ఉరకలేస్తున్న టీడీపీ
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:43 AM
వైసీపీ దౌర్జన్యాలను, బెదిరింపులు, కేసులను ఎదుర్కొంటూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మళ్లీ మహాశక్తిగా ఆవిర్భవిస్తోంది. ప్రజల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వంపై పెరుగుతున్న ఆగ్రహం, అసంతృప్తి తెలుగుదేశం శ్రేణులకు మరింత శక్తిని ఇస్తున్నాయి.
చిత్తూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ దౌర్జన్యాలను, బెదిరింపులు, కేసులను ఎదుర్కొంటూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మళ్లీ మహాశక్తిగా ఆవిర్భవిస్తోంది. ప్రజల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వంపై పెరుగుతున్న ఆగ్రహం, అసంతృప్తి తెలుగుదేశం శ్రేణులకు మరింత శక్తిని ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు గంగాధరనెల్లూరులో చంద్రబాబునాయుడు బహిరంగ సభ జరగనుంది. ప్రజల సంక్షేమానికి హామీలూ, పార్టీ కార్యకర్తలకు భరోసా ఈ వేదిక మీదనుంచి చంద్రబాబు బలంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు.
పోరాటయోధులుగా మారిన శ్రేణులు
జిల్లాలో మూడేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకుల దౌర్జన్యం, అధికారుల అండతో అక్రమంగా ఏకగ్రీవాలు, ప్రతిపక్షాలు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడాలు.. ఇవన్నీ టీడీపీ శ్రేణులను కొంతకాలం నిస్తేజపరిచాయి. అయితే నారా లోకేశ్ కుప్పం నుంచీ మొదలుపెట్టిన పాదయాత్రకు అడుగడుగునా కల్పించిన ఆటంకాలు, పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలు టీడీపీలో ఆగ్రహాగ్ని రగిలించాయి. వందలాది కేసులు పెట్టినా, జైళ్లలో కార్యకర్తలను కుక్కినా జంకడం లేదు. ఎక్కడికక్కడ వైసీపీ అరాచకాలను నిలదీస్తున్నారు. పెద్దిరెడ్డి జాగీరులా మారిన పుంగనూరు నియోజకవర్గంలో ఇటీవల సంభవిస్తున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యం. మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు ఎక్కువగా వేధింపులకు గురయ్యారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనే వెయ్యి మందికిపైగా నాయకులు, కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు పెట్టారు. ఈ దృష్ట్యా ఈ రెండు నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. సాధారణ ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ పనిచేయకూడదనే కుట్రలో భాగంగానే కేసులు పెట్టారని అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను కింది స్థాయి నుంచి పటిష్టపరిచే పని అధినేత చేస్తారని చెబుతున్నారు. పెద్దిరెడ్డి మాయోపాయాలను దీటుగా ఎదుర్కొనే నాయకులను చంద్రబాబు సన్నద్ధం చేయాల్సిన అవసరం జిల్లాలో ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఓటర్ల జాబితా తప్పులపై గురి
ఓటర్ల జాబితా తయారీలో వైసీపీ కుట్రను జిల్లా టీడీపీ నాయకులు ఎప్పటికప్పుడు గుర్తించారు. టీడీపీ సానుభూతిపరుల ఓటర్లను తొలగించి, వైసీపీ దొంగ ఓట్లను నమోదు చేసుకున్న ఘటనలున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో టీడీపీ నాయకులు వైసీపీ దొంగ ఓట్ల కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. ఓటర్ల జాబితా తయారీలో జరుగుతున్న అక్రమాలను గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. కుప్పంలో జాబితా అక్రమాల గురించి ఎమ్మెల్సీ కంచర్ల, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి, నగరిలోని అక్రమాల గురించి గాలి భానుప్రకాష్, పూతలపట్టులో పోలింగ్ కేంద్రాల సమస్యల గురించి మురళీమోహన్ ఎప్పటికప్పుడు సాక్ష్యాలతో అధికారులకు ఫిర్యాదు చేశారు.
జనసేనతో సమన్వయం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, మదనపల్లె నియోజకవర్గాలు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ, చిత్తూరు జిల్లాలో ఆ పరిస్థితి లేదు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జనసేన నాయకులతో టీడీపీ సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. డీకే చైతన్య పార్టీలో చేరడంతో చిత్తూరులో జనసేన పేరు గట్టిగా వినిపిస్తోంది. జనసేనకు ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులు లేకున్నా, క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు జనసేన క్యాడర్‌తో సమన్వయం చేసుకుని వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
అభ్యర్థుల క్లారిటీ అవసరం..
పలమనేరు, నగరి అసెంబ్లీ స్థానాలు మినహా జిల్లాలో మిగిలిన అసెంబ్లీ, ఓ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంగా వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో వారంతా క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించేశారు. టీడీపీలోనూ చిత్తూరు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పా మిగిలిన స్థానాల్లో స్పష్టత ఉంది. పుంగనూరు విషయంగా టీడీపీ అధిష్ఠానం పునరాలోచించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిత్తూరు అసెంబ్లీ స్థానానికీ ఐదుగురు ఆశావహులు బృందంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల విషయంలో టీడీపీ అధిష్ఠానం క్లారిటీ ఇస్తే మరింతగా సత్ఫలితాలు వస్తాయి.
అందుకే జీడీనెల్లూరుకు..
కుప్పం, పలమనేరు, నగరి నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంగా గత ఎన్నికల నుంచే క్లారిటీ ఉన్నా.. పూతలపట్టు, జీడీనెల్లూరు నియోజకవర్గాలకు గతేడాది జూన్‌లో అభ్యర్థులను ప్రకటించారు. కొత్త అభ్యర్థులను సపోర్ట్ చేసేందుకు గతేడాది ఆగస్టులో చంద్రబాబు వచ్చి బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు జీడీనెల్లూరుకు రా కదలిరా కార్యక్రమంలో భాగంగా మంగళవారం హాజరుకానున్నారు. టీడీపీ కీలకంగా భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నాయకులు వారం రోజులుగా శ్రమిస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి చేశారు.