Share News

సింహాసనంపై శివయ్య వైభవం

ABN , Publish Date - Mar 14 , 2024 | 01:39 AM

శ్రీకాళహస్తీశ్వరాలయ శివరాత్రి ఉత్సవాల్లో బుధవారం రాత్రి దేవరాత్రిని పురస్కరించుకొని శివపార్వతులు కైలాస మేరుపర్వత సింహాసనం, కామధేనువుపై పురవిహారం చేశారు.అంతకుముందు ఉత్సవాలకు ధ్వజావరోహణ కార్యక్రమం ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగింది.

సింహాసనంపై శివయ్య వైభవం
ధ్వజావరోహణం సందర్భంగా పూజలు

శ్రీకాళహస్తి, మార్చి 13: శ్రీకాళహస్తీశ్వరాలయ శివరాత్రి ఉత్సవాల్లో బుధవారం రాత్రి దేవరాత్రిని పురస్కరించుకొని శివపార్వతులు కైలాస మేరుపర్వత సింహాసనం, కామధేనువుపై పురవిహారం చేశారు.అంతకుముందు ఉత్సవాలకు ధ్వజావరోహణ కార్యక్రమం ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగింది. అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ధ్వజ స్తంభం వద్ద కొలువుదీర్చారు. ఆ తరువాత యాగశాలలో పది రోజుల నుంచి పూజలందుకున్న స్వామి, అమ్మవార్ల ఆవాహన కలశాలకు పూజలు చేశారు. వేదోక్తంగా కలశ ఉద్వాసన పలికారు. అనంతరం యాగశాల నుంచి పవిత్ర కలశాలను అర్చకులు శిరస్సుపై దాల్చి ఆలయంలో ప్రదక్షిణ చేసిన తరువాత స్వామివారి ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి వృషభ సంకేత ధవళ పతాకం, కొడి వస్త్రాలు అవనతం చేశారు.అనంతరం ధవళ పతాకాన్ని, దారాన్ని చతుర్మాడ వీధుల్లో కొలువైన నవసంధి వినాయకులకు దర్శింపచేశారు. ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కేడిగ వాహనంపై ఊరేగించాక వసంత మండపంలో త్రిశూలానికి, స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు.ఆలయ చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు, ఈవో నాగేశ్వరరావు, పాలకమండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.ఉత్సవాల్లో గురువారం విశిష్టమైన పల్లకీసేవను నిర్వహించనున్నారు.

Updated Date - Mar 14 , 2024 | 01:39 AM