Share News

పూతలపట్టు వైసీపీలో సిగపట్లు

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:51 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రిజర్వుడు నియోజకవర్గమైన పూతలపట్టు సీటు ఎవరికి కేటాయించాలనే విషయంలో వైసీపీ అధిష్ఠానం మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తోంది.

పూతలపట్టు వైసీపీలో సిగపట్లు
డాక్టర్‌ పూజారి లోకవర్ధన్‌

-తెరమీదకు మూడో పేరు

తిరుపతి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రిజర్వుడు నియోజకవర్గమైన పూతలపట్టు సీటు ఎవరికి కేటాయించాలనే విషయంలో వైసీపీ అధిష్ఠానం మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తోంది. పీలేరు నియోజకవర్గం కలికిరి పట్టణానికి చెందిన డాక్టర్‌ పూజారి లోకవర్ధన్‌ పేరు ముఖ్యనేతల ద్వారా అధిష్ఠానం దృష్టికి వెళ్ళింది. అక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబుకు టికెట్‌ లేదని అధిష్ఠానం తేల్చి చెప్పేసిన నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌ ప్రత్యామ్నాయంగా తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎంఎస్‌ బాబుకే టికెట్‌ ఇవ్వాలని ఓ వర్గం కోరుతుండగా ఆయనను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌కు అవకాశం కల్పించాలని మరో వర్గం విజ్ఞప్తి చేస్తోంది. ఈ అంతరం క్రమేపీ పెరిగిపోయి సునీల్‌కుమార్‌కు టికెట్‌ ఇస్తే అతడికి సహకరించకూడదని ఎంఎస్‌ బాబు వర్గం నిర్ణయించుకున్నట్టు సమాచారం. అదే సమయంలో ఒకవేళ తిరిగి ఎంఎస్‌ బాబుకే గనుక టికెట్‌ కేటాయిస్తే అతడికి సహకరించరాదని ఆయన్ను వ్యతిరేకిస్తున్న వర్గం భావిస్తున్నట్టు తెలిసింది. ఇద్దరిలో ఎవరికి అవకాశమిచ్చినా ఓ వర్గం పనిచేయదన్న సమాచారం అధిష్ఠానానికి అందినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అధిష్ఠానం ఇరువురినీ పక్కన పెట్టి అవసరమైతే మూడవ వ్యక్తిని రంగంలోకి దించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆ క్రమంలోనే కలికిరి పట్టణానికి చెందిన డాక్టర్‌ లోకవర్ధన్‌ పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. సీనియర్‌ వైద్యుడైన ఆయన ప్రస్తుతం అన్నమయ్య జిల్లా వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దానికి తోడు ఆయన సతీమణి వైసీపీ తరపున కలికిరి జడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఈ నేపఽథ్యంలోనే ఆయన పేరు అధిష్ఠానానికి వెళ్ళినట్టు చెబుతున్నారు. పూతలపట్టులో పాత కాపుల కంటే కొత్త వారిని బరిలోకి దింపితే వర్గ విభేదాలు, అసంతృప్తులు వంటివి వుండవన్న భావనతో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌ సైతం లోకవర్ధన్‌ పేరు సూచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పూతలపట్టు నుంచీ వైసీపీ 2014లో డాక్టర్‌ సునీల్‌కుమార్‌కు తొలిసారి టికెట్‌ ఇవ్వగా ఆయన గెలిచారు. 2019లో సునీల్‌కుమార్‌ను పక్కన పెట్టి ఎంఎస్‌ బాబుకు టికెట్‌ ఇవ్వగా ఆయనా గెలిచారు. దీంతో కొత్త వారికి టికెట్‌ ఇస్తే గెలుస్తారన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. దీంతో రానున్న ఎన్నికల్లో సిటింగును, మాజీ ఎమ్మెల్యేని కాదని కొత్త వ్యక్తిని పోటీకి దింపాలన్న ఈ ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతమవుతుందో, దీనిపట్ల పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ నాయకులు, శ్రేణులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సివుంది.

Updated Date - Jan 05 , 2024 | 12:51 AM