ఒంటరి ఏనుగు జాడ గుర్తింపు
ABN , Publish Date - May 18 , 2024 | 12:54 AM
చంద్రగిరి మండలం ఆముదాలకోన ఎస్టీ కాలనీ పీతల చెరువు సమీపంలోని అటవీప్రాంతంలో ఒంటరి ఏనుగు జాడను శుక్రవారం అటవీ అధికారులు గుర్తించారు. మూడు రోజులుగా పనపాకం డిప్యూటీ రేంజి అధికారి చినబాబు ఆధ్వర్యంలో ఏనుగు జాడ కోసం గాలిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఏనుగు పాదముద్రలు, వ్యర్థాలు కనిపించాయి.
చంద్రగిరి, మే 17: చంద్రగిరి మండలం ఆముదాలకోన ఎస్టీ కాలనీ పీతల చెరువు సమీపంలోని అటవీప్రాంతంలో ఒంటరి ఏనుగు జాడను శుక్రవారం అటవీ అధికారులు గుర్తించారు. మూడు రోజులుగా పనపాకం డిప్యూటీ రేంజి అధికారి చినబాబు ఆధ్వర్యంలో ఏనుగు జాడ కోసం గాలిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఏనుగు పాదముద్రలు, వ్యర్థాలు కనిపించాయి. దీంతో ఎస్టీ కాలనీతో పాటు పరిసర గ్రామాల్లో ప్రజలను, రైతులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాల వద్దకు, అటవీ ప్రాంతంలోకి వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఒంటరి ఏనుగు ఈనెల 12న చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వెంగంపల్లె ఎస్టీ కాలనీకి చెందిన చిన్నయ్యపై దాడి చేసి చంపేసింది. అక్కడి నుంచి పూతలపట్టు మండలం మీదుగా పాకాల మండల సరిహద్దుల్లోకి చొరబడి 13న చెన్నుగారిపల్లె పంచాయతీ సమీపంలో తమిళనాడుకు చెందిన కాతవరాయన్‌పై దాడి చేసి హతమార్చింది.తాజాగా ఆ ఏనుగు తమ ప్రాంతంలో సంచరిస్తోందని తెలిసి ఆముదాల కోన ఎస్టీ కాలనీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జాడ తెలిసినందున ఏనుగును అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నామని అటవీ సిబ్బంది తెలిపారు.