Share News

అభ్యర్థితోపాటు ఐదుగురికి మాత్రమే అనుమతి

ABN , Publish Date - Apr 17 , 2024 | 01:27 AM

చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమవుతుందని రిటర్నింగ్‌ అధికారి, జేసీ శ్రీనివాసులు తెలిపారు.

అభ్యర్థితోపాటు ఐదుగురికి మాత్రమే అనుమతి
రాజకీయపార్టీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న జేసీ శ్రీనివాసులు

- నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయొచ్చు: జేసీ

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 16: చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమవుతుందని రిటర్నింగ్‌ అధికారి, జేసీ శ్రీనివాసులు తెలిపారు. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో అభ్యర్థితోపాటు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లోని జేసీ మీటింగ్‌ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. అంతకుముందు రాజకీయ పార్టీల స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ రెండు సమావేశాల్లో జేసీ మాట్లాడుతూ.. అనుమతి పొందిన మేర నాలుగు సెట్ల నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థి వేరే నియోజకవర్గం వ్యక్తి అయితే అందుకు సంబంధించిన ఓటరు జాబితా కాపీ జతచేయాలని అన్నారు. పోలింగ్‌ ఏజెంట్లుగా ఎటువంటి నేరచరిత్ర లేనివారిని నియమించుకోవాలని ఆదేశించారు. నామినేషన్‌ దాఖలు సమయంలో నోడ్యూ సర్టిఫికెట్‌, బ్యాంకు ఖాతాపుస్తకం, 10 తాజా పాస్‌పోర్టు సైజు ఫొటోలు, సెక్యూరిటీ డిపాజిట్‌ నేరుగా అందజేయాలన్నారు. అభ్యర్థి నామినేషన్‌ రుసుం నుంచి మినహాయింపు కోసం తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం అందివ్వాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో పుల్లయ్య, రాజసింహులు, గురజాల జగన్మోహన్‌, సురేంద్రకుమార్‌ (టీడీపీ), ఉదయ్‌కుమార్‌ (వైసీపీ), గంగరాజు (సీపీఎం), లోకనాథం (బీఎస్పీ), ఏఆర్వో అరుణ, చిత్తూరు, గుడిపాల మండల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 01:27 AM