సామాన్యుడిని అందలమెక్కించిన ఘనత టీడీపీదే
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:32 AM
సామాన్యులను సైతం రాజకీయంగా, ఆర్థికంగా అందలమెక్కించిన ఘనత టీడీపీదేనని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

జయహో బీసీ సదస్సులో నెలవల, నరసింహ యాదవ్
పెళ్లకూరు, జనవరి 11: సామాన్యులను సైతం రాజకీయంగా, ఆర్థికంగా అందలమెక్కించిన ఘనత టీడీపీదేనని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. పెళ్లకూరు మండలంలోని కొత్తూరులో గురువారం జరిగిన జయహో బీసీ సదస్సులో ఆయన మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు, ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు హయాంలోనే అనేకమంది సామాన్యులు రాజకీయంగా ఎదిగారని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దోచుకో.. దాచుకో... కూల్చేయ్,,, ఆక్రమించుకో... వంటి చర్యలకు పాల్పడుతూ 14లక్షల ఎకరాల భూములను ఆ పార్టీ నాయకులు కబ్జా చేశారన్నారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవే అత్యధికంగా ఉన్నాయన్నారు.రాష్ర్టాన్ని రూ.12 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టడంతో ప్రతి కుటుంబంపై వైసీపీ రూ.అయిదు లక్షల అప్పు మిగిల్చిందన్నారు. ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి బీసీలను కోలుకోలేని విధంగా దెబ్బతీశారన్నారు.జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల మనుగడ ప్రశ్నార్థకమేనని స్పష్టం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహయాదవ్ మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీలో దక్కే గౌరవం మరే ఇతర పార్టీల్లో దక్కదన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ,నెల్లూరుకు చెందిన బీద రవిచంద్రను గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు అచ్చెన్నాయుడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని ఆదరించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.వైసీపీ అసమర్థ అవినీతి పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయిన నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని చెప్పారు.నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఎమ్మెల్యేని కూడా తాడేపల్లి ప్యాల్‌సలో అడుగు పెట్టనివ్వని జగన్ నేడు ఓటమి భయంతో అందరినీ పిలిపించుకుని మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపు విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను మాత్రం అవమానాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.చెంబేడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు యర్రాబత్తిన మునీంద్ర ఈ సందర్భంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు సంచి కృష్ణయ్య, నాయకులు చేజర్ల మనోహరాచారి, వట్టకుండల శేఖర్‌నాయుడు, దామెర ప్రసాద నాయుడు, గోపాల్‌రెడ్డి, గూడూరు సుధీర్‌రెడ్డి, అవధానం సుధీర్ తదితరులు పాల్గొన్నారు.