Share News

సీఎం కార్యక్రమాల్లో జనం ఆపసోపాలు

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:37 AM

సీఎం జగన్‌ వచ్చారు వెళ్లారు. హంద్రీ-నీవా జలాలు విడుదల చేశారు. అవెంతకాలం కాలువలో ఉంటాయో తెలియదు కానీ జనం మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం నాటి ఆయన పర్యటనకు ఆదివారం నుంచే జనం కష్టాలు ప్రారంభమయ్యాయి.

 సీఎం కార్యక్రమాల్లో జనం ఆపసోపాలు
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం

ఫ ట్రాఫిక్‌ జామ్‌తో ఇబ్బందులు

ఫ లాఠీఛార్జీలు, సభనుంచి వెళ్లకుండా అడ్డగింతలు

కుప్పం/శాంతిపురం/రామకుప్పం, ఫిబ్రవరి 26: సీఎం జగన్‌ వచ్చారు వెళ్లారు. హంద్రీ-నీవా జలాలు విడుదల చేశారు. అవెంతకాలం కాలువలో ఉంటాయో తెలియదు కానీ జనం మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం నాటి ఆయన పర్యటనకు ఆదివారం నుంచే జనం కష్టాలు ప్రారంభమయ్యాయి. కుప్పం ఆర్టీసీ డిపోలోని బస్సులన్నింటినీ జనం తరలింపుకోసం పలు గ్రామాలకు పంపేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సోమవారం ఉదయం నుంచి సభ జరిగే శాంతిపురం వద్ద ట్రాఫిక్‌ మళ్లించారు. బడగుమాకుల పల్లె, విజలాపురం, రామకుప్పం మీదుగా వి.కోట వైపు ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ మధ్యలో జాతీయ రహదారి పొడవునా బారికేడ్లు పెట్టి స్థానికులను ఇబ్బందులకు గురిచేశారు. ఉదయం 8 గంటలనుంచే వివిధ ప్రాంతాలనుంచి ఆర్టీసీ బస్సులు, స్కూల్‌ బస్సుల ద్వారా జనాల తరలింపు ప్రారంభమైంది. సుమారు 3 వేల బస్సులు కేటాయించగా, సగానికి పైగా ఖాళీగా దర్శనమిచ్చాయి.

జనం దిగ్బంధం

ఎమ్మెల్సీ భరత్‌ ప్రసంగం మొదలు పెట్టగానే సభ నుంచి వెనుదిరగడం మొదలుపెట్టారు. సీఎం జగన్‌ ప్రసంగం మొదలు పెట్టినప్పుడు కాసేపు ఆలకించడానికి ప్రయత్నించారు. కానీ, అన్నీ నేనే చేశాను, మీ కుప్పాన్ని నేనే అభివృద్ధి చేశాను అంటూ స్వోత్కర్ష ఎక్కువ కావడం.. రాష్ట్రమంతా కామన్‌గా ఇస్తున్న సంక్షేమ పథకాలను కుప్పానికే ప్రత్యేకంగా ఇస్తున్నట్లు వాటి విలువను కోట్లలో లెక్కకట్టి చెప్పడంపైనా జనం నిరాసక్తంగా ఉన్నారు. దీంతో ఒక్కరొక్కరే లేచి బయటకు నడిచారు. ‘యాడికి పతా వుండావు అప్పుడే?’ అని ఒక మహిళ అంటే, ‘అయ్యో, రావే పోదాం, ఇక్కడేముండాది, నామొగం’ అని పక్కనున్న మహిళను సభా ప్రాంగణంనుంచి మరో మహిళ ఈడ్చుకుపోవడం కనిపించింది. ఇలా వెళ్తున్న వారి సంఖ్య క్రమేణా పెరగడంతో పోలీసులు రోడ్డుమీద బారికేడ్లు అడ్డుపెట్టి నిలువరించడానికి ప్రయత్నించారు. కాసేపు చూసిన జనం, ఆ తర్వాత వారిని తోసుకుని మరీ బయటకు వెళ్లారు.

లాఠీ ఝుళిపించిన పోలీసులు

సీఎం ప్రసంగం అరగంటలో ముగుస్తుందనగా కుప్పం-పలమనేరు రహదారిలో పోలీసులు బారికేడ్లు పెట్టి రాకపోకల్ని ఆడ్డుకున్నారు. ఎండ తీవ్రంగా ఉండటంతో కాసేపు చూసిన జనం ఓపిక నశించింది. ఒక్కసారిగా బారికేడ్లను తోసుకుంటూ ముందుకు రాగా, పోలీసులు అడ్డుకునే క్రమంలో కొందరు కిందపడ్డారు. పోలీసులు లాఠీలను ఝుళిపిస్తూ మిగిలిన వారిని అడ్డుకున్నారు. సీఎం జగన్‌ హెలిప్యాడ్‌కు వెళ్లాక.. కాన్వాయ్‌ వాహనాలు వెళ్లడంతో జనాన్ని వదిలారు. అనంతరం ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణను పట్టించుకోకపోవడంతో జనంతో పాటు ద్విచక్ర వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు.

ఈ భూమిని ఏమి చేస్తారో?

సీఎం సభా స్థలం ఏకంగా ఏడెనిమిది ఎకరాలుంటుంది. ఇందులో బసవేశ్వరస్వామి దేవస్థానం, డీకేటీ భూములు కూడా కలిసి ఉన్నాయి. ‘సీఎం సభ పేరు చెప్పి చదును చేశారు. ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారు. ఈ అధికార పార్టీవోళ్లు ఆకిరికి ఈ భూములను ఏమి చేయబోతారో’ అని జనం వారిలోవారు చర్చించుకున్నారు. ఇంతకుముందునుంచే ఈ భూములపై వివాదం నడుస్తుండడం, అందులో కొందరు అధికార పార్టీ హస్తముండడం దీనికి కారణం. కాగా, విద్యుత్తు కోతలతో తాము అల్లాడుతుంటే, ఒక గంట సీఎం సభకోసం లక్షలు ఖర్చు చేసి తాత్కాలికంగా ట్రాన్స్‌ఫార్మరు ఏర్పాటు చేయడమేమిటని జనం మాట్లాడుకున్నారు.

సీఎం సారు వొంగలేరని..

సంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమమైనా కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూజ చేసి ప్రారంభించడం ఆనవాయితీ. నేలమీద వొంగొని కొబ్బరికాయ ఒడతారు. కానీ హంద్రీ-నీవా కాలువ వద్ద కొబ్బరికాయ కొట్టేందుకు ప్రత్యేకంగా ఒక దిమ్మెను ఏర్పాటు చేశారు. సీఎం సార్‌ వొంగలేరని ఈ ఏర్పాటు చేసినట్టుందని జనం చమత్కరించారు.

బారులు తీరిన మందుబాబులు

సీఎం ప్రారంభించిన కాలువలో నీళ్లు ఉన్నాయో లేవో కానీ, ఆ ప్రాంతంలో మాత్రం మద్యం ఏరులై పారింది. ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ఉన్న రాజుపేట రోడ్డులోని నాలుగైదు మద్యం దుకాణాలు మందుబాబులతో కిటకిటలాడాయి. ఒకవైపు సీఎం సభ జరుగుతుండగా, మరోవైపు వీరిపని వీరు చేస్తూ పోయారు.

హంద్రీ నీవా జలాల విడుదల

కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా నీటిని సోమవారం ఉదయం రాజుపేట వద్ద సీఎం జగన్‌ లాంఛనంగా విడుదల చేశారు. కాలువ గట్టుపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, అంబటిరాంబాబు, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌, ఎమ్మెల్యే వెంకటేగౌడ, కలెక్టరు షన్మోహన్‌ తదితరులతో కలిసి ప్రారంభోత్సవ శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పసుపు, కుంకుమ, పుష్పాలు సమర్పించి జలహారతి ఇచ్చారు. బటన్‌ నొక్కి జలాలను విడుదల చేశారు. అక్కడ్నుంచి హెలికాప్టరులో సమీపంలోని సభాస్థలికి వెళ్లారు. ఇక, హంద్రీ-నీవా కాలువ వద్దకు తరలించిన జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో సుమారు గంటన్నర సేపు ఎండలో ఇబ్బంది పడ్డారు.

Updated Date - Feb 27 , 2024 | 12:37 AM