అమృత్ భారత్‌కు పది రైల్వే స్టేషన్ల ఎంపిక
ABN , Publish Date - Jul 25 , 2024 | 01:18 AM
బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏకంగా పది రైల్వే స్టేషన్లకు తీపి కబురు ప్రకటించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ రెండు జిల్లాల పరిధిలో మొత్తం పది రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది.
తిరుపతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏకంగా పది రైల్వే స్టేషన్లకు తీపి కబురు ప్రకటించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ రెండు జిల్లాల పరిధిలో మొత్తం పది రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. తిరుపతి, రేణిగుంట, పాకాల , చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె రోడ్డు, పీలేరు, కుప్పం,గూడూరు, సూళ్ళూరుపేట స్టేషన్లు అవకాశం దక్కించుకున్నాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73 రైల్వే స్టేషన్లను కేంద్రం ఎంపిక చేయగా అందులో ఈ ప్రాంతానివే పది స్టేషన్లు వుండడం గమనార్హం. అమృత్ భారత్ పథకం కింద ఇపుడున్న రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయిలో తిరిగి అభివృద్ధి పరచనున్నారు. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, హంగులతో వీటిని తీర్చిదిద్దే అవకాశముంది. అయితే స్టేషన్ల వారీ అభివృద్ధికి కేటాయించిన నిధుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కొన్నేళ్ళ కిందటే ఈ ప్రాంతంలోని రైల్వే స్టేషన్లను ఆధునికీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం అమృత్ పథకం కిందకు వీటిని చేర్చడంతో ఆధునికీకరణ, అభివృద్ధి పరంగా ఈ స్టేషన్లు మరో అడుగు ముందుకు వేయనున్నాయి. ఎంపికైన స్టేషన్లను పరిశీలిస్తే తిరుపతి, శ్రీకాళహస్తి స్టేషన్లు పుణ్యక్షేత్రాల కేటగిరీలో వుండగా గూడూరు, రేణిగుంట, పాకాల స్టేషన్లు జంక్షన్ కేంద్రాలుగా వున్నాయి. సూళ్ళూరుపేట తమిళనాడు సరిహద్దుల్లోనూ, కుప్పం కర్ణాటక సరిహద్దుల్లోనూ కీలక స్టేషన్లు. చిత్తూరు జిల్లా కేంద్రంతో పాటు తమిళనాడు సరిహద్దుల్లో కీలక స్టేషన్ కాగా పీలేరు ఉమ్మడి చిత్తూరు జిల్లా నడిబొడ్డున ముఖ్యమైన స్టేషన్‌గా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. వీటి ప్రాధాన్యతను బట్టే అమృత్ పథకం పరిధిలోకి వీటిని కేంద్ర ప్రభుత్వం చేర్చినట్టు భావించాల్సి వస్తోంది. ఈ స్టేషన్ల దశ సమీప భవిష్యత్తులో సమూలంగా మారనుంది.