Share News

పోస్టింగ్‌ ప్లీజ్‌!

ABN , Publish Date - Jun 11 , 2024 | 01:51 AM

ప్రభుత్వాలు మారగానే పోలీసు బాసుల తీరు కూడా మారిపోతుంటుంది. కొత్త కొలువుల కోసం గెలిచిన నేతల ను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయిపోతారు. కొత్త ప్రభుత్వం ఇంకా ప్రమాణస్వీకారం అయినా చేయకముందే తిరుపతి జిల్లాలో పోస్టింగుల కోసం పైరవీలు మొదలయ్యాయి.

పోస్టింగ్‌ ప్లీజ్‌!

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 10: ప్రభుత్వాలు మారగానే పోలీసు బాసుల తీరు కూడా మారిపోతుంటుంది. కొత్త కొలువుల కోసం గెలిచిన నేతల ను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయిపోతారు. కొత్త ప్రభుత్వం ఇంకా ప్రమాణస్వీకారం అయినా చేయకముందే తిరుపతి జిల్లాలో పోస్టింగుల కోసం పైరవీలు మొదలయ్యాయి. గత ఐదేళ్ళుగా వైసీపీ నాయకులతో బాగా అంటకాగినవారు ఆందోళనలో ఉండగా, గుర్తించదగిన పోస్టులు దక్కకుండా ఉండిపోయినవారు ఊపిరి పీల్చుకుని తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో మూడేళ్ళకు పైబడి పనిచేసిన వారినీ, అవినీతి ఆరోపణలున్నవారినీ, వైసీపీకి దగ్గరున్నారనే ఆరోపణలున్నవారినీ ఎన్నికలకు ముందు వీఆర్‌కు పంపారు. మరికొందరు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐదేళ్ళుగా పీటీసీలోనూ, వీఆర్‌లోనూ కొనసాగుతున్నారు. వీరంతా ఇప్పుడు కోరుకున్న స్థానాల్లో కొలువుదీరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. విద్య, వైద్య కేంద్రంగా ఉన్న తిరుపతి, చుట్టుపక్కల స్థానాల మీదే అందరి దృష్టీ ఉంది. ఒక మాజీ మంత్రినీ, ఒక సీనియర్‌ టీడీపీ నాయకుడినీ ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికైన ఎమ్యెల్యేలను కలసి ప్రతిపాదనలు ఇస్తున్నారు. కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పనిచేస్తున్న ఐదారుగురు సీఐలు ఈ ప్రయత్నాల్లో చురుగ్గా ఉన్నారంటున్నారు. పనిలో పనిగా తిరుపతిలో పనిచేసి ఇటీవల ఎన్నికల కమిషన్‌ వేటుకు గురైన ఇద్దరు పోలీసు అధికారులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా ఉన్నారని సమాచారం.

తిరుపతి కుర్చీకి పోటీ ఎక్కువ

తిరుపతి నగర డీఎస్పీ స్థానం మీద చాలా మందే ఆశ పెట్టుకున్నారని చెబుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీ అయిన ఇద్దరు అధికారులు గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. వీరు ప్రస్తుతం కృష్ణా, అనంతపురం జిల్లాల్లో పనిచేస్తున్నారు. వీరిద్దరికీ అధికార పార్టీలోని ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా వున్నట్లు సమాచారం. ఇక తిరుపతి ఈస్ట్‌, అలిపిరి, శ్రీకాళహస్తి, నాయుడుపేట, సత్యవేడు, నగరి, చంద్రగిరి స్టేషన్లకు సీఐలుగా రావడం కోసం దాదాపు డజనుమంది పోటీ పడుతున్నారు. ప్రస్తుతం గుడివాడలో డీఎస్పీగా వున్న ఒక అధికారి గతంలో చిత్తూరులో పనిచేసిన అనుభవంతో ఇక్కడికి రావాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. అలాగే పదేళ్ళ క్రితం అలిపిరి, తిరుపతి ట్రాఫిక్‌లో పనిచేసి ప్రస్తుతం డీసీఆర్‌బీలో వున్న అధికారి ఒకరు అలిపిరికి కానీ వీలుంటే తూర్పు సీఐగా కానీ రావడానికి మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. అలాగే తిరుపతి జిల్లా నుంచి 13 మంది పోలీసు అధికారులు పొరుగు జిల్లాలకు వెళ్ళడానికి ఇంకోవైపు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 01:51 AM