Share News

వైసీపీ విషప్రచారాలతో కొనసాగిన పింఛను కష్టాలు

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:57 AM

మండే ఎండలు ఒకవైపు.. సచివాలయాలకు వెళ్లకపోతే పింఛను రాదేమోనన్న వైసీపీ విష ప్రచారాలతో భయం మరోవైపు...వెరసి కళ్లు సరిగా కనిపించకపోయినా, నడవడానికి కాళ్లు సహకరించకపోయినా వృద్ధులు సచివాలయాల వద్ద రెండవ రోజైన గురువారం కూడా పడిగాపులు కాశారు.

వైసీపీ విషప్రచారాలతో కొనసాగిన పింఛను కష్టాలు
రేణిగుంటలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలికి ఆటోలోనే పింఛను అందజేసేందుకు వలంటీరు యత్నం

ఫ సచివాలయాల వద్ద పండుటాకుల పడిగాపులు

తిరుపతి (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 4:మండే ఎండలు ఒకవైపు.. సచివాలయాలకు వెళ్లకపోతే పింఛను రాదేమోనన్న వైసీపీ విష ప్రచారాలతో భయం మరోవైపు...వెరసి కళ్లు సరిగా కనిపించకపోయినా, నడవడానికి కాళ్లు సహకరించకపోయినా వృద్ధులు సచివాలయాల వద్ద రెండవ రోజైన గురువారం కూడా పడిగాపులు కాశారు.పింఛన్లకు వలంటీర్లను దూరం చేస్తూ ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ కుటిలయత్నం చేస్తోంది. టీడీపీ వల్లనే ఈ కష్టాలంటూ నమ్మించేందుకు పండుటాకులను ఇబ్బంది పెడుతోంది. ‘పింఛను కోసం ఇప్పుడే వచ్చేయండి. శుక్రవారమే ఆఖరు. ఆ తర్వాత ఇవ్వరు. ఇప్పుడొచ్చి తీసుకోకుంటే ఈ నెల పింఛను పోయినట్లే’ అంటూ పెన్షన్‌దారుల జాబితా పక్కనపెట్టుకుని కొందరు వలంటీర్లు, నేతల ద్వారా ఫోన్లు చేయిస్తున్నారు. దీంతో ఎక్కడ తమకు పింఛను రాకుండా పోతుందోనన్న ఆందోళనతో గురువారం ఉదయాన్నే అందరూ ఒక్కసారిగా సచివాలయాలకు చేరుకున్నారు. దివ్యాంగులకు, అనారోగ్యంతో మంచంపట్టినవారికి, వీల్‌చైర్‌లో ఉన్నవారికి ఇళ్ల వద్దకే వచ్చి పింఛను అందజేయాలని ఆదేశాలున్నా అటు పంచాయతీ, ఇటు సచివాలయ ఉద్యోగులు రాకపోవడంతో మండుటెండలో లబ్ధిదారులు సచివాలయాల వద్దకు కుటుంబీకుల సాయంతో వచ్చి నిరీక్షించారు.అయితే ఉదయం11గంటల తరువాతే పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పింఛనుదారులకు సరిపోయే సొమ్ము లేకపోవడంతో సచివాలయ సిబ్బంది కూడా బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది.గురువారం 2,38,000 మందికి పింఛన్లు అందజేసినట్లు డీఆర్డీఏ అధికారులు వెల్లడించారు.

Updated Date - Apr 05 , 2024 | 01:57 AM