Share News

కులగణనకు యాప్‌తో ఆపసోపాలు

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:56 AM

కులగణనకు తొలి రెండ్రోజులు సిబ్బందికి అడ్డంకులు ఎదురయ్యాయి. రోజంతా మొబైల్‌ యాప్‌లు పనిచేయక పోవడంతో రాత్రి వరకు ఆపసోపాలు పడుతూ గణన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కులగణనకు యాప్‌తో ఆపసోపాలు
తిరుచానూరులో వివరాలు సేకరిస్తున్న సచివాలయ సిబ్బంది

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 20: కులగణనకు తొలి రెండ్రోజులు సిబ్బందికి అడ్డంకులు ఎదురయ్యాయి. రోజంతా మొబైల్‌ యాప్‌లు పనిచేయక పోవడంతో రాత్రి వరకు ఆపసోపాలు పడుతూ గణన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సర్వర్‌ మొరాయించడంతో మరిన్ని ఇక్కట్లు తప్పడం లేదు. ఒక్కో ఇంటి వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో ఆయా కుటుంబ యజమానుల సహనాన్ని పరీక్షించినట్లయ్యింది. ఈ సర్వే కోసం ప్రతి సచివాలయంలోనూ సిబ్బంది, వలంటీర్లు, నోడల్‌ ఆఫీసర్లతో స్పెషల్‌ టీమ్‌లను నియమించారు. వలంటీర్లు రెండ్రోజులుగా యాప్‌ ద్వారా అనుసంధానం కాగానే మొత్తం 14 అంశాలను పూర్తిచేయాల్సి ఉంది. జిల్లాలో 4,502 మంది సిబ్బంది.. 504 గ్రామ, 108 వార్డు సచివాలయాల పరిధిలో శుక్రవారం నుంచి గణన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సర్వే మధ్యలోనే పలు కుటుంబ యజమానులు మా కొద్దీ సర్వే అంటూ వెళ్లిపోతున్నారు. కులగణన ఈనెల 28వ తేదీ వరకు నిర్వహిస్తారు.

సర్వే ఇలా..

ప్రతి కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. ఏ కులం, ఉప కులం, మతం, చదువు, వివాహ స్థితి, కుటుంబ సభ్యులందరి వ్యక్తిగత వివరాలు సేకరించాలి. ఇదంతా అయ్యాక ఆ కుటుంబ సభ్యుడి వద్ద బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ చేయించుకోవాలి. అనంతరం సచివాలయ సెక్రటరీ, వలంటీరు బయోమెట్రిక్‌ వేయాలి. ఇదిలా ఉండగా వలంటీర్లకు కావాల్సిన బయోమెట్రిక్‌ పరికరాలు 50శాతం మందికి లేదు. ఉన్నవాటిలో 20 శాతంపనిచేయడం లేదు. మరోపక్క వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి సమన్వయం ఉండటం లేదని తెలుస్తోంది.

తిరుపతిలో రెండు రోజుల్లో 9శాతంమంది వివరాలు మాత్రమే సేకరణ

తిరుపతి(కలెక్టరేట్‌), జనవరి 20: జిల్లావ్యాప్తంగా కులగణన ప్రక్రియకు రెండవ రోజైన శనివారం కూడా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. పలు ప్రాంతాల్లో యాప్‌ పనిచేయకపోవడంతో వివరాల నమోదు ప్రక్రియ ముందుకు సాగక సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇబ్బందులు పడ్డారు.691 సచివాలయాలను 12,357క్లస్టర్లుగా విభజించగా వాటిలో 9,555క్లస్టర్లలో మాత్రమే కులగణన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని 7,14,853 ఇళ్లకు గాను రెండ్రోజుల్లో 94,662ఇళ్లను సందర్శించి వివరాలను సేకరించారు. జిల్లావ్యాప్తంగా 13.24శాతం గృహాలు, 9.92శాతం కుటుంబ సభ్యులను సర్వే చేయగలిగారు. కులగణనకు సంబంధించి ప్రతి ఇంటి వద్ద సర్వే చేయడానికి అరగంట సమయం పడుతోందని సచివాలయ సిబ్బంది వాపోతున్నారు. సుమారు 30 ప్రశ్నలకు ఆన్‌లైన్‌లో సమాధానాలు నమోదు చేయాల్సి రావడం, సర్వర్లు అంతంతమాత్రమే పనిచేస్తుండడంతో ఇంటి యజమాని, వలంటీరు, సచివాలయ సిబ్బంది వేలిముద్రలు అప్‌లోడ్‌ కావడంలేదు.కులగణన ప్రక్రియకు ఈ నెల 28వ తేది వరకు గడువుండగా సర్వర్‌ సమస్యలు కొనసాగితే ఆ లోపు వివరాలసేకరణ సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మా ఆస్తుల వివరాలతో మీకేం పని?

కులగణన సర్వేలో ఆస్తులు, ఆదాయం, పొలాలు, భూములు, కార్లు వంటి వివరాలను సేకరిస్తున్నారు. వీటితో పాటు ఆవులు, కోళ్లు వంటి వివరాలను కూడా అడుగుతున్నారు.దీంతో చాలామంది వివరాలు చెప్పడానికి ఇష్టపడడం లేదు.ఆస్తులు ఎక్కడెక్కడున్నాయని అడిగితే మీకు కావాల్సింది కుల వివరాలు మాత్రమే కానీ మా ఆదాయ వనరులతో మీకేం పనంటూ జనం నిలదీస్తున్నారు. అధికారులు చెప్పినట్లు చేయాలి కదా అని సచివాలయ సిబ్బంది వివరాల కోసం ప్రాధేయపడుతున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 01:56 AM