Share News

రైతుల కడుపు కొట్టిన పెద్దిరెడ్డి

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:45 AM

పుంగనూరు నియోజకవర్గంలో పాడి, మామిడి రైతులపై దౌర్జన్యాలు, ఆరాచకాలు చేసి వారి కడుపు కొట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలని మాజీ సీఎం, రాజంపేట లోకసభ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

రైతుల కడుపు కొట్టిన పెద్దిరెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

ఫ ఆయన్ను ఇంటికి పంపే రోజు దగ్గర్లో ఉంది

ఫ పుంగనూరులో ప్రశాంత పోలింగ్‌కు కేంద్ర బలగాలు రపిస్తా

ఫ కూటమి ఎన్నికల సభలో మాజీ సీఎం నల్లారి కిరణ్‌

పుంగనూరు, ఏప్రిల్‌ 4: పుంగనూరు నియోజకవర్గంలో పాడి, మామిడి రైతులపై దౌర్జన్యాలు, ఆరాచకాలు చేసి వారి కడుపు కొట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలని మాజీ సీఎం, రాజంపేట లోకసభ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. పుంగనూరులో గురువారం జరిగిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అన్ని డెయిరీల కంటే తక్కువ ధరకు పాలు కొంటున్నారని వివరించారు. ప్రస్తుతం ఎన్నికల కోసం కొంచెం ధరలు పెంచి.. మళ్లీ తగ్గిస్తారన్నారు. మామిడి రైతుకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కిలో రూ.17గా నిర్ణయిస్తే.. పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం రూ.7, 8 చొప్పున ఇస్తోందన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మూడు వేల లీటర్లు పాలు వస్తే ప్రతి చోట త్వరలోనే చంద్రబాబుతో మాట్లాడి బీఎంసీయూలు పెట్టిస్తామన్నారు. పుంగనూరులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కేంద్ర బలగాలు ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. పార్లమెంటులో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ బిల్లులకు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మద్దతుఇచ్చి.. ఇక్కడ బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని కరపత్రాలు పంచడం సిగ్గుచేటన్నారు. పెద్దిరెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలను నిలువరించడానికి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పెద్దిరెడ్డి, రాజంపేట ఎంపీగా బరిలో ఉన్న ఆయన కుమారుడు మిథున్‌ను ఓడించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ వనరులను కాజేసిన పెద్దిరెడ్డి కుటుంబం.. మరోసారి గెలిస్తే ప్రజల పట్టా భూములు కూడా లాక్కుంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మైనార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు చూసుకుంటారని.. ఈ విషయంలో తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. మాఫియా డాన్‌ పెద్దిరెడ్డి పతనం ప్రారంభమైందని, తమకు అండగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉండటంతో పెద్దిరెడ్డి ఆటలు ఇక సాగవని పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సభలో టీడీపీ నాయకులు ఎం.వెంకటరమణరాజు, రామనాధనాయుడు, ఎం.సూర్యప్రకాశ్‌, ఎం.శ్రీకాంత్‌, సుహేల్‌బాషా, సుబ్రహ్మణ్యంరాజు, దినేశ్‌, మాధవరెడ్డి, కుమార్‌, శమిపతి, రమేశ్‌రెడ్డి, ఉయ్యాల రమణ, వెంకటముని యాదవ్‌, ముల్లంగి వెంకటరమణ, బీజేపీ నాయకులు సాయి లోకేశ్‌, ఎన్‌.రమేశ్‌, అయూబ్‌ఖాన్‌, మదన్‌మోహన్‌, జనసేన నేతలు శివప్పనాయుడు, పగడాల రమణ, విరూపాక్షి, తదితరులు పాల్గొన్నారు. గురువారం రాత్రి పుంగనూరు కొత్తయిండ్లులో రాజంపేట ఎంపీ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తొలిసారిగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

కూటమి సభ పక్కనే వైసీపీ ప్రచార రథం హోరు

పుంగనూరులో జరిగిన కూటమి బహిరంగ సభ పక్కనే వైసీపీ ఎన్నికల ప్రచార రథం పాటలతో హోరెత్తించింది. తమ సభ జరుగుతుండగా రెచ్చగొట్టే ధోరణిలో వైసీపీ ప్రచార రథం తిరగడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మళ్లీ ప్రచార రథం అటువైపు రాకుండా చర్యలు తీసుకున్నారు. మాజీ సీఎం సభ జరుగుతుండగా రోడ్డుపై ముగ్గురు పోలీసులను పెట్టడం తప్ప, ఎస్‌ఐలు, సీఐలు కనిపించకపోవడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు కూటమి నాయకులు తెలిపారు.

Updated Date - Apr 05 , 2024 | 01:45 AM