Share News

దొంగ ఓట్లను తొలగిస్తారా? లేదా?

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:21 PM

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో దొంగ ఓట్లను ఎప్పుడు తొలగిస్తారని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ప్రశ్నించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం ఉదయం దొంగ ఓట్లను తొలగించాలంటూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు.

దొంగ ఓట్లను తొలగిస్తారా? లేదా?
ఆవేదనతో పెట్రోలు పోసుకుంటూ...

చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లను తొలగించాలంటూ దీక్ష చేపట్టిన విపక్షం

పోటీగా దీక్షకు దిగిన వైసీపీ శ్రేణులు

పోలీసుల తీరును నిరసిస్తూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న పులివర్తి నాని

అస్వస్థతకు గురవడంతో స్విమ్స్‌లో చికిత్స

తిరుపతి (రవాణా), జనవరి 8: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో దొంగ ఓట్లను ఎప్పుడు తొలగిస్తారని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ప్రశ్నించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం ఉదయం దొంగ ఓట్లను తొలగించాలంటూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ ఆర్డీవో నుంచి కలెక్టర్‌, ఎన్నికల కమిషన్‌ దాకా దొంగ ఓట్లను తొలగించాలని వందలాది వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు బీఎల్వోలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కనుసన్నలోనే ఈ తతంగమంతా జరిగిందని ఆరోపించారు. ఇప్పటికైనా ఈసీ అధికారులు చొరవ తీసుకుని దొంగ ఓట్లను పూర్తిగా తొలగించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.నానీకి మద్దతుగా నియోజకవర్గపరిధిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరాహార దీక్షలో పాల్గొన్నారు.దొంగ ఓట్లు తొలగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. చంద్రగిరి నియోజకవర్గ నాయకులు ఈశ్వర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, గౌస్‌బాషా, మధు, హేమాంబరధరరావు, ఈశ్వరయ్య, పెరుగు భాస్కర్‌రెడ్డి, సింగ్‌ సుఽధ, మహేశ్వరి, సురేష్‌నాయుడు, బిరుదాల భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కాగా నాని చేపట్టిన దీక్షకు తిరుపతి టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్‌ నరసింహయాదవ్‌, కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌వర్మ, కృష్ణయాదవ్‌, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రవి మనోహరాచారి తదితరులు మద్దతు తెలిపారు.

టీడీపీ దీక్షను నీరుగార్చేందుకు రంగంలోకి వైసీపీ

ఉదయం 11గంటల ప్రాంతంలో ప్రారంభమైన దీక్షను జోరువానలోనూ పులివర్తి నాని కొనసాగించారు. దీక్షకు పెద్దఎత్తున మద్దతు లభించడం, నియోజకవర్గంలో చర్చనీయాంశం కావడంతో వైసీపీ అప్రమత్తమైంది.టీడీపీ దీక్షను ఎలాగైనా నీరుగార్చాలన్న ఉద్దేశంతో తిరుపతి రూరల్‌ ప్రాంతంలోని అవిలాల సర్పంచ్‌ సీవీ రమణ, పేరూరు సర్పంచ్‌ దామినేటి కేశవులు, మల్లంగుంటకు చెందిన వైసీపీ నేత రామచంద్రయ్య, వేదాంతపురానికి చెందిన ప్రేమ్‌కుమార్‌, సి.మల్లవరానికి చెందిన మల్లారపు వాసు, గాంధీపురానికి చెందిన మన్నూరు శివ, సెల్వం తదితరులు మధ్యాహ్నం 2.15గంటల ప్రాంంలో ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని టీడీపీ దీక్ష శిబిరం పక్కనే దీక్ష చేపట్టారు.టీడీపీ తరపున దొంగ ఓటర్లను తొలగించాలంటూ నినాదాలు చేస్తే దళితుల ఓట్లను తొలగించిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. దీంతో ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.డీఎస్పీలు యశ్వంత్‌, సురేంద్రరెడ్డి, సీఐలు అబ్బన్న, శివప్రసాద్‌రెడ్డి, జయనాయక్‌, ఎస్‌ఐలు సిబ్బందితో రంగప్రవేశం చేసి వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టీడీపీ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.దీక్ష విరమించాలని లేకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందని నానీకి చెప్పడంతో తాను శాంతియుతంగా దీక్ష చేస్తున్నానని చెప్పారు.దీక్ష విరమించబోనని అవసరమైతే ఆత్మహత్యకు సిద్ధమవుతానని చెప్పి పెట్రోలు ఒంటిపై పోసుకున్నారు. దీంతో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే కొందరు కార్యకర్తలు సైతం ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నారు. గమనించిన పోలీసులు పెట్రోల్‌ క్యాన్‌ను పక్కకు లాగేసి మంచినీళ్లు పోశారు.ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుచానూరులో ఇంటివద్ద వదిలిపెట్టారు. పెట్రోల్‌ ఒంటిపై పోసుకున్న సమయంలో కళ్లలో పడటంతో నాని అస్వస్థతకు గురయ్యారు.దీంతో పార్టీ శ్రేణులు స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.అక్కడ డాక్టర్లు ఆయనకు వైద్యం అందించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.స్విమ్స్‌లో నాని చేరిన విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున స్విమ్స్‌కు తరలివచ్చారు.

Updated Date - Jan 08 , 2024 | 11:22 PM