Share News

వైజాగ్‌-చెన్నై కారిడార్‌కు ప్రాధాన్యం

ABN , Publish Date - Jul 24 , 2024 | 01:35 AM

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు సంబంధించి కేటాయింపులు వెల్లడైంది స్థూలంగా మాత్రమే. జిల్లాలోని ఐఐటీ, ఐజర్‌, కలినరీ ఇన్‌స్టిట్యూట్‌, జాతీయ సంస్కృత వర్శిటీ, విమానాశ్రయం, రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల వివరాలు తెలియడానికి కొంత సమయం పట్టనుంది.ఇతర కేటాయింపుల విషయానికి వస్తే జిల్లా మీదుగా వెళుతున్న వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రకటించింది.

వైజాగ్‌-చెన్నై కారిడార్‌కు ప్రాధాన్యం

- పారిశ్రామికరంగానికి భారీ కేటాయింపులతో ప్రయోజనం

- వెనుకబడిన జిల్లా కింద కొనసాగనున్న ఆర్థిక సాయం

తిరుపతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు సంబంధించి కేటాయింపులు వెల్లడైంది స్థూలంగా మాత్రమే. జిల్లాలోని ఐఐటీ, ఐజర్‌, కలినరీ ఇన్‌స్టిట్యూట్‌, జాతీయ సంస్కృత వర్శిటీ, విమానాశ్రయం, రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల వివరాలు తెలియడానికి కొంత సమయం పట్టనుంది.ఇతర కేటాయింపుల విషయానికి వస్తే జిల్లా మీదుగా వెళుతున్న వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రకటించింది. జిల్లాకు సంబంధించి ఈ కారిడార్‌ పరిధిలోకి వెంకటగిరి, గూడూరు, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు వస్తుండగా వీటి పరిధిలో కారిడార్‌కు సంబంధించిన పలు నోడ్‌లున్నాయి. ఇప్పటికే ఆయా చోట్ల పారిశ్రామిక వాడలు ఏర్పాటు కాగా మిగిలిన చోట్ల పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు భూసేకరణ జరుగుతోంది. తాజా బడ్జెట్‌లో ఈ కారిడార్‌కు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన నేపధ్యంలో పారిశ్రామిక వాడల ఏర్పాటు వేగవంతం కానుంది. అలాగే ఇప్పటికే ఏర్పాటైన వాడల్లో పరిశ్రమలు వచ్చే అవకాశం మరింత మెరుగుపడనుంది. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈ పథకం కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాకు రూ. 50 కోట్లు విడుదల కానున్నాయి. ఈ నిధులను ప్రఽధానంగా జిల్లాలోని వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు వినియోగించనున్నారు.తాజా బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి కేటాయింపులు భారీగా పెరిగినందున పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం వున్న జిల్లాలోని తూర్పు ప్రాంతాలకు మేలు జరగనుంది.ఇప్పటికే సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో పారిశ్రామిక రంగం వృద్ధి చెందింది. శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, రేణిగుంట, నాయుడుపేట, తడ, వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల పరిధిలో జాతీయ, బహుళ జాతి కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. శ్రీసిటీ సెజ్‌ ప్రైవేటు రంగంలో వుండగా నాయుడుపేట మండలం మేనకూరు సెజ్‌ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తోంది. అయితే శ్రీసిటీతో పోలిస్తే మేనకూరు సెజ్‌ పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ విషయాల్లో బాగా వెనుకబడి వుంది.తాజా బడ్జెట్‌ కేటాయింపులతో ఇక్కడ కూడా మరిన్ని పరిశ్రమల ఏర్పాటు వేగవంతం కానుంది.ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం ద్వారా మరింతమంది యువకులు వ్యాపారాలు, సూక్ష్మ తరహా పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది.

క్యాన్సర్‌ బాధితులకు ఉపశమనం

దేశవ్యాప్తంగా క్రమేపీ క్యాన్సర్‌ బాధితులు పెరుగుతున్నారు.తిరుపతిలో రుయాస్పత్రిలోనూ, స్విమ్స్‌ ఆస్పత్రిలోనూ అంకాలజీ విభాగాలున్నాయి. స్విమ్స్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజీ ఏర్పాటు పురోగతిలో వుంది. మరోవైపు జాతీయ స్థాయి ప్రాముఖ్యత కలిగిన టీటీడీ-టాటా సంయుక్త నిర్వహణలోని క్యాన్సర్‌ ఆస్పత్రి తిరుపతిలోనే వుంది. దీంతో జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచీ కూడా క్యాన్సర్‌ బాధితులు వైద్యం కోసం, వైద్య పరీక్షల కోసం ఇక్కడికి వస్తున్నారు. తాజా బడ్జెట్‌లో క్యాన్సర్‌ బాధితులు వినియోగించే మూడు ప్రధాన మందులపై జీఎస్టీ తొలగిస్తున్నట్టు ప్రకటించడంతో సంబంధిత మందుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన క్యాన్సర్‌ బాధితులకు ఉపశమనం కలిగించనుంది.

మహిళలకు వరం

మహిళల పేరిట ఆస్తులు రిజిస్టర్‌ చేస్తే స్టాంపు డ్యూటీపై రాయితీని బడ్జెట్‌లో ప్రకటించారు. రిజిస్ట్రేషన్‌ వ్యయం గణనీయంగా తగ్గనున్న నేపధ్యంలో ఇక నుంచీ కుటుంబ ఆస్తులు, వ్యాపారపరంగా ఆస్తులను మహిళల పేరిట రిజిస్టర్‌ చేసే అవకాశం పెరిగే అవకాశాలున్నాయి. దీనివల్ల కుటుంబాల్లోనూ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లోనూ మహిళలకు ప్రాధాన్యత పెరగనుంది.అలాగే బడ్జెట్‌లో బంగారు, వెండిపై కస్టమ్స్‌ డ్యూటీని ఆరు శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించడంతో త్వరలో వాటి ధరలు కొంత మేరకు తగ్గే అవకాశం ఏర్పడింది.మహిళలకు ఈ పరిణామం కొంత ఊరటనివ్వనుంది.

రాజధానికి ఆసరా

కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్ల నిధులు కేటాయించడం సంతోషకరం. పోలవరం నిర్మాణానికి కూడా బడ్జెట్‌ బాసటగా నిలిచింది. విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు నిధులు కేటాయించడం హర్షదాయకం.

- చిన్నస్వామి నాయుడు, రిటైర్డు ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌

వెనకబడిన జిల్లాలకు నిధులివ్వడం సంతోషకరం

విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షన్నర కోట్లు,వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించడం మంచి పరిణామం.ఐదేళ్ళలో నాలుగు కోట్లమందికి ఉపాధి కల్పించడంతో పాటు ,స్వయం ఉపాధి పొందుతున్న చేతి వృత్తి మహిళలకు రుణ సాయం పెంచడం మంచి పరిమాణం.వెనుకబడిన జిల్లా కోటాతో అందే ప్రత్యేక నిధుల వల్ల మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతుంది.

- కొండేటి సునీత, ఎస్వీయూ ఎకనమెట్రిక్స్‌ ప్రొఫెసర్‌

వరాలజల్లు

అమరావతి, పోలవరం నిర్మాణాలతో పాటు వ్యవసాయ రంగానికి తగిన విధంగా కేటాయింపులు చేసి ఏపీకి ప్రాధాన్యత ఇచ్చినందుకు ప్రధానమంత్రికి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు.మొత్తంగా చూసుకుంటే కూ డా అత్యంత సమతుల్యమైన బడ్జెట్‌ ఇది.

- భానుప్రకా్‌షరెడ్డి, బీజేపీ నేత

విద్యారంగానికి కేటాయింపులు బాగున్నాయ్‌

వేతన జీవులకు స్వల్ప ఊరట లభించింది.ఏపీ అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం హర్షణీయం. విద్యారంగానికి కూడా నిధుల కేటాయింపు సంతృప్తికరంగానే వుంది.

- ఎస్‌. బాలాజి, ఆపస్‌ అధ్యక్షుడు

రాష్ట్రానికి సాయం శుభపరిణామం

అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పూర్తికోసం సంపూర్ణ సహకారం అందిస్తామనడం సంతోషకరం.పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్ధిక సాయం ఇవ్వడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి పెరుగుతుంది..

- బొజ్జల సుధీర్‌రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

నిరాశాపూరితం

పాత పన్నుల విఽధానంలో మార్పులు తీసుకురాకుండా కొత్త పన్నుల విధానంలో స్వల్ప మార్పులు చేయడంవల్ల వేతన జీవులకు ఈ బడ్జెట్‌ నిరుపయోగంగా మారింది. ఆదాయ పన్నుకు సంబంధించి కొత్త విధానంలో ఎక్కువ పన్ను చెల్లించాల్సిరావడంతో ఉద్యోగులందరూ మళ్లీ పాత విధానమే మేలనుకునే పరిస్థితి వచ్చింది. సీపీఎస్‌ విధానంలో మార్పులు చేస్తామని చెబుతూనే పాత పెన్షన్‌ విధానం అమలుపై ప్రకటన లేకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయులను నిరాశపరిచింది. విద్యారంగానికి 6 శాతం బదులు 3.25 శాతం నిధులు కేటాయించడం విద్యారంగంపట్ల కేంద్రప్రభుత్వ చిత్తశుద్దిని తెలియజేస్తోంది

- కె. ముత్యాలరెడ్డి, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఉద్యోగులకు స్వల్ప ఊరట

నాలుగేళ్ల నుంచి ఆదాయపన్ను శ్లాబ్‌లో మార్పులేదు.ఈ బడ్జెట్‌లో స్టాండర్డ్‌ డైరెక్షన్‌ రూ.50వేల నుంచి 75వేలకు పెంచడం వల్ల ఉద్యోగులకు స్వల్ప ఊరట లభించింది.ఉద్యోగులకు మరింత లబ్ధి చేకూరేలా పాతవిధానంలో కూడా మార్పులు చేసి ఉంటే బాగుండేది.

- కె.వెంకటరమణ,హెచ్‌ఎంల సంఘ అధ్యక్షుడు

అప్పులు కాదు...గ్రాంట్‌ కావాలి

మన రాష్ట్రానికి కావాల్సింది అప్పులు కాదు, గ్రాంట్‌ ఇవ్వాలి. 90 శాతం గ్రాంట్‌గా ఇచ్చేదాన్నే ప్రత్యేక హోదా అంటారు. మనకేమో అప్పులు ఇస్తామంటున్నారు. మసిపూసి మారేడుకాయ చేశారు.ఇది పూర్తిగా అసంతృప్తికరమైన బడ్జెట్‌.

-చింతామోహన్‌, కాంగ్రెస్‌ నేత

అమరావతి ఇక పరుగులే

అమరావతికి రూ.15వేల కోట్ల కేటాయింపుతో పనులు వేగవంతం కానున్నాయి.అదేవిధంగా కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తికానుంది.

-ఆరణి శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే

ఆశాజనకం

పెరిగిన ధరలతో ఉద్యోగులు సతమతమవుతున్న రోజుల్లో బడ్జెట్‌ కేటాయింపులు ఊరటనిచ్చాయి. ఆదాయపన్ను శ్లాబ్‌ రేట్లను సవరించినందుకు కృతజ్ఞతలు .

- వరప్రసాద్‌ నైనార్‌, ఏపీ ఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు

Updated Date - Jul 24 , 2024 | 09:12 AM