తిరుపతిలో షాడో ఎమ్మెల్యే
ABN , Publish Date - Jul 03 , 2024 | 12:10 AM
తిరుపతి ఎమ్మెల్యే ఎవరు? ఆరణి శ్రీనివాసులు కదా! మరి అధికారులతో సమావేశాలు పెట్టి ఉపన్యాసాలు దంచుతున్న ఈయన ఎవరబ్బా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
తిరుపతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తిరుపతి ఎమ్మెల్యే ఎవరు? ఆరణి శ్రీనివాసులు కదా! మరి అధికారులతో సమావేశాలు పెట్టి ఉపన్యాసాలు దంచుతున్న ఈయన ఎవరబ్బా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈయనగారి పేరు ఆరణి శివకుమార్. జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులుకు అన్న కుమారుడు. ఎమ్మెల్యే గారు ఎంత బిజీగా ఉన్నారో ఏమో గానీ ఆయన తరపున అధికారుల బదిలీలు మొదలు..సమీక్షల వరకు అన్నీ శివకుమార్ కానిచ్చేస్తున్నారు. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ అదితి సింగ్ పక్కన కుర్చీలో దర్జాగా కూర్చుని అధికారులు ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది.గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం కమిషనర్‌ను కలిసిన ఆయన పనిలో పనిగా అటెండరు మొదలు కమిషనర్ దాకా అందరూ మంచిగా పనిచేసి ఎమ్మెల్యేకి మంచి పేరు తేవాలని ఉపదేశించారు. ఐఏఎస్ అధికారి అయిన కమిషనర్ కూడా ఈ షాడో ఎమ్మెల్యే ఉపన్యాసాన్ని బుద్ధిగా తల ఊపుతూ వినడమే విచిత్రం. ఎన్నికల సమయంలో తెర వెనుక ఉండి అంతా నడిపిన శివకుమార్ ఇప్పుడు తెరముందుకు వచ్చేశారన్నమాట.