విద్యుత్ బస్సుల చార్జింగ్ స్టేషన్‌కు తిరుమలలో స్థలం ఎంపిక
ABN , Publish Date - Jul 15 , 2024 | 01:40 AM
తిరుమల-తిరుపతి మధ్య పూర్తిస్థాయిలో విద్యుత్ (ఎలక్ర్టిక్) బస్సులు నడపాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. రెండేళ్ల కిందట జిల్లాకు తొలివిడతగా వంద విద్యుత్ బస్సులు వచ్చాయి.
- పరిశీలించి, సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ ఎండీ
- టీటీడీకి ప్రతిపాదనలు పంపాలని ఆదేశం
తిరుపతి(ఆర్టీసీ), జూలై 14: తిరుమల-తిరుపతి మధ్య పూర్తిస్థాయిలో విద్యుత్ (ఎలక్ర్టిక్) బస్సులు నడపాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. రెండేళ్ల కిందట జిల్లాకు తొలివిడతగా వంద విద్యుత్ బస్సులు వచ్చాయి. అందులో 62 బస్సులు.. తిరుమల-తిరుపతి, రేణిగుంట మధ్య, మిగిలినవి తిరుపతి కేంద్రంగా కడప, మదనపల్లె, నెల్లూరు, శ్రీకాళహస్తిలకు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికోసం అలిపిరి డిపో, సీబీఎ్‌సలో చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమల - తిరుపతి మధ్య సుమారు 250 బస్సులు నడపాలన్నది ఇటు ప్రభుత్వం, అటు టీటీడీ లక్ష్యంగా ఉంది. ఇన్ని బస్సులు నడపాలంటే ప్రత్యేకంగా చార్జింగ్ స్టేషన్ (వంద బస్సులు ఒకేసారి చార్జింగ్ చేసుకునేలా)ను ఏర్పాటు చేయాలని భావించారు. దీన్ని తిరుమలలో ప్రస్తుతమున్న బస్టాండు, గ్యారేజీలో ఏర్పాటుకు వీలుపడదని నిపుణుల ద్వారా ఆర్టీసీ అధికారులు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత టీటీడీని సంప్రదించి స్థలం కేటాయించాలని కోరారు. కొన్ని ప్రాంతాలను పరిశీలించి.. బాలాజీనగర్‌కు వెళ్లేమార్గంలో గ్యాస్ గోడౌన్ వద్ద నాలుగు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు డీజీపీ హోదాలో తొలిసారిగా తిరుమల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఏడాదిన్నరగా వాయిదా పడుతున్న ఈ అంశం ఓ కొలిక్కివచ్చింది. శనివారం సాయంత్రం బాలాజీనగర్ వద్ద స్థలాన్ని ఆయన పరిశీలించారు. చార్జింగ్ స్టేషన్‌కు అనుకూల, ప్రతికూల అంశాలపై డీపీటీవో చెంగల్‌రెడ్డి, డీఎం విశ్వనాఽథం, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. స్థల ఎంపికపై ఎండీ సానుకూలంగా స్పందించారు. ఆలస్యం చేయకుండా ఆర్టీసీ తరఫున టీటీడీకి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కాగా, తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ బస్సు టర్మినల్ నిర్మాణ సమయంలో ఇక్కడి డిపోను చంద్రగిరికి తరలించే యోచనలో ఉన్నామని అధికారులు తెలిపారు. అందువల్ల చంద్రగిరి బస్టాండు విస్తరణకు అవసరమైన ప్రతిపాదనలకు కూడా ఎండీ అంగీకరించినట్లు తెలిసింది.