Share News

మళ్లీ చిగురిస్తున్న ఆశలు

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:31 AM

నేడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అభివృద్ధిలో పరుగులు పెట్టనున్న సొంత జిల్లా

మళ్లీ చిగురిస్తున్న ఆశలు
తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ఏర్పాట్లు

తిరుపతి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు అక్షరాలా మళ్ళీ మహర్దశ మొదలు కాబోతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెట్టబోతోంది. రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలో తిరిగి గుర్తింపునకు నోచుకునే సుముహూర్తం ప్రారంభమవుతోంది. నేడు చంద్రబాబు నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.సొంత జిల్లాలో అభివృద్ధిపై, శాంతి భద్రతల పరిరక్షణపై, క్రమశిక్షణతో కూడిన పాలనపై చంద్రబాబు పట్ల ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు తిరిగి మొలకెత్తుతున్నాయి.జిల్లాలో చంద్రబాబు అభివృద్ధికి పర్యాయపదంగా మారారంటే అతిశయోక్తి కాదు. ఆయన పేరు తలిస్తే చాలు తిరుపతి ఐఐటీ మదిలో మెదులుతుంది. ఐఐఎ్‌సఈఆర్‌ కళ్ళ ముందు కదలాడుతుంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలినరీ, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్మూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు గుర్తుకొస్తాయి. అవే కాదు బెంగళూరు నుంచీ చిత్తూరు మీదుగా చెన్నై వెళ్ళే ఫోర్‌ లేన్‌ సిమెంట్‌ రోడ్డు, పూతలపట్టు నుంచీ నాయుడుపేట వరకూ ఆరు వరుసల జాతీయ రహదారి జిల్లా స్వరూపాన్ని మార్చిన తీరు కళ్ళ ముందు నిలుస్తుంది. స్మార్ట్‌ సిటీలో భాగంగా తిరుపతి నగరం నడిబొడ్డున గరుడ వారధి చటుక్కున జ్ఞాపకమొస్తుంది. రేణిగుంట, ఏర్పేడు మండలాల నడుమ జిల్లా ప్రతిష్టను ఉవ్వెత్తున పెంచిన శ్రీ వెంకటేశ్వర ఎలకా్ట్రనిక్‌ మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు, వాటిలో వెలసిన ప్రతిష్టాత్మక పరిశ్రమలు స్ఫురిస్తాయి. ఇంకాస్త వెనక్కు వెళితే ప్రతి రెవిన్యూ డివిజన్‌లో ఇంజనీరింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేసిన సీఎంగా చంద్రబాబు పాలన తొలిరోజులు గుర్తుకొస్తాయి. కుప్పంలో ఇజ్రాయెల్‌ టెక్నాలజీతో వ్యవసాయాన్ని ఆధునికత వైపు పరుగులు పెట్టించడం, అక్కడే ద్రవిడ విశ్వవిద్యాలయం, పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల ఏర్పాటు వంటివి ఆయన చొరవకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన వైనం జ్ఞప్తికొస్తుంది. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల పనులను పరుగులెత్తించి కాలువ గట్లపై నిద్రించిన ఆయన పట్టుదల జిల్లా ప్రజలు మరచిపోవడం సాధ్యమేనా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించిన 14 ఏళ్ళలో ఉమ్మడి చిత్తూరు జిల్లా సంభ్రమాశ్చర్యపరిచే విధంగా అభివృద్ధికి నోచుకున్న సంగతి తెలియంది కాదు. తాజాగా మరో ఐదేళ్ళ కాలానికి ఆయన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేపడుతున్న తరుణంలో జిల్లా ప్రజలు మరోమారు జిల్లా అభివృద్ధిపై ఆశలు పెంచుకుంటున్నారు. గడిచిన ఐదేళ్ళలో స్తంభించిన అభివృద్ధి పనుల్లో తిరిగి కదలిక వస్తుందని, పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి వ్యవసాయం జోరందుకుంటుందని ఆశిస్తున్నారు. చంద్రబాబు దార్శనికత, చొరవ, సొంత ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ... వెరసి జిల్లా భవిష్యత్తును ఉన్నతంగా నిర్దేశిస్తుందని కలలు కంటున్నారు. వారి ఆశలు నెరవేరాలని ఆశిస్తూ... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న జిల్లా ప్రజల తరపున చంద్రబాబుకు శుభాకాంక్షలు!

ప్రత్యక్ష వీక్షణకు పలుప్రాంతాల్లో ఏర్పాట్లు

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి జిల్లాలో గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ ప్రధాన కేంద్రం వరకు 138 ప్రదేశాల్లో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. జిల్లాస్థాయిలో, తిరుపతి నియోజకవర్గ కార్యక్రమం తిరునగరిలోని కచ్చపి ఆడిటోరియంలో ఉంటుందన్నారు. నియోజకవర్గాల వారీగా.. సత్యవేడుకు సంబంధించి ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరం, గూడూరుకు సీఆర్‌రెడ్డి కల్యాణ మండపం, సూళ్లూరుపేటకు ఆర్యవైశ్య కల్యాణమండపం, వెంకటగిరికి ఎంసీ మీటింగ్‌ హాల్‌, శ్రీకాళహస్తికి ఎన్టీఆర్‌ పార్కు మండల కార్యాలయం పక్కన, చంద్రగిరికి నారావారిపల్లెలో సీహెచ్‌సీ సమావేశమందిరం, ఇవే కాకుండా ప్రతి ఒక్కరూ వీక్షించేలా ప్రతి మండల కార్యస్థానంలో ఎంపీడీవో సమావేశ మందిరాలు, కమ్యూనిటీ హాల్‌, పలు గ్రామ పంచాయతీల పరిధిలోని అంగన్‌వాడీలు, పాఠశాల భవన ఆవరణంలో, కమ్యూనిటీ కేంద్రాల్లో మొత్తం 138 ప్రదేశాల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్‌, టీవీ, ఇంటర్నెట్‌, డిష్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

Updated Date - Jun 12 , 2024 | 12:31 AM