Share News

సార్వత్రికానికి సన్నద్దం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:54 AM

నేడు ఎన్నికల నోటిఫికేషన్‌ నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు

సార్వత్రికానికి సన్నద్దం
కలెక్టరేట్‌లో నామినేషన్ల హెల్ప్‌డె్‌స్కను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

తిరుపతి (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 17: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారయంత్రాంగం సిద్ధమైంది.తిరుపతి పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 13న జరగబోయే ఎన్నికలకు గురువారం ఉదయం నోటిఫికేషన్‌ విడుదల కానుంది.ఉదయం 11గంటల నుంచి ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు.సెలవు దినాలు మినహా ఈ నెల 25వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల లోపు అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు ఆర్వోలకు సమర్పించాల్సి ఉంటుంది.నామినేషన్‌ కేంద్రాల్లో ప్రత్యేక హెల్ప్‌ డెస్కులు కూడా ఏర్పాటు చేశారు. నేడు దశమి, శుక్రవారం ఏకాదశి కావడంతో పలువురు అభ్యర్థులు ఈ రెండురోజుల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ రిటర్నింగ్‌ అధికారి హోదాలో కలెక్టరేట్‌ కార్యాలయంలోనే నామినేషన్‌ పత్రాలు స్వీకరించనున్నారు.గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో అయిన ఆర్డీవో ఎం.కిరణ్‌కుమార్‌, సూళ్ళూరుపేట నియోజకవర్గానికి సంబంధించి తహసీల్దారు కార్యాలయంలో ఆర్వో అయిన ఆర్డీవో ఆర్‌.చంద్రముని

నామినేషన్లు స్వీకరిస్తారు.వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి మున్సిపల్‌ ఆఫీ్‌సలో ఆర్వో అయిన జేసీ ధ్యానచంద్ర, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో అయిన ఆర్డీవో ఎ.నిషాంత్‌రెడ్డి , తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి ఆర్వో అయిన కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆదితిసింగ్‌ అర్బన్‌ తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో అయిన ఆర్డీవో ఎస్‌.రవిశంకర్‌రెడ్డి , సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి తహసీల్దారు కార్యాలయంలో ఆర్వో అయిన ఏపీఐఐసీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నరసింహులు నామినేషన్లు స్వీకరిస్తారు.

ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు సమర్పించవచ్చు

ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు సమర్పించే వెసులుబాటును ఎన్నికల కమిషన్‌ కల్పించింది. సువిధ యాప్‌(పోర్టల్‌లో) ద్వారా నామినేషన్లు సమర్పించి తరువాత ఆయా పత్రాల కాపీలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

అభ్యర్థుల లెక్క పక్కా..

ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.95లక్షల వరకు ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల ఖర్చును పరిగణనలోకి తీసుకుంటారు. 25వ తేది వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 26న పరిశీలిస్తారు. ఉపసంహరణకు 29వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.నామినేషన్‌ దాఖలు సమయంలో అభ్యర్థి తన వెంట నలుగురిని మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.ర్యాలీగా వస్తే కూడా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి కనీసం వంద మీటర్ల దూరంలోనే నిలిపివేయాల్సివుంటుంది.

Updated Date - Apr 18 , 2024 | 12:54 AM