Share News

తప్పుల్లేని తుది ఓటరు జాబితా సిద్ధం చేయండి

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:21 AM

మృతుల పేర్లు తొలగించాలని, అధికార పార్టీ నమోదు చేసిన వేలాది దొంగఓట్లు రద్దుచేయాలని కోరుతూ గతంలో ఫిర్యాదులు ఇచ్చాం. వాటిని ముసాయిదా ఓటరు జాబితాలో తొలగించలేదు. కనీసం ఈనెల 22న విడుదల చేసే తుది ఓటరు జాబితాలోనైనా వాటన్నింటిని తొలగించండి. జాబితా తప్పుల్లేకుండా చూడాలి’ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వి.సురేంద్రకుమార్‌ అభ్యర్థించారు.

తప్పుల్లేని తుది ఓటరు జాబితా సిద్ధం చేయండి

అధికారులకు టీడీపీ నేతల అభ్యర్థన

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 17: ‘మృతుల పేర్లు తొలగించాలని, అధికార పార్టీ నమోదు చేసిన వేలాది దొంగఓట్లు రద్దుచేయాలని కోరుతూ గతంలో ఫిర్యాదులు ఇచ్చాం. వాటిని ముసాయిదా ఓటరు జాబితాలో తొలగించలేదు. కనీసం ఈనెల 22న విడుదల చేసే తుది ఓటరు జాబితాలోనైనా వాటన్నింటిని తొలగించండి. జాబితా తప్పుల్లేకుండా చూడాలి’ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వి.సురేంద్రకుమార్‌ అభ్యర్థించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో రాజకీయపార్టీల ప్రతినిధులతో డీఆర్వో రాజశేఖర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సురేంద్రకుమార్‌ మాట్లాడుతూ.. గతంలో పార్టీ తరపున ఇచ్చిన ఫిర్యాదులను అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డీఆర్వో మాట్లాడుతూ 1400 మందికి మించి ఓటర్లు ఉన్న చోట కొత్త పోలింగ్‌ కేంద్ర ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. డిసెంబరు 9వ తేదీ వరకు అందిన క్లెయిమ్‌ల విచారణ పూర్తిస్థాయిలో జరిగిందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేరోజు వరకు ఓటర్ల నమోదుకోసం దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందన్నారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కళాశాలలు, ఇతర ప్రాధాన్యత గల ప్రదేశాల వద్ద ఓటర్ల కోసం ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు భాస్కర్‌, పరదేశి (కాంగ్రెస్‌), ఉదయ్‌కుమార్‌ (వైసీపీ), ఇతర పార్టీల ప్రతినిధులు కూడా హజరయ్యారు.

Updated Date - Jan 18 , 2024 | 12:21 AM