Share News

పల్లెల్లో జనసభలు

ABN , Publish Date - Aug 24 , 2024 | 01:17 AM

గ్రామాల సమగ్రాభివృద్ధి, స్వయం సమృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గ్రామ సభలకు శ్రీకారం చుట్టింది. రైతులకు మేలు కలిగేలా, వ్యవసాయ అనుబంధ పనుల్ని కూడా ఉపాధి నిధులతో అనుసంధానం చేసింది.

పల్లెల్లో జనసభలు
విజయపురం మండలం ఆలపాకలో జరిగిన ఉపాధి గ్రామసభలో మాట్లాడుతున్న జడ్పీసీఈవో గ్లోరియా

ఫ రూ.91.30 కోట్లతో 1407 పనులకు ఆమోదం

ఫ ఆయా నియోజకవర్గాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు

చిత్తూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గ్రామాల సమగ్రాభివృద్ధి, స్వయం సమృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గ్రామ సభలకు శ్రీకారం చుట్టింది. రైతులకు మేలు కలిగేలా, వ్యవసాయ అనుబంధ పనుల్ని కూడా ఉపాధి నిధులతో అనుసంధానం చేసింది. వైసీపీ ప్రభుత్వం ఈ గ్రామసభల నిర్వహణను పూర్తిగా విస్మరించగా.. కూటమి ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్వహించింది. జిల్లాలోని 700 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం సభలు నిర్వహించగా.. గ్రామస్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అన్ని పంచాయతీల్లో కలిపి రూ.91.30 కోట్లతో 1407 పనులకు ఆమోదం లభించింది.

గుర్తించిన పనులు..

ఈ గ్రామ సభల్లో ఉపాధిహామీ కూలీల హక్కులు, రాజీలేని అంశాలు, ఉపాధి హామీ తరపున చేపట్టే పనులు, సామాజిక తనిఖీల ప్రాముఖ్యత తదితర విషయాల గురించి అధికారులు గ్రామీణులకు అవగాహన కల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల్ని గుర్తించి, ప్రణాళికల్ని రూపొందించారు. ఈ సభల్లో భాగంగా మరుగుదొడ్లు, విద్యుత్తు, కొళాయి, వంట గ్యాస్‌ కనెక్షన్లు, మురుగునీరు- ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంటు రోడ్లు, గ్రామాల నుంచి మండల కేంద్రాలకు లింకు రోడ్లు, ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణం, ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాలు, పశువుల పెంపకం, షెడ్ల నిర్మాణానికి సహకారం అందించేలా పనుల్ని గుర్తించి అధికారులు ప్రణాళికల్ని సిద్ధం చేశారు. ఇలా జిల్లాలో శుక్రవారం జరిగిన 700 గ్రామ సభల్లో రూ.1407 పనుల్ని గుర్తించారు. ఈ పనుల పూర్తిగా రూ.91.30 కోట్లు అవసరమున్నట్లు అంచనా వేయగా, ఈ నిధుల్ని ఉపాధిహామీ పథకం ద్వారా ఖర్చు చేయనున్నారు.

గ్రామ సభలు జరిగిన తీరు..

గ్రామ సభల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులు, ఉపాధిహామీ ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఉపాధి కూలీలు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఐదేళ్ల తర్వాత సభల్ని నిర్వహిస్తుండడంతో ప్రజలంతా ఉత్సాహంతో పాల్గొన్నారు. ప్రజలు గ్రామాల్లో అవసరమైన పనుల్ని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలు అందించారు. చాలాచోట్ల వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు హాజరవ్వలేదు. సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలో జరిగిన గ్రామ సభలో.. ‘మాకు గత ప్రభుత్వంలో పనులు కల్పించలేదని, వైసీపీ నాయకులే పనులు చేసుకున్నారు’ అని పలువురు మహిళలు అధికారులకు ఫిర్యాదు చేశారు. రైతులకు ఉపయోగపడే పనుల్ని కల్పించాలని కోరారు. రామకుప్పం గ్రామసభలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహించారు.

పాల్గొన్న ప్రజాప్రతినిధులు

గుడుపల్లె మండలం పీబీవాడ, కుప్పం రూరల్‌లోని పైపాళ్యం, వెండుగంపల్లె గ్రామసభల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ పాల్గొన్నారు. వి.కోట మండలం బోడిగుట్లపల్లె పంచాయతీలో జరిగిన గ్రామసభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అమరనాథరెడ్డి.. చిత్తూరు రూరల్‌ మండలం తుమ్మిందపాలెం, గుడిపాల మండలంలోని ఏఎల్‌పురం, బసవపల్లె గ్రామ సభల్లో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ పాల్గొన్నారు. ఎస్‌ఆర్‌పురం మండలం ముద్దికుప్పం, కార్వేటినగరం గ్రామ సభలకు ఎమ్మెల్యే థామస్‌.. తవణంపల్లె మండలం కాణిపాకపట్నం, బంగారుపాళ్యం మండలంలోని నలగాంపల్లె గ్రామ సభలకు ఎమ్మెల్యే మురళీమోహన్‌ హాజరయ్యారు. కాణిపాకపట్నంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌ కూడా పాల్గొన్నారు. నగరి నియోజకవర్గంలోని వడమాలపేట పంచాయతీ, పుత్తూరు రూరల్‌లోని గోపాలకృష్ణాపురంలో జరిగిన గ్రామసభల్లో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ పాల్గొన్నారు. పులిచెర్ల మండలంలోని 102రామిరెడ్డిగారిపల్లె గ్రామ సభకు పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి హాజరయ్యారు. గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యేలంతా హామీ ఇచ్చారు. వి.కోట సచివాలయంలో జరిగిన సభకు జడ్పీ ఛైర్మెన్‌ శ్రీనివాసులు హాజరయ్యారు.

ఫ పాల్గొన్న అధికారులు

జీడీనెల్లూరు మండలంలోని పెద్దకాల్వ, చిత్తూరు మండలంలోని ముత్తుకూరు, పూతలపట్టులోని బండపల్లె గ్రామ సభల్లో డ్వామా పీడీ రాజశేఖర్‌ పాల్గొని, ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనుల్ని వివరించారు. విజయపురం మండలం ఆలపాకంలో, నగరి మండలం తణుకుపేటలో జడ్పీ సీఈవో గ్లోరియా, డీపీవో లక్ష్మి పాల్గొన్నారు.

మరింత ప్రోత్సాహం

వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు రెండు నెలలకోసారి ఉపాధి హామీ బిల్లులు వచ్చేవి. ఈ రెండు నెలలుగా పనిచేసిన వారంలోనే బిల్లులు పడుతున్నాయి. ఇప్పుడు గ్రామ సభల నిర్వహణతో మరింతగా ప్రోత్సహిస్తున్నారు.

- కస్తూరమ్మ, వెంకటాద్రికాలనీ, పుంగనూరు మండలం

Updated Date - Aug 24 , 2024 | 01:17 AM