Share News

ఇప్పుడు గాంధీ వంతు..!

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:46 AM

వైసీపీ నుంచి మరో దళిత నాయకుడు బయటకు వచ్చారు. ఆ పార్టీలో దళితులకు గౌరవం లేదని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ నిరసన స్వరం వినిపించారు.

ఇప్పుడు గాంధీ వంతు..!
రాజీనామా పత్రాన్ని మీడియాకు చూపుతున్న గాంధీ

చిత్తూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నుంచి మరో దళిత నాయకుడు బయటకు వచ్చారు. ఆ పార్టీలో దళితులకు గౌరవం లేదని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ నిరసన స్వరం వినిపించారు. వేపంజేరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు ఆర్‌.గాంధీ ఆ పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. మంగళవారం జీడీనెల్లూరులో జరగనున్న రా కదలిరా సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ వైసీపీలో దళిత నేతలు ఉక్కపోతకు గురవుతున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికే సర్వేల పేరిట ఉమ్మడి జిల్లాలో పూతలపట్టు, సత్యవేడు ఎమ్మెల్యేలు ఎంఎ్‌సబాబు, ఆదిమూలంకు సీటు నిరాకరించారు. చిత్తూరు, తిరుపతి ఎంపీ సీట్ల సహా జీడీనెల్లూరు ఎమ్మెల్యే స్థానానికి కూడా అభ్యర్థులను మార్చి మళ్లీ పాతవారినే ఉంచారు. ఇలా దళిత ప్రజాప్రతినిధులనే అటు ఇటు కదపడం, ఇన్‌చార్జులను మార్చడంపై ఆ వర్గంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై తొలుత ఎంఎస్‌ బాబు తన అసమ్మతిని వ్యక్తపరచి.. ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం తనకు జరిగిన అన్యాయం పట్ల సీఎం జగన్‌ను, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆర్‌.గాంధీ వంతు వచ్చింది. ఈయన సోమవారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి పార్టీలో తనకు, దళితులకు జరుగుతున్న అవమానాల గురించి వివరించారు. 12 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకు జగన్‌ ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. దళితులను హీనంగా చూస్తున్నారన్నారు. పెద్దిరెడ్డి ముందు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప కూర్చునే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు.

ఎస్సీ, తమిళ ఓట్లపై ప్రభావం

1994లో వేపంజేరి నుంచి టీడీపీ అభ్యర్థిగా గాంధీ పోటీ చేసి 20 వేల ఓట్ల మెజార్టీతో కుతూహలమ్మ మీద గెలిచారు. 2004లో ఆయన భార్య డాక్టర్‌ చంద్రమ్మ, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో జీడీనెల్లూరు నుంచి గాంధీ పోటీ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీడీనెల్లూరు, పెనుమూరు, పూతలపట్టు, గుడిపాల, చిత్తూరు రూరల్‌ మండలాలు ఉండేవి. ఇప్పటికీ ఆయన ఆయా మండలాల్లో ప్రభావితం చేయగలరు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆయన, తమిళియన్‌ కావడంతో చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఎక్కువగా ఉన్న ఆ ఓట్లను కూడా ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. కాగా, చిత్తూరు లోక్‌సభ స్థానంలో టీడీపీ తరపున ఆశావహుల్లో ఆర్‌ గాంధీ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ స్థానానికి పోటీ పెరిగింది.

Updated Date - Feb 06 , 2024 | 12:46 AM