Share News

పీఏసీఎస్‌ల్లో ఆన్‌లైన్‌ సేవలు

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:57 AM

వడివడిగా సింగిల్‌విండోల కంప్యూటరీకరణ వారంరోజులుగా డీసీసీబీలోనే సిబ్బంది మకాం

 పీఏసీఎస్‌ల్లో ఆన్‌లైన్‌ సేవలు
డీసీసీబీలో కంప్యూటరీకరణ ప్రక్రియలో పాల్గొంటోన్న అధికారులు, సిబ్బంది

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఆన్‌లైన్‌ సేవలు ఈ వారంలోనే అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకుల మాదిరిగా సహకార సంఘాలను డిజిటలైజేషన్‌ చేసి అక్రమాలకు చెక్‌ పెట్టాలన్న లక్ష్యంతో వీటిలో సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.ఈ నేపథ్యంలో జిల్లాలోని సింగిల్‌ విండోల్లో కంప్యూటరీకరణ ప్రక్రియ జోరుగా నడుస్తోంది.అయితే ఈ ప్రక్రియ పూర్తయితే తమ అక్రమాలు బయటపడతాయని కొంతమంది సీఈవోలు ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌ ప్రక్రియను ఆలస్యం చేసినప్పటికీ ఈ నెల 20వ తేదీ నుంచి జోరందుకుంది.

చిత్తూరు జిల్లాలో 37 సింగిల్‌ విండో(ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం-పీఏసీఎస్‌)లున్నాయి. 1,50,205మంది రైతులు సభ్యులుగా వున్నారు. వీటిలో లావాదేవీలన్నీ రికార్డుల్లో చేతిరాతలతోనే నమోదు చేస్తుండడంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.పలు సింగిల్‌ విండోల్లో సీఈవోలే లక్షలాది రూపాయలు పక్కదారి పట్టించిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీంతో సంఘాలు ఏర్పడినప్పటినుంచీ ఈ ఏడాది మార్చి 31వరకు జరిగిన లావాదేవీలన్నింటినీ డేటాకేప్చర్‌ టూల్‌ (డీసీటీ) సాఫ్ట్‌వేర్‌తో ఆన్‌లైన్‌ చేసి అక్టోబరు 2 నుంచి సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్కారు చెప్పిన గడువుకు సింగిల్‌ విండోల్లో సగం సభ్యుల వివరాలను సైతం ఆన్‌లైన్‌ చేయలేకపోయారు. గతంలో సహకార ఎన్నికలకోసం రూ.10 వాటాధనం కట్టించి వేలాదిమందిని ఓటర్లుగా చేర్పించేశారు. సాంకేతికంగా వారంతా సభ్యులే. అయినా వారిలో చాలామంది ఆచూకీ దొరకడంలేదు. వారి ఆధార్‌ నెంబర్లుంటే గానీ ఆన్‌లైన్‌ చేయడం కుదరదు. సింగిల్‌ విండోల ద్వారా ఇచ్చిన రుణాలు, వసూళ్ళకు సంబంధించి రికార్డుల్లో వున్న సమాచారానికి, ఆడిట్‌ నివేదికల్లో చూపిన లెక్కలకు వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్క శాతానికి మించి తేడా ఉంటే, వాటిని ఆన్‌లైన్‌ చేయడానికి వీలుండదు. జిల్లాలో 5 నుంచి 10 శాతం వ్యత్యాసం ఉన్న సంఘాలే ఎక్కువగా ఉన్నాయి. కంప్యూటరీకరణ పూర్తయితే తమ అక్రమాలు బయటపడతాయని కొంతమంది సీఈవోలు ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

చివరిస్థానం నుంచి మూడవ స్థానానికి

కంప్యూటరైజేషన్‌ త్వరితగతిన చేయాలని సహకారశాఖ రిజిస్ట్రార్‌ ఆరునెలల క్రితం ఆదేశించినా, ముక్తసరిగా చేస్తుండడంతో చిట్టచివరి స్థానానికి చిత్తూరు చేరుకుంది. దీంతో వారం క్రితం ఆయన అధికారులకు అక్షింతలు వేస్తూ ‘సీఎం జిల్లా 12వ స్థానంలో ఉండడమేమిటి? జిల్లా అధికారులు పనిచేస్తున్నారా? నిద్రమత్తులో ఉన్నారా? బాధ్యత విస్మరించిన వారిపై కఠిన చర్యలుంటాయంటూ’’ చీవాట్లు వేశారు. దాంతో డీసీసీబీ ఇన్‌చార్జి ఆఫీసర్‌, జేసీ విద్యాధరి ఈనెల 20వ తేది నుంచి ప్రత్యేక చొరవ తీసుకుని రోజుకు రెండు లేదా మూడుసార్లు డీసీసీబీకి వెళ్ళడం, గంటల తరబడి ఉంటూ ప్రక్రియను పరిశీలించడం చేస్తున్నారు. రోజూ వీడియో, టెలీ, సెట్‌ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ మరోవైపు రోజువారి ప్రోగ్రెస్‌ ఎంత జరుగుతున్నదో తెలుసుకుంటూ అధికారులకు రోజువారీ లక్ష్యాలు పెడుతున్నారు. దీంతో విండోల కంప్యూటరీకరణ ప్రక్రియ తాజాగా మూడో స్థానానికి చేరుకుంది. కంప్యూటరీకరణ కోసం కావాల్సిన సిబ్బందికి అదనంగా సచివాలయ సిబ్బందిని జేసీ కేటాయించారు. అక్కడే అన్ని విండోల నుంచి లెడ్జర్లు, రుణాలు, మెంబర్‌షిప్‌ (షేర్‌ క్యాపిటల్‌) పుస్తకాలు, అప్పుల పుస్తకాలు తెప్పించి కంప్యూటరీకరిస్తున్నారు. దీంతో డీసీవో, డీసీఏవో, డీఎల్‌సీవో, సహకారశాఖ అధికారులు, విండో సిబ్బంది అందరూ రాత్రింబవళ్ళు డీసీసీబీలోనే ఉంటూ ఆన్‌లైన్‌ ప్రక్రియను కొలిక్కి తెస్తున్నారు. బుధవారం నాటికి 25సింగిల్‌ విండోల్లో కంప్యూటరీకరణ పూర్తయింది. మిగిలిన 12సింగిల్‌విండోల్లో కూడా 50శాతం ప్రక్రియ పూర్తి కావొచ్చింది. ఈ నెలాఖరులోగా కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి.

తుది దశలో ఆన్‌లైన్‌ ప్రక్రియ

సింగిల్‌ విండోల ఆన్‌లైన్‌ ప్రక్రియ తుదిదశలో ఉంది. కొన్ని సంఘాల్లో సభ్యుల వివరాలు లభించడం లేదు. ఊళ్ళలో దండోరా వేయుంచి సమాచారం ఇస్తున్నాం. మండలస్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోల సహకారం తీసుకుంటున్నాం. అందుబాటులో లేనివారి ఖాతాలను తరువాత ఆన్‌లైన్‌ చేయిస్తాం. ఇంటర్నెట్‌ సమస్యతో కొంత జాప్యం జరుగుతోంది.ఈ నెలాఖరులోగా వందశాతం కంప్యూటరీకరణ పూర్తిచేస్తాం.

- విద్యాధరి, జాయింట్‌ కలెక్టర్‌

Updated Date - Nov 28 , 2024 | 12:57 AM