Share News

3380 మందికి సర్వీసు ఓట్లు

ABN , Publish Date - May 31 , 2024 | 01:24 AM

జిల్లాకు చెందిన సర్వీసు ఓటర్ల నుంచి పోస్టల్‌ బ్యాలెట్లు ఇప్పటికీ చేరుతున్నాయి. గురువారం వరకు సుమారు వెయ్యి సర్వీసు ఓట్లు కలెక్టరేట్‌కు అందాయి.

3380 మందికి సర్వీసు ఓట్లు

చిత్తూరు కలెక్టరేట్‌, మే 30: జిల్లాకు చెందిన సర్వీసు ఓటర్ల నుంచి పోస్టల్‌ బ్యాలెట్లు ఇప్పటికీ చేరుతున్నాయి. గురువారం వరకు సుమారు వెయ్యి సర్వీసు ఓట్లు కలెక్టరేట్‌కు అందాయి. వాటిని కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా నోడల్‌ ఆఫీసర్‌ బాక్సులో పెట్టి సీల్‌ వేశారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వీసు ఓటర్లు 3380 మంది ఉన్నారు. వీరంతా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటును ఆయా నియోజకవర్గాల ఆర్వోలకు లేదా జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు గాని జూన్‌ 4వ తేది ఉదయం 8 గంటల్లోపు పంపాలి. ముందుగా సర్వీసు ఓట్ల లెక్కింపు తర్వాతే మిగిలిన ఓట్ల లెక్కింపు కొనసాగుతాయి. ఉదయం 8 గంటల తర్వాత వచ్చే ఓట్లను కౌంటింగ్‌కు పరిగణనలోకి తీసుకోరు. ఇప్పటివరకు సుమారు వెయ్యి సర్వీసు ఓట్లకు సంబంధించిన ఓట్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా అధికారులకు అందాయి. ఇక నాలుగు రోజులే సమయం ఉండగా, ఆ లోపు వచ్చిన ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుని జూన్‌4న లెక్కించనున్నారు. సైనిక దళాల్లో పనిచేసేవారు, వారి కుటుంబసభ్యులకు కేంద్ర ఎన్నికల సంఘం కేటగిరి సర్వీసు ఓటును మంజూరు చేసింది. దీనిని వారు ఎలకా్ట్రనింగ్‌ పద్ధతిలో కానీ, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోల నుంచి పొందివుండాలి. అత్యధికంగా పూతలపట్టు నియోజకవర్గంలో 1075 మంది ఉన్నారు. నియోజకవర్గాలవారీగా... చిత్తూరులో 862, గంగాధరనెల్లూరులో 475, పుంగనూరులో 388, పలమనేరులో 239, కుప్పంలో 202, అత్యల్పంగా నగరిలో 139 సర్వీసు ఓట్లు ఉన్నాయి. వీరందరికీ ఇప్పటికే అధికారులు పోస్టల్‌ బ్యాలెట్లను తపాలాశాఖ ద్వారా పంపారు. వీరు పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటువేసి, తిరిగి కౌంటింగ్‌ సమయానికి అధికారులకు పంపాల్సి ఉంది.

Updated Date - May 31 , 2024 | 09:24 AM