీరాంజనేయస్వామి పుష్ప పల్లకి సేవ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం చూపారు. ఎస్‌ఐ వీరంగం.. తీవ్ర విమర్శలకు దారితీసింది. వివరాలిలా ఉన్నాయి. పల్లకి సేవ కవరేజ్‌కు వెళుతున్న ఏబిఎన్‌ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్‌ ద్విచక్ర వాహనాన్ని అనుమతించలేదు. కవరేజ్‌కు వెళ్లాలని అడగ్గా.. బందోబస్తు విధులో ఉన్న పెద్దపంజాణి ఎస్‌ఐ శ్రీనివాసులు అసభ్యపదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న వివిధ ఛానళ్ల ప్రతినిధులు ఎస్‌ఐ తీరును తప్పుపట్టారు. అక్కడకు చేరుకున్న కొందరు మీడియాపట్ల పోలీసుల తీరు సరికాదని వాదనకు దిగారు. పోలీసుల తీరును తప్పుపట్టిన వారిలో తుపాకిచిన్నేపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త చెంగప్ప అనే బాబు కూడా ఉన్నారు. అతడిని ఎస్‌ఐ, సిబ్బంది బూటు కాళ్లతో తన్ని, పోలీసు స్టేషన్‌కు తరలించారు. అతడిని విడిచిపెట్టాలని మీడియా ప్రతినిధులు నిరసనకు దిగడంతో స్టేషన్‌ నుంచి వదిలేశారు. పోలీసుల దెబ్బలకు అతడి చెవిలో రక్తస్రావం కావడం.. రెండు చెవులూ వినిపించక పోవడంతో స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమ కార్యకర్తను పోలీసులు చావబాదారన్న విషయం తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. ఆపై ఎన్టీఆర్‌ కూడలిలో పోలీసుల తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. అకారణంగా తమ కార్యకర్తను చితకబాదిన ఎస్‌ఐ క్షమాపణ చెప్పే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించారు. టీడీపీ నేతలకు సర్దిచెప్పేందుకు సీఐ లింగప్ప ప్రయత్నించగా.. ఎస్‌ఐ క్షమాపణ చెప్పాలంటూ వారు పట్టుబట్టారు. వీరాంజనేయస్వామి పుష్ప పల్లకి ఎన్టీఆర్‌ కూడలికి చేరుకున్నా వీరు ధర్నా విరమించలేదు. దీంతో పోలీసులు టీడీపీ శ్రేణులపై లాఠీ ఝుళిపించారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ వారి మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు నేతలు గాయపడ్డారు. చివరకు టీడీపీ నేతలు ధర్నా విరమించి పక్కకు తప్పుకోవడంతో పల్లకి ముందుకు సాగింది. ఆ సమయంలో కొందరు వైసీపీ శ్రేణులు జై జగన్‌ అంటూ కేకలు వేయడంతో మరోసారి ఉద్రిక్తంగా మారింది. 57 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటేగౌడ పల్లకిలో డ్రైవర్‌గా వాహనాన్ని నడిపారు.

విలేకరులు, టీడీపీ నేతలపై రెండు కేసులు

ఫ వి.కోట పుష్ప పల్లకి సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు విలేకరులు, టీడీపీ నేతలపై రెండు కేసులు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కల్పించారంటూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్‌మోహన్‌రెడ్డి, ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రతినిధులు సునీల్‌, రోషన్‌, అశోక్‌తో పాటు పోలీసుల చేతిలో దెబ్బలుతిన్న చెంగప్ప అలియాస్‌ బాబు సహా ఐదుగురిపై కేసు పెట్టారు.

ఫ పుష్పపల్లకీ వస్తున్నా ఎన్టీఆర్‌ కూడలి వద్ద గుంపుగా చేరి ఆందోళనకు దిగారంటూ మండల టీడీపీ అధ్యక్షుడు రంగనాథ్‌, మాజీ మండల పార్టీ కార్యదర్శి సోమశేఖర్‌, జిల్లా అధికార ప్రతినిధి రాంబాబు, తెలుగు యువత మండల అధ్యక్షుడు ధీరజ్‌తో పాటు 26 మందిపైన.. ఇక్కడా నలుగురు విలేకరులను నిందితులుగా చేర్చి మొత్తం 30 మందిపై మరో కేసు నమోదైంది. కాగా, జర్నలిస్టులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలంటూ అంబేడ్కర్‌ కూడలిలో మంగళవారం రాత్రి ప్రెస్‌ క్లబ్‌ నేతృత్వంలో మీడియా ప్రతినిధులు ఆందోళన చేశారు.

తప్పుడు కేసులు అప్రజాస్వామికం: అమర్‌

వి.కోటలో అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు విలేకరులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబును మంగళవారం ఆయన పరామర్శించారు. టీడీపీ కార్యర్తలను కొట్టడం, మిగిలిన నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జి చేసి.. తిరిగి వారిపైనే కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. ఈ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండు చేశారు. లేదంటే న్యాయపోరాటం చేస్తామన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 01:15 AM