Share News

టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jun 17 , 2024 | 01:36 AM

టీటీడీ ఈవో(కార్యనిర్వహణాధికారి)గా శ్యామలరావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.

టీటీడీ ఈవోగా శ్యామలరావు    బాధ్యతల స్వీకరణ
నూతన టీటీడీ ఈవోకు శ్రీవారి చిత్రపటాన్ని అందజేస్తున్న జేఈవో వీరబ్రహ్మం

తిరుమల, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఈవో(కార్యనిర్వహణాధికారి)గా శ్యామలరావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతన ఈవోగా నియమితులైన ఆయన తన సతీమణితో కలిసి ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. క్షేత్రసంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత వరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడినుంచి నేరుగా వైకుంఠ క్యూకాంప్లెక్స్‌కు వెళ్లారు. క్యూలైన్‌ ద్వారా ఆలయంలోకి వెళ్లిన ఆయన రంగనాయమండపంలో టీటీడీ ఈవో (ఎఫ్‌ఏసీ) ఽధర్మారెడ్డి నుంచి బాధ్యతలను అందుకున్నారు. అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరిగి రంగనాయకమండపానికి చేరుకున్న నూతన ఈవో దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. తర్వాత జేఈవో వీరబ్రహ్మం శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

నీటిలో మట్టిలా కనిపిస్తోంది

క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ఇచ్చే నీటిలో కొంచెం మట్టిలా కనిపిస్తోందని, దీనిపై పరిశీలన చేస్తామని ఈవో అన్నారు. క్యూలైన్ల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాలు అన్ని చోట్లా ఇవ్వడం లేదనే ఫిర్యాదులు క్యూలైన్లలోని భక్తుల నుంచి అందాయన్నారు. అధికారులతో సమీక్షించి.. పాలు, టీ పంపిణీపై కూడా దృష్టిసారిస్తామన్నారు. నడిచివచ్చే భక్తులకు టోకెన్లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు కూడా వచ్చాయని, దీన్ని అధిగమిస్తామని చెప్పారు. ఇక, శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ క్యూలైన్లు భారీగా పెరిగిపోవడంపైనా పరిశీలన చేస్తామని తెలిపారు.

తొలిరోజే క్యూలైన్ల పరిశీలన

ఈవోగా బాఽధ్యతలు తీసుకున్న తొలిరోజే తిరుమలలో భక్తుల రద్దీ నెలకొన్న విషయాన్ని శ్యామలరావు తెలుసుకున్నారు. జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిషోర్‌, ఇతర అధికారులతో కలిసి రింగురోడ్డులో వ్యాపించి ఉన్న క్యూలైన్‌ వద్దకు వెళ్లారు. క్యూలైన్ల నిర్వహణ, భక్తులకు అందించే సదుపాయాలను పరిశీలించారు. భక్తులతో మాట్లాడారు. ఎక్కడినుంచి వచ్చారు, క్యూలైన్‌లో ఎంత సేపటినుంచి ఉన్నారు.. అన్నప్రసాదాలు, తాగునీరు అందుతున్నాయా అంటూ ఆరా తీశారు. అన్నప్రసాదాలు, తాగునీటి నాణ్యతను గమనించారు. అలాగే నారాయణగిరి షెడ్లను కూడా పరిశీలించి.. సర్వదర్శన భక్తులతో మాట్లాడారు.

అన్నప్రసాదాల తనిఖీ

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని ఈవో శ్యామలరావు తనిఖీ చేశారు. రాత్రి అన్నప్రసాద భవనానికి చేరుకున్న ఆయన అన్నప్రసాదాలు స్వీకరించారు. తర్వాత వంటశాల, స్టోర్‌ గదిని పరిశీలించారు. అలాగే భక్తుల క్యూలైన్‌, వారికి అన్నప్రసాదాలు అందే తీరున.. నాణ్యతను గమనించారు.

Updated Date - Jun 17 , 2024 | 01:36 AM