Share News

అమ్మ కల నెరవేరిన క్షణం

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:52 AM

అమ్మ కల నెరవేరిన ఆ క్షణం.. అపురూపమైనది. ఆనందం అర్ణవమై.. ఆ తల్లి కనుకొలకుల్లో నీళ్లు తొణికిసలాడిన ఆ దృశ్యం.. జిల్లా కలెక్టరేట్‌లో అందరి మనసులనూ తడి చేసింది.

అమ్మ కల నెరవేరిన క్షణం

తిరుపతి జిల్లా కలెక్టర్‌గా తల్లిదండ్రుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీశా

‘‘శ్రీవారి ఆశీస్సులతో, తల్లిదండ్రుల, గురువుల, పెద్దల ఆశీర్వాదాలతో బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు సంతోషంగా ఉంది.తిరుపతి చారిత్రాత్మక జిల్లా. ఆధ్మాత్మికంగానూ, మతపరంగానూ, అభివృద్ధిపరంగానూ రాష్ట్రంలో ప్రముఖమైనది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం సహకారంతో అందరినీ సమన్వయం చేసుకుంటూ తిరుపతిని ఉత్తమ జిల్లాగా నిలబెట్టడానికి కృషి చేస్తా.ఏ ఐఏఎస్‌ అధికారి కెరీర్‌లో అయినా ఎన్నికల్లో పనిచేయడమనేది అతి ముఖ్యమైన సందర్భం. ఈ అవకాశాన్ని ఛాలెంజిగా స్వీకరిస్తున్నాను. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారుల మార్గదర్శకాలను, ఆదేశాలకు ఆనుగుణంగా పనిచేస్తా. జిల్లా నలుమూలలా ఏం జరుగుతోందో తెలుసుకోవడం నా ఒక్కడివల్లే సాధ్యం కాదు. మీడియానే కళ్ళూ, చెవులుగా పరిగణిస్తాను.’’

అమ్మ కల నెరవేరిన ఆ క్షణం.. అపురూపమైనది. ఆనందం అర్ణవమై.. ఆ తల్లి కనుకొలకుల్లో నీళ్లు తొణికిసలాడిన ఆ దృశ్యం.. జిల్లా కలెక్టరేట్‌లో అందరి మనసులనూ తడి చేసింది. తిరుపతి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేయగానే లక్ష్మీశాను ఆయన తల్లి లక్ష్మమ్మ హత్తుకుని, అల్లుకుని మాటలు పెగలని ఆనందం ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లాలో మారుమూలన ఉండే హోలుగుండనపల్లెలో నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టి పెరిగిన లక్ష్మీశా 2013లో ఐఏఎస్‌ సాధించినా జిల్లా కలెక్టర్‌గా ఇది ఆయన తొలి పోస్టింగ్‌. కర్నూలు జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా ప్రొబేషన్‌ పూర్తి చేసుకున్న ఆయన నూజివీడు సబ్‌ కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత పార్వతీపురం ఐటీడీఏ పీవోగా, తూర్పు గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, గ్రేటర్‌ వైజాగ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అటు తర్వాత ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా నియమితులయ్యారు. ఎన్ని బాధ్యతలు నిర్వహించినా ఐఏఎస్‌ సాధించినవారి జీవితంలో కలెక్టర్‌ హోదా అన్నది ప్రత్యేకమైనది. పేద తల్లిదండ్రులు ఎదురుచూసిన ఈ ప్రత్యేక సందర్భాన్ని లక్ష్మీశా తన కుటుంబం మొత్తంతో కలిసి బుధవారం సంతోషంగా పంచుకున్నారు. ఎన్నికల వేళ హఠాత్తుగా ఆయనను తిరుపతి కలెక్టర్‌గా బదిలీ చేశారు.కుటుంబసభ్యులందరితో కలిసి తిరుమల వెళ్లి బుధవారం వేకువజామున ఆలయంలో జరిగిన సుప్రభాత సేవలో పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు.తర్వాత కలెక్టరేట్‌కు చేరుకుని తిరుపతి జిల్లా రెండవ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జాయింట్‌ కలెక్టర్‌ శుభమ్‌ బన్సాల్‌, డీఆర్వో పెంచల కిషోర్‌, డీఐపీవో బాలకొండయ్య, వివిధ శాఖల అధికారులు, లక్ష్మీశాకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

విజయవాడ వెళ్ళిన కలెక్టర్‌

కాగా బుధవారం జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ లక్ష్మీశా అనంతరం కలెక్టర్‌ విజయవాడకు బయల్దేరి వెళ్ళారు. గురువారం అక్కడే వుంటారు.శుక్రవారం నుంచీ జిల్లాలో అధికార యంత్రాంగానికి, ప్రజలకు అందుబాటులో వుంటారు.

అమ్మ మనసు ఉప్పొంగిన వేళ..

జిల్లా నూతన కలెక్టర్‌గా లక్ష్మీశా బాధ్యతలు చేపట్టి, అధికారుల నుంచీ అభినందనలు, శుభాకాంక్షలు స్వీకరించిన అనంతరం ఓ సాదాసీదా పల్లెటూరి తరహా వృద్ధ దంపతులు ఆయన్ను సమీపించారు. వారిలో వృద్ధ మహిళ ఒక్కసారిగా ఆయన్ను హత్తుకుపోయారు. చూస్తున్న అధికారులు, మీడియా ప్రతినిధులు అయోమయానికి గురయ్యారు. అర్జీ ఇచ్చేందుకు వచ్చిన వృద్ధురాలు కలెక్టర్‌ను ఆప్యాయంగా కలిసి ఆలింగనం చేసుకున్నట్టుగా అందరూ భావించారు. అయితే కలెక్టర్‌ ఆమెను తన తల్లి లక్ష్మమ్మగా అక్కడున్న అందరికీ పరిచయం చేశారు. దూరంగా నిలుచున్న తండ్రిని, భార్యను, ఇద్దరు పిల్లలను, సోదరుని, అత్తామామలను కూడా పిలిచి పక్కన నుంచోబెట్టుకున్నారు. వారందరినీ కూడా అధికారులకు, మీడియా ప్రతినిధులకు పరిచయం చేశారు.

-తిరుపతి, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 01 , 2024 | 12:52 AM