Share News

తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నీహారిక?

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:23 AM

తిరుపతి లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా రిటైర్డు ఐఏఎస్‌ అధికారి రత్నప్రభ కుమార్తె అంగలకుర్తి నీహారిక పేరు ఖరారైనట్టు తెలుస్తోంది.

తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నీహారిక?

తిరుపతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా రిటైర్డు ఐఏఎస్‌ అధికారి రత్నప్రభ కుమార్తె అంగలకుర్తి నీహారిక పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈమె సత్యవేడు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ తలారి మనోహర్‌ చిన్న కోడలు కూడా. నిజానికి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరునే పరిశీలించారని, అయితే ఆమె ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని, తన భర్తకు అసెంబ్లీ టికెట్‌ కోరుతున్నారని సమాచారం. దీంతో ప్రత్యామ్నాయం గా పలు పేర్లను పరిశీలించారు. ఈ క్రమంలోనే గత తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసిన రిటైర్డు ఐఏఎస్‌ అధికారి రత్నప్రభ కుమార్తె నీహారిక పేరు టీడీపీ అధిష్ఠానం దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె టీడీపీ తొలితరం రాజ్యసభ సభ్యుడు, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే తలారి మనోహర్‌ చిన్న కోడలు. మనోహర్‌ పెద్ద కుమారుడు తలారి ఆదిత్య 2014-19 నడుమ సత్యవేడు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచీ గెలిచిన సంగతి తెలిసిందే. విద్యాధికురాలైన యువతి కావడం, తల్లి సీనియర్‌ బ్యూరోక్రాట్‌గా పనిచేసివుండడం, భర్త వైపు నుంచీ మామ, బావ ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసి వుండడంతో ఆమె తిరుపతి ఎంపీ స్థానానికి దీటైన అభ్యర్థి కాగలదని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీకి సాంప్రదాయకంగా వున్న బలానికి తోడు పొత్తు కారణంగా జనసేన మద్దతు అదనపు బలం కానుంది. నీహారిక అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

Updated Date - Jan 28 , 2024 | 01:23 AM