జనసేనలోకి ఎమ్మెల్యే ఆరణి
ABN , Publish Date - Mar 08 , 2024 | 01:02 AM
వెంట పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు
చిత్తూరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరారు. మంగళగిరిలో గురువారం జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా వేసుకున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం, అధిష్ఠానం రాజ్యసభ ఇస్తానని చెప్పి కూడా మాట తప్పడం.. వంటి కారణాలతో ఆరణి ఇటీవల పవన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం చిత్తూరులో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తన ఆవేదనను, వైసీపీలో తనకు జరిగిన అవమానాలను చెప్పుకున్నారు. వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవిలో మాత్రం కొనసాగుతానని ప్రకటించారు. ముందుగా ప్రకటించినట్లే ఆయన గురువారం జనసేనలో చేరారు. ఆయనతో పాటు చిత్తూరు కార్పొరేటర్లు శ్రీకాంత్, ఏకే రవి, సునీత, పూర్ణచంద్రతో పాటు ఎస్‌ఆర్‌పురం, ఐరాల మండలాలకు చెందిన సర్పంచులు పవన్, లోకే్‌ష తదితరులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు.