Share News

నత్తగుల్ల అక్రమ రవాణా

ABN , Publish Date - May 27 , 2024 | 12:26 AM

సముద్ర తీరప్రాంతాల్లో మళ్లీ నత్తగుల్ల అక్రమ రవాణా ఊపందుకుంది. టన్నులకొద్దీ నత్తగుల్ల మాంసం పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు తరలిపోతున్నా వన్యప్రాణి విభాగం అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలొస్తున్నాయి.

నత్తగుల్ల అక్రమ రవాణా
కోట మండలం గోవిందపల్లి బకింగ్‌హామ్‌ కెనాల్‌ కట్టపై పోగుచేసిన నత్తగుల్ల

సముద్ర తీరప్రాంతాల్లో మళ్లీ నత్తగుల్ల అక్రమ రవాణా ఊపందుకుంది. టన్నులకొద్దీ నత్తగుల్ల మాంసం పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు తరలిపోతున్నా వన్యప్రాణి విభాగం అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలొస్తున్నాయి.

- కోట

కాకినాడ నుంచి మన జిల్లాలోని చిల్లకూరు, కోట, వాకాడు మండలాల మీదుగా బకింగ్‌హామ్‌ కెనాల్‌ సాగుతుంది. ఈ కెనాల్‌లో సహజసిద్ధంగా నత్తగుల్ల లభిస్తుంది. ఈ నత్తగుల్ల, దీన్నుంచి వచ్చే మాంసానికి రొయ్యల హేచరీల్లో డిమాండ్‌ ఉండటంతో స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. ప్రధానంగా కోట మండలం గోవిందపల్లి, గోవిందపల్లిపాళెం మీదుగా వెళ్లే ఈ బకింగ్‌హాం కెనాల్‌లో విస్తారంగా నత్తగుల్ల దొరుతుతోంది. కెనాల్‌లో ఆటుపోట్లు ఎదురైనప్పుడు ఉప్పునీరంతా వందలాది ఎకరాల్లోని వన్యప్రాణి విభాగం పరిధిలో ఉండే పొలాలకు చేరుతుంది. ఈ నీటిగుండా టన్నులకొద్దీ నత్తగుల్ల కూడా ఈ భూముల్లోకి చేరుతోంది.

కూలీలతో సేకరణ

బయటప్రాంతాల నుంచి కూలీలను రప్పించి బీడు భూముల్లోకి చేరిన నత్తగుల్లను స్మగ్లర్లు పోగు చేయిస్తున్నారు. నత్తలు ఏరినందుకు, అక్కడినుంచి బకింగ్‌హామ్‌ కెనాల్‌ ఒడ్డున చేర్చి మాంసం తీసినందుకు రోజుకు రూ.600 నుంచి రూ.700 వరకు కూలీలకు ముట్టచెబుతున్నారు. మాంసం వేరయ్యాక గుల్లను అక్కడే గుంతలు లోడి తగులబెట్టి సున్నం తయారు చేస్తున్నారు. ఈ సున్నాన్ని కూడా రొయ్యల గుంటల్లో ఎరువులకు బదులు వాడుతుండటంతో దీన్ని కూడా వ్యాపారంగా మార్చుకుంటున్నారు.

ఇద్దరు వ్యాపారుల ద్వారా..

నత్తగుల్ల మాంసాన్ని చిల్లకూరు మండలానికి చెందిన ఇద్దరు వ్యాపారుల ద్వారా పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లోని రొయ్యపిల్లలకు ఆహారంగా తీసుకెళ్తున్నట్లు సమాచారం. మినీవ్యాన్ల ద్వారా టన్నులకు టన్నులు తరలించేస్తున్నారన్న విమర్శలున్నాయి. అదే విధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా, విజయవాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లోని తల్లి రొయ్య పిల్లల హేచరీలకు ఈ నత్తమాంసం ఎగుమతి అవుతున్నట్లు తెలిసింది. ఇటీవల వరకు సర్దుమణిగిన ఈ అక్రమ వ్యాపారం రెండు నెలలుగా.. ప్రధానంగా కోట మండలం సముద్రతీర ప్రాంతాల్లో ఊపందుకుంది.

Updated Date - May 27 , 2024 | 12:26 AM