Share News

ఎన్నికల విధుల వాహనాలకు డబ్బులు ఇవ్వలేదు

ABN , Publish Date - May 31 , 2024 | 01:26 AM

ఎన్నికల సమయంలో పుంగనూరులో 35 వాహనాలను 20 రోజుల పాటు వినియోగించుకున్నారు. డీజిల్‌, డ్రైవర్లకు భోజన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆ వాహనాల డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల విధుల వాహనాలకు డబ్బులు ఇవ్వలేదు
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వాహన డ్రైవర్లు

డ్రైవర్ల నిరసన

పుంగనూరు, మే 30: ఎన్నికల సమయంలో పుంగనూరులో 35 వాహనాలను 20 రోజుల పాటు వినియోగించుకున్నారు. డీజిల్‌, డ్రైవర్లకు భోజన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆ వాహనాల డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించాలంటూ గురువారం వీరు పుంగనూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వాహనాలను అద్దెకు తీసుకువచ్చి ఎన్నికల పోలింగ్‌ జరిగే వరకు వినియోగించుకున్నారని చెప్పారు. వాహనాలకు డీజిల్‌, భోజన వసతి కల్పించాలని ఆర్వోను కోరగా పోలింగ్‌ రోజున పూర్తి స్థాయిలో చెల్లింపులు జరుగుతాయని చెప్పి.. ఇప్పుడేమో ఇవ్వలేమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలు పూర్తయినా డబ్బులు ఇవ్వకపోవడంతో వాహనాల యజమానులు, డ్రైవర్లుగా తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వాహనదారులకు డీజిల్‌, భోజనం, బత్తా బిల్లు ఇచ్చారని, పుంగనూరు ఆర్వో మధుసూధన్‌రెడ్డి మాత్రం తనకు సంబంధం లేదని, రవాణాశాఖ ఇస్తుందని చెబుతున్నారని వారు పేర్కొన్నారు. తమకు రావాల్సిన డబ్బు అడిగితే అధికారులు సమాధానం ఇవ్వకపోవడంతో ఆందోళన చేయాల్సివచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు శ్రీనివాసులు, వంశీ, బాబు, రాజేంద్ర, అనిల్‌కుమార్‌, సాయికుమార్‌, సలీం, ప్రశాంత్‌, నబీ తదితరులు పాల్గొన్నారు.

వాహన బకాయిలతో మాకు సంబంధంలేదు: మధుసూదన్‌రెడ్డి, పుంగనూరు ఆర్వో

కలెక్టర్‌ షన్మోహన్‌ ఆదేశాల మేరకు పుంగనూరు ఎన్నికలకు జిల్లా రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ వాహనాలు పంపారు. అన్ని నియోజకవర్గాలకు ఇదే తరహాలో వాహనాలు సమకూర్చారు. వాహనాల గురించి తమకు ఏమాత్రం సంబంధంలేదు. బుధవారం కూడా కలెక్టర్‌ సమావేశంలో ఈవిషయం చర్చకు వచ్చింది. త్వరలోనే వాహనాలకు బడ్జెట్‌ కేటాయించి డీటీసీ ద్వారా అందజేస్తారు.

Updated Date - May 31 , 2024 | 01:26 AM